సాల్సా 4 వాటర్

24 Dec, 2013 22:27 IST|Sakshi
సాల్సా 4 వాటర్

డ్యాన్‌‌స చేస్తే ఏం వస్తుంది?
 ఆనందం!
 అంతేనా? సామాజికసేవకు కావలసిన చైతన్యం కూడా అంటున్నారు ఈ యువకులు...

 
వీళ్లు మామూలు విద్యార్థులు... మెరిట్ విద్యార్థులు ఎంతమాత్రం కాదు. గొప్ప విద్యావంతులుగానో, వ్యాపారవేత్తలుగానో ఎదిగే అవకాశం లేనివారు. అయినా తమకు చేతనైనంతలో సేవ చేసి చూపిస్తున్నారు!
 
 ప్రస్తుతం ప్రపంచంలో తాగడానికి సురక్షితమైన నీటి సదుపాయం లేని వారి సంఖ్య 783 మిలియన్లు (ఒక మిలియన్‌కి పదిలక్షలు). ఇంకోరకంగా చెప్పాలంటే ప్రపంచ జనాభాలో ప్రతి పదిమందిలో ఒకరికి సురక్షితమైన నీరు అందుబాటులో లేదు. దీనివల్ల వారికి అనారోగ్యపరమైన సమస్యలు వస్తున్నాయి. చిన్నారులకు అత్యంత భయంకరమైన వ్యాధులు సోకుతున్నాయి. ఈ విషయం తెలిసినప్పుడు ఎవరైనా బాధపడతారు. గ్లాస్గో యూనివర్సిటీలో చదువుతున్న కొంతమంది విద్యార్థులకు కూడా ఇలాగే బాధేసింది. ట్రెండీ, మోడ్రన్, అర్బనైజ్డ్ అయిన వీరు ఈ విషయంలో బాధపడి ఊరుకోలేదు, తామేం చేయలేం... అనే అభిప్రాయానికి రాలేదు. మనసుంటే మార్గం ఉంటుందన్నట్టుగా... వాటర్ విషయంలో వారి వితరణ మొదలైంది.
 
 సాల్సాను సొమ్ముచేసుకొన్నారు!
 
 యూకే పరిధిలోని యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో ‘సాల్సా’  అంటే పిచ్చి. సాల్సా వచ్చిన వాళ్లు మిగిలిన వారి దృష్టిలో ఆరాధ్యులే! అలాంటి సాల్సా డాన్స్ నేర్చుకొని వర్సిటీలో హీరోలు అయిపోదామని చాలామంది స్టూడెంట్స్ అనుకొంటుంటారు. అలాంటి నేపథ్యంలో సాల్సాకూ చారిటీకి ముడిపెట్టారు కొంతమంది స్టూడెంట్స్. తాము సాల్సా డాన్స్ నేర్పిస్తామని, నేర్చుకొన్నవారు డబ్బు చెల్లించాల్సి ఉంటుందని, ఆ డబ్బును పేద ప్రజలకు మంచినీటిని అందించేందుకు వినియోగిస్తామని  ప్రకటించారు. అలా ‘సాల్సా 4 వాటర్’ స్టూడెంట్స్ ఎన్జీవో ప్రస్థానం మొదలైంది.
 
 అనేక వర్సిటీలకు...
 
 ఒక మనిషికి ఒక ఏడాది పాటు సురక్షితమైన నీటిని అందివ్వడానికి అయ్యే ఖర్చు 15 పౌండ్లు (ఒక పౌండ్ అంటే రూ.101)గా లెక్కగట్టారు విద్యార్థులు. ఈ లెక్కన వీలైనంత ఎక్కువమంది కోసం తాము నిధుల సేకరణ చేపట్టాలని  భావించారు. చారిటీ కార్యక్రమం గురించి సమాచారం అందుకొని వర్సిటీలో నూటయాభై మంది డాన్స్ మాస్టర్‌లు ముందుకొచ్చారు. నేర్చుకోవాలనుకొంటున్నవారు ఒక్కో క్లాస్‌కు మూడు పౌండ్లు చెల్లించాల్సి ఉంటుంది. అలా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో మొదలైన ఈ నిధుల సేకరణకార్యక్రమం ఇప్పుడు యూకే మొత్తం విస్తరించింది. అనేక వర్సిటీల్లో ఊపందుకొంది. యువతీ యువకుల ఆదరణ చూరగొంది.
 
 సూపర్ సక్సెస్ అయ్యింది!
 
 సాల్సా ద్వారా వీరంతా కలసి ఇప్పటివరకూ వేల డాలర్ల నిధులు సేకరించారు. వేలాది మందికి సురక్షిత నీటి సదుపాయాన్ని కలిగించారు. ఈ స్టూడెంట్స్ స్ఫూర్తి మిగతా దేశాలకూ పాకింది. చెక్ రిపబ్లిక్, స్వీడన్, ఫ్రాన్స్ దేశాల్లోని అనేక వర్సిటీల్లో ‘సాల్సా 4 వాటర్’ ఎన్జీవో కార్యక్రమాలు విస్తరించాయి. వివిధ వ్యాపారసంస్థలు ఈ ఎన్జీవోకి అవార్డులు, రివార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి.
 
సాల్సాకు ఉన్న క్రేజ్‌ను చారిటీగా మార్చాలనే ఐడియా శామ్ కండల్ అనే గ్లాస్గో యూనివర్సిటీ విద్యార్థిది. అయితే కార్యాచరణలో వర్సిటీలోని అందరి విద్యార్థులదిగా మొదలైంది. ఉమ్మడిగా, ఉత్సాహంగా ఊపందుకొంది. సామాజికసేవకు తమ వంతు సహకారాన్ని అందిస్తోంది.
 
ఛారిటీ కార్యక్రమం గురించి సమాచారం అందుకొని వర్సిటీలో నూటయాభై మంది డాన్స్‌మాస్టర్‌లు ముందుకొచ్చారు. నేర్చుకోవాలనుకొంటున్న వారు ఒక్కో క్లాస్‌కు మూడు పౌండ్లులు చెల్లించాల్సి ఉంటుంది. అలా యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గోలో మొదలైన ఈ నిధులసేకరణ కార్యక్రమం ఇప్పుడు  యూకే మొత్తం విస్తరించింది. అనేక వర్సిటీల్లో ఊపందుకొంది.

 

మరిన్ని వార్తలు