15 ఏళ్లకు న్యాయం

9 May, 2017 00:26 IST|Sakshi
15 ఏళ్లకు న్యాయం

బిల్కిస్‌ బాను
గుజరాత్‌ గాయం


బిల్కిస్‌ బాను. 2002 గుజరాత్‌ మారణహోమం ఉదంతాలను అనుసరించినవారికి తప్పనిసరిగా గుర్తుండే పేరు. నిన్న– అంటే మే 8న ఢిల్లీలో ఒక ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో ఆమె ఉద్వేగపూరితంగా పత్రికలవారితో మాట్లాడింది. ‘ఇన్నాళ్లకైనా నాకు న్యాయం దక్కింది. ఈ దేశంలో న్యాయం కోసం ఎదురు చూసే వారికి ఈ తీర్పు భరోసానిస్తోంది’ అని ఆమె అంది. నాలుగు రోజుల క్రితం (మే 4)న ముంబై హైకోర్టు ఆమెపై పాశవికదాడి చేసిన 11 మందికి ట్రయల్‌ కోర్టు వేసిన శిక్షను ఖరారు పరిచింది. అంతే కాదు, సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నించిన ఏడు మంది పోలీసులను, డాక్టర్లను కూడా దోషులుగా తేల్చింది. బిల్కిస్‌బానుకు సంబంధించి మాత్రమే కాదు గుజరాత్‌ మారణకాండకు సంబంధించి కూడా ఇది ముఖ్యమైన తీర్పు.

గర్భిణిపై అత్యాచారం చేసి పసిబిడ్డను చంపి...
2002లో గోధ్రా రైలు దుర్ఘటన తర్వాత గుజరాత్‌లో అల్లర్లు చెలరేగాయి. అహ్మదాబాదుకు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న రాధిక్‌పూర్‌ గ్రామంలో భర్తతో పాటు నివసిస్తున్న బిల్కిస్‌బానుకు అప్పుడు వయసు 18. గుజరాత్‌ అల్లర్లు ఆ ఊరికి కూడా పాకడంతో అప్పటికే చుట్టుపక్కల ఉన్న 60 ముస్లిం కుటుంబాల ఇళ్లను తగులబెట్టారు. బాధితులతో పాటు బిల్కిస్‌ కూడా తన కుటుంబంతో పొలాలలో పరిగెత్తి ప్రాణాలు కాపాడుకుంది. అప్పటికి ఆమె గర్భవతి. మూడేళ్ల కుమార్తె కూడా ఉంది. రెండు మూడు రోజులు వారు ఊరికి దూరంగా ఉన్న గుట్టల్లో పొదల్లో ప్రాణాలు కాపాడుకుని ముస్లింలు ఎక్కువగా ఉన్న ప్రాంతానికి పారిపోదామనుకున్నారు. మార్చి 3, 2002న ఒక మట్టి మార్గం గుండా వాళ్లు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా రెండు ట్రక్కుల్లో ముష్కరులు ‘చంపండి... నరకండి’ అని నినాదాలు ఇస్తూ వాళ్లను చుట్టుముట్టారు. బిల్కిస్‌పై అఘాయిత్యానికి పాల్పడ్డారు.

‘వాళ్లంతా మా ఊరి వాళ్లే. చిన్నప్పటి నుంచి నేను చూసినవాళ్లే. వాళ్లే నా పట్ల అత్యంత అమానుషంగా ప్రవర్తించారు’ అని బిల్కిస్‌ ఉద్వేగభరితమైంది. వాళ్లు మొత్తం 11 మంది. ఒకడు ఆమె చేతిలోని మూడేళ్ల కుమార్తెను నేలకు కొట్టి అప్పటికప్పుడు చంపేశాడు. మిగిలినవారంతా ఆమెను వివస్త్రను చేసి అత్యాచారానికి పూనుకున్నారు. ‘నేను గర్భవతిని వదిలేయండి అంటున్నా వాళ్లు వినలేదు’ అంది బిల్కిస్‌. ఆమెపై అత్యాచారం చేయడమే కాదు ఆమె కుటుంబానికి చెందిన మొత్తం 13 మందిని దారుణంగా చంపేశారు. అపస్మారకంలో పడి ఉన్న బిల్కిస్‌ ఆ తర్వాత మూడు రోజులకు కోలుకుని శరణార్థుల శిబిరంలో పోలీసులకు ఫిర్యాదు చేయగలిగింది.

పట్టించుకోని పోలీసులు...
అయితే స్థానిక పోలీసులు ఆమె ఫిర్యాదును పట్టించుకోలేదు. దోషులను అరెస్టు చేయండి అంటే వినలేదు. దిగువ కోర్టులో కేసు కూడా ‘తగిన సాక్ష్యాధారాలు లేనందున’ నిలువలేదు. అయితే బిల్కిస్‌ తన పోరాటాన్ని మానలేదు. మానవ హక్కుల సంఘం ద్వారా సుప్రీం కోర్టును ఆశ్రయించి తన కేసును సిబిఐ విచారించేలా ఆదేశాలు పొందగలిగింది. స్థానిక పోలీసులు, సిఐడిలు తనను వేధిస్తున్నందున సిబిఐ విచారణ కోరుతున్నానని ఆమె చేసిన విన్నపాన్ని అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది. సిబిఐ రంగంలో దిగిన వెంటనే బిల్కిస్‌ కేసులోని తీగలన్నీ కదిలాయి.

బిల్కిస్‌ కోల్పోయిన 13 మంది కుటుంబ సభ్యులను పోస్ట్‌మార్టం చేసిన డాక్టర్లు వారిని గుర్తు పట్టకుండా తలలు వేరు చేశారని, గోరీలలోని శవాలు త్వరగా పాడయ్యేలా చేశారని, సామూహిక ఖననం చేసి కేసు ఆనవాలు పట్టకుండా ఉండేలా జాగ్రత్తలు పడ్డారని విచారణలో తేలింది. గుజరాత్‌లో పారదర్శకమైన న్యాయవిచారణకు అవకాశం లేనందున సుప్రీంకోర్టు విచారణను గుజరాత్‌ నుంచి మహారాష్ట్రకు బదిలీ చేసింది. అక్కడ బిల్కిస్‌ కేసును ప్రత్యేక కోర్టు విచారణ చేసి 2008లో 11 మంది నిందితులకు యావజ్జీవకారాగార శిక్ష తీర్పు వెలువరించగా నిందితులు హైకోర్టును ఆశ్రయించారు.

మే 4, 2017
బిల్కిస్‌ కేసును విచారించిన ముంబై హైకోర్టు తీర్పు వెలువరించింది. ప్రత్యేకకోర్టు విధించిన శిక్షనే అది బలపరిచింది. 11 మంది నిందితులు (ఒకరు మరణించారు) యావజ్జీవకారాగార శిక్ష పొందారు. వీరిలో ముగ్గురిని ఉరి తీయాలని సిబిఐ వాదించగా కోర్టు వారి వాదనను తోసిపుచ్చింది. ‘ఉరిశిక్ష కోరి నేను ప్రాణానికి ప్రాణం బదులు తీర్చుకోవాలనుకోవడం లేదు. నాకు కావలసింది న్యాయం. అది దక్కింది’ అని బిల్కిస్‌ పేర్కొంది. ఇన్నాళ్లు ఈ కేసు కోసం బిల్కిస్, ఆమె భర్త యాకుబ్‌ రసూల్‌ రహస్యంగా జీవిస్తూ వచ్చారు. నిందితుల వల్ల ప్రాణహాని ఉండటమే దీనికి కారణం.

‘గుజరాత్‌ మారణకాండ వంటిది ఏ దేశంలో ఎక్కడా జరగకూడదు. ఈ దేశంలో అసలు జరగకూడదు. జరిగినప్పుడు ఆలస్యమైనా సరే న్యాయం జరుగుతుందనే నమ్మకం, నేరం చేస్తే శిక్ష ఏదో ఒకనాటికి పడి తీరుతుందనే భయం ఉండాలంటుంది. బిల్కిస్‌ కేసు తీర్పు ఈ రెండు విషయాలనూ నిర్ధారణ చేస్తోంది. కచ్చితంగా ఇది న్యాయం కోసం చేసిన ఒక స్త్రీ విజయపోరాటం.’ అని బిల్కిస్‌ మద్దతుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా