మబ్బుచాటు మారీచ యుద్ధం

27 Mar, 2019 00:21 IST|Sakshi

జనతంత్రం

మరో పక్షం రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీకి ఎన్నికలు. మరోసారి ఎన్నికల్లో గెలుపొందడానికి అధికారంలో ఉన్న పార్టీ అనుసరిస్తున్న వ్యూహం ఎలా వుంది?!   
పక్కవాడి పతనాన్ని కోరుతూ చేతబడిలాంటి క్షుద్ర విద్యలను ఆశ్రయించే అనాగరికుడి ఆరాటంలాగ కనిపిస్తున్నది.  
ఆటలో ఓడిపోయి, నేనే గెలిచానని ఒప్పుకోవాలంటూ ఏడుపు లంకించుకునే పెంకి బాలుని తెంపరితనాన్ని గుర్తుకు తెస్తున్నది.  
యుద్ధ రంగం నుంచి పారిపోతూ ఊళ్లనూ, పంట చేలనూ తగులబెట్టే శత్రు సైనికుల ఉక్రోషంలాగ ఉన్నది.  
ఆ పార్టీ ప్రచార పర్వం పరాజితుని హాహాకారంలాగ వినబడుతున్నది.  
ఎందుకని?.. 
అధికారంలో ఉన్న పార్టీ మళ్లీ ఎన్నికలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు పాటించవలసిన ప్రజాస్వా మిక ధర్మం ఒకటున్నది. మేము అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో మీకిచ్చిన హామీలను ఈ రకంగా నెరవేర్చాము. మా పరిపాలన తీరును చూసి ఓటెయ్యండి అని అడగాలి. కానీ, ఏపీలోని పాలక పక్షం చేస్తున్నదేమిటి? పరిపాలన తీరుపై చర్చ జరగకుండా పక్క దారి పట్టిస్తూ.. కొన్ని కట్టు కథలను వండి వార్చే పనిలో తలమునకలై ఉన్నది. తమ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని రకరకాల సర్వేల ద్వారా నిర్ధా్దరణకు వచ్చిన ప్రభుత్వ పెద్దలు రెండు దశల అనైతిక యుద్ధానికి తెరతీశారు. మొదటి దశలో నాలుగైదు పక్షాలతో తెరచాటు పొత్తును తయారుచేశారు. ఎవరెవరు ఏయే సమయాల్లో ఎలాంటి పాత్ర పోషించాలో వివరిస్తూ ఒక పకడ్బందీ స్క్రిప్టును సిద్ధం చేసి పెట్టారు. రెండోదశగా ప్రధాన ప్రతిపక్షం విజయావకాశాలను దెబ్బతీయడానికి కొన్ని బేతాళ కథలను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చే పనిలో పడ్డారు.

అధికార నేత ‘తానా’ అనగానే ఉపనేతలు ‘తందానా’ అంటారు. ఈ పదిహేను రోజులూ మనం ఈ తంతును చూడబోతున్నాం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు మొత్తం ప్రధాన ప్రతిపక్షం వైపు పోకుండా కొంత చీల్చుకోవడం జనసేన బాధ్యత. ప్రధానంగా విజయవాడ నుంచి శ్రీకాకుళం వరకు ఈ పార్టీ క్రియాశీలకంగా ఉండాలి. రాయలసీమ, దక్షిణ కోస్తాలో కూడా యాక్టివ్‌గా రంగంలో ఉంటే ప్రభుత్వ ఓటు చీలే ప్రమాదం ఉన్నందున దీనిని నివారించాలి. విడిగా జనసేనతో పొత్తు కుదుర్చుకున్న బీఎస్‌పీకి 21 అసెంబ్లీ, 3 పార్లమెంట్‌ సీట్లిచ్చారు. ఎక్కువగా రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో ఇచ్చారు. దళితుల ఓట్లు గంపగుత్తగా వైసీపీకి పడకుండా ఈ పార్టీ ఎంతో కొంతమేరకు కత్తెర వేయాలి. తెలుగుదేశం గరుడ పురాణంపై పూర్తిగా అవగాహన లేకుండానే కమ్యూనిస్టు పార్టీలు అమాయకంగా ఈ కూటమిలో ఇరుక్కున్నాయనిపిస్తుంది. ఈ తెరవెనుక కూటమిలో కాంగ్రెస్‌ పార్టీ మరొక భాగస్వామి. పక్క రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ –టీడీపీలు ఏపీలో మాత్రం వ్యూహాత్మకంగా తెరచాటు పొత్తుకు సిద్ధపడ్డాయి. కాంగ్రెస్‌ పార్టీ పాత్ర ప్రధానంగా కృష్ణానది దిగువ ప్రాంతంలో వైసీపీ ఓట్లను చీల్చాలి. అందుకు బదులుగా కొందరు కాంగ్రెస్‌ నేతలకు పచ్చ కండువాలు కప్పి పార్లమెంట్‌ టికెట్లను టీడీపీ ప్రకటించింది. మరికొందరు కాంగ్రెస్‌ టికెట్‌పైనే అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు ‘సహకారం’ అందిస్తున్నది.  

కేఏ పాల్‌ అనే ఒక విచిత్రమైన పౌండ్రకవాసుదేవుడిని రంగంలోకి దింపి అతని పార్టీకి వైసీపీ ఎన్నికల గుర్తు తలపించే గుర్తు లభించేలా చూశారు. 75 అసెంబ్లీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపారు. ఆ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థుల పేరు ఏముంటే, అదే పేరు కలిగిన వారిని తీసుకొచ్చి నామినేషన్‌ వేయించారు. ఉదాహరణకు పరుచూరు నియోజకవర్గంలో సీనియర్‌ నేత దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీ అభ్యర్థి. అదే పేరున్న మరో వ్యక్తి చేత అక్కడ నామినేషన్‌ వేయించారు. పేర్లు సారూ ప్యంగా ఉన్నప్పుడు బ్యాలెట్‌లో పక్కపక్కనే ఉంటాయి. గుర్తు కూడా ఫ్యాన్‌ రెక్కల మాదిరే హెలికాప్టర్‌ రెక్కలు కూడా ఉండటంతో ఓటర్లు గందరగోళ పడే అవకాశం ఉంటుంది. పేరు ఒకే రకం. గుర్తు ఒకే రకం ఉన్నందువల్ల ప్రతిపక్ష ఓట్లు భారీగా చీలిపోతాయని తెలుగుదేశం పార్టీ ఆశ. కూటమి కూర్పు పూర్తయిన తర్వాత బేతాళకథల కార్యక్రమం ప్రారంభమైంది. మొదటి కథ ఉద్దేశం.. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి వ్యతిరేకంగా ప్రజల్లో ఒక సెంటిమెంట్‌ను రెచ్చగొట్టాలి. దీనికోసం ‘కేసీఆర్‌ బూచీ’ అనే కథను ప్రచారంలో పెట్టారు. తెరచాటు మిత్రులు కోరస్‌ అందుకున్నారు. ఎల్లో మీడియా దాన్ని 24/7 కార్యక్రమంగా నడిపిస్తున్నది.  

ఇంతకూ ఆ కథ సారాంశం ఏమిటి? .. పక్కరాష్ట్రంలో కేసీఆర్‌ అనే ముఖ్యమంత్రి గలరు. ఆయన పదేళ్ల కిందట ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సందర్భంగా ఆంధ్ర ప్రజలను పరిపరి విధాలుగా దూషించెను. పదేళ్ల తర్వాత అవి గుర్తుకు వచ్చి, ఇప్పుడు చంద్రబాబుగారి రక్తం సలసల మరుగుతున్నది. అటువంటి వ్యక్తితో ఇక్కడి ప్రతిపక్షనేత జగన్‌కు స్నేహమున్నది. జగన్‌ను గెలిపించడం కోసము కేసీఆర్‌ వేయికోట్లు ఖర్చు పెడుతున్నారు. జగన్‌ గెలిచినట్లయితే బందరు రేవు పట్టణాన్ని ఇక్కడ నుంచి పెకిలించి తెలంగాణలో పెట్టుకుంటారు... ఇలా సాగుతున్నది ఈ కథ. దీనికి పలు ఉపకథలూ, పిట్ట కథలూ, వ్యాఖ్యానాలు, ఉపాఖ్యానాలు య«థాశక్తి తోడవు తున్నవి. ఒక ఉపనాయకుడైతే మరీ రెచ్చిపోయి ‘అదిగో, తెలంగాణలో ఆంధ్రవాళ్లను కొడుతున్నారు. నాకు నా మనోఫలకంపై ఆ దృశ్యం కనిపిస్తున్నది...’ అంటూ స్క్రిప్టును దాటి నటించారు. బోనాల పండుగలో పూనకాల ఘట్టం గుర్తుకువచ్చింది. 

ఈ కథలో చెప్పినట్టు కేసీఆర్‌కూ – జగన్‌కూ ఉన్న స్నేహం గురించి చూద్దాము. రెండుమూడేళ్ల కిందట రాజ్‌భవన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎదురుపడ్డ కేసీఆర్‌కు జగన్‌ నమస్కారం చేశారు. అప్పుడు పక్కనే వున్న చంద్రబాబుకు కూడా నమస్కారం చేశారు. అదీ ముఖాముఖి పరిచయం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు, పక్క రాష్ట్రం ప్రతిపక్షనేతగా మర్యాదపూర్వకంగా ఫోన్‌ చేసి అభినందించారు. దేశవ్యాప్తంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్, కేటీఆర్‌ నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందాన్ని జగన్‌ వద్దకు పంపించారు. ఇదే విషయంపై అంతకుముందే మమతా బెనర్జీ, నవీన్‌ పట్నాయక్, దేవెగౌడ, స్టాలిన్, అఖిలేశ్‌ వంటి నేతలను టీఆర్‌ఎస్‌ బృందం కలిసింది. ఈ టీఆర్‌ఎస్‌ బృందం జరిపిన చర్చల వివరాలను బహిరంగంగా మీడియా ముందే వెల్ల డించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావడం తమ తక్షణ అవసరమనీ, అది ఇస్తానని రాసిచ్చిన వారికే ఎన్నికల అనంతరం తమ 25 మంది ఎంపీల మద్దతు ఉంటుందని జగన్‌ చెప్పారు. ఏపీ ప్రత్యేక హోదా టీఆర్‌ఎస్‌కు సమ్మతమేననీ, సాక్షాత్తూ పార్లమెంటులోనే పార్టీ ఎంపీ కవిత హోదాకు మద్దతుగా మాట్లాడారనీ టీఆర్‌ఎస్‌ బృందం గుర్తు చేసింది. కేసీఆర్‌ కూడా ఒక సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీ హోదాకు తన మద్దతు ఉంటుందనీ, అవసరమైతే ప్రధానికి ఒక లేఖ కూడా రాస్తానని ప్రకటించారు. ఇదీ స్థూలంగా వైఎస్‌ జగన్‌ – కేసీఆర్‌ల మధ్యన ఉన్న స్నేహబంధం. 

ఇప్పుడు చంద్రబాబు – కేసీఆర్‌ బాంధవ్యం గురించి కూడా చూద్దాము. మూడున్నర దశాబ్దాల పరిచయం వారిది. కేసీఆర్‌ నా శిష్యుడేనని, తానే అతనికి గురువుననీ చంద్రబాబు చాలాసార్లు చెప్పు కున్నారు. అందుకు తగినట్టుగానే ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడినా, జైలుకు పంపకుండా కేసీఆర్‌ చాలా ఔదార్యం చూపారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్‌ను బాబు ప్రత్యేకంగా ఆహ్వానించి గౌరవించారు. కేసీఆర్‌ నిర్వహించిన యాగానికి ప్రత్యేక అతిథిగా బాబు హాజరై తీర్థం, ప్రసాదం పుచ్చుకు న్నారు. డిసెంబర్‌లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు నందమూరి హరి కృష్ణ చనిపోయినప్పుడు, ‘మనం కలసి పనిచేద్దా’మని కేటీఆర్‌తో చంద్రబాబు సంప్రదింపులు చేశారు. ఈ సంగతి స్వయంగా బాబే చెప్పారు. 

ఇవన్నీ ఇటీవల జరిగిన ఘటనలే. ప్రస్తుతం చంద్రబాబు రక్తం సలసల మరగడానికి కారణమై సోకాల్డ్‌ కేసీఆర్‌ తిట్ల కార్యక్రమం తర్వాత అనేక ఏళ్ళకు సంభవించిన పరిణామాలు. వీటన్నిటినీ మించిన మరో ఫెవికాల్‌ బంధం వీరి మధ్యన ఉన్నదనడానికి వేడివేడి గరంగరం తాజా ఉదాహరణ. చంద్రబాబు నాయుడుకు అత్యంత విశ్వాసపాత్రుడు, వినయవిధేయుడూ, ఆయనకు బినామీ నెంబర్‌ వన్‌గా మన్ననలందుకున్న నామా నాగేశ్వరరావుకు ఖమ్మం నుంచి టీఆర్‌ఎస్‌ లోక్‌సభ టికెట్‌ లభించింది. దీని భావమేమి తిరుమలేశా!  వారిద్దరి మధ్యన ‘మ్యూచువల్‌ బెనిఫిట్‌ స్కీమ్‌’ ఏదో ఉందని జనం అనుకుంటే తప్పేమైనా వుందా! చంద్రబాబు ప్రభుత్వం పరిపాలనపై ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేశారు. పిట్ట కథల ప్రచారంతో, టక్కుటమార వ్యూహాలతో గట్టెక్కాలనుకోవడం తెలివితక్కువతనమవుతుంది. 

ఏడీఆర్‌ అనే సంస్థ ఇటీవల దేశవ్యాప్తంగా జరిపిన ఒక సర్వేలో ఆంధ్రప్రదేశ్‌ పరిపాలన అత్యంత అధ్వానంగా ఉన్నట్లు వెల్లడైంది. తీవ్రమైన నిరుద్యోగ భారంతో యువత ఆగ్రహావేశాలతో వుందని వెల్ల డైంది. ఇంటికో ఉద్యోగమిస్తానని చెప్పారు. లేకుంటే నిరుద్యోగ భృతి అన్నారు. ప్రభుత్వం మోసగించిందని యువత అర్థం చేసుకున్నది. వారి కళ్లలో క్రోధాగ్నులు కనబడుతున్నాయి. అవి దహించకుండా ఉంటాయా? తన చేనులాగే, చెలకలాగే మనుషులంతా పచ్చగా ఉండాలని కోరుకుంటాడు రైతు. అతడు అజాత శత్రువు. అతడూ మోసపోయిన బాధలో ఉన్నాడు. ‘అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు... సాగరములన్నియు ఏకము కాకపోవు’ అని హెచ్చరించాడు
శ్రీకృష్ణపరమాత్ముడు. 
చంద్రబాబు ‘పసుపు – కుంకుమ’ ఇస్తానంటుంటే ఆడపడుచులు హడలిపోతున్నారు. చిన్నప్పుడెప్పుడో చదువుకున్న ‘చెరువు గట్టూ – ఓ ముసలి పులీ ... దాని చేతిలో బంగారు కంకణం...’ ఈ కథ గుర్తుకొస్తున్నదట. బాబోయ్‌ ముసలి పులి అని జడుసుకుంటున్నారు. 
ఈ పరిణామాలన్నీ స్వయంకృతం కనుక అనుభవింపక తప్పదు. 
ఓ సందేహం! 
పూర్వం సినిమాల్లో హీరో వేషాలు వేసినవాళ్లు రాజకీయాల్లోనూ హీరో వేషాలే వేశారు. ఇప్పుడేమిటో... సినిమాల్లో హీరో వేషాలు వేసినవాళ్లు... రాజకీయాల్లో జోకర్‌ వేషాలు వేస్తున్నారు. 
అబ్బో... కొటేషన్‌ అదిరిందిరోయ్‌...  
అరె సాంబ... ఇది రాసుకో...

వర్ధెల్లి మురళి

మరిన్ని వార్తలు