ఒకే ముహూర్తంలో శ్రీరామ జననం కల్యాణం వనవాసం

3 Apr, 2014 22:19 IST|Sakshi
ఒకే ముహూర్తంలో శ్రీరామ జననం కల్యాణం వనవాసం

సందర్భం - 8న శ్రీరామ నవమి

ఎంతో బాగా అర్థమైనట్లు కనిపించేది, లోతుగా ఆలోచిస్తేగానీ ఓ పట్టాన అర్థం కానిదీ శ్రీమద్రామాయణం. అందుకే ఈ రామకథకు ఎందరు ఎన్ని కాలాల్లో ఎన్నెన్ని వ్యాఖ్యానాలను చేస్తున్నా, అందరికీ అన్నన్ని కొత్తకొత్త విశేషాలు కనిపిస్తూనే ఉన్నాయి. వాటిల్లోని ఒక కొత్త విశేషం... రాముడు రావణుని వధ కోసం చక్కగా, చిక్కగా ఓ ప్రణాళికను రచించి, అందులోని ప్రతి సంఘటనకీ ఓ కాల నిర్ణయాన్ని (ముహూర్తాన్ని) చేయడం.
 
రాముని పుట్టుక
 తత శ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ
 నక్షత్రే  దితి దైవత్యే స్వోచ్ఛ సంస్థేషు పంచసు॥
 
మహా నియమవంతుడు, శివపూజా ధురంధరుడూ అయిన రావణుణ్ణి సంహరించేందుకు శ్రీహరంతటివానికి ఓ గట్టి ముహూర్తాన్ని నిర్ణయించుకోవలసి వచ్చింది. అందరూ తపస్సు చేస్తున్న వేళ అకస్మాత్తుగా ప్రత్యక్షమై వరాలిచ్చే శ్రీహరికి ఇంతగా ముహూర్తాన్ని నిర్ణయించుకుని జన్మించవలసిన అవసరం రావడానికి కార ణం, రావణునికి ఉన్న తపోబలమే.
 
12వ నెలలో (మనుష్యజాతి 10 వ నెలలో కదా పుడుతుంది), చైత్రమాసంలో (చైత్రే మధుర భాషే స్యాత్- శత్రువుక్కూడా రుచించేలా మాట్లాడగల శక్తి ఈ మాసంలో పుట్టినవారికి ఉంటుంది. అందుకే అప్పటి వరకు తిట్టిన వాలి కూడా రాముడు మాట్లాడడం ప్రారంభించినంతనే మౌనంగా ఉండి విన్నాడు. తప్పయిందని వేడుకున్నాడు), నవమి తిథిలో (నిర్భయ స్సర్వ భూతేఖ్యో నవమ్యా ముపజాయతే- శత్రువుక్కూడా భయపడకుండా మాట్లాడేతనం నవమినాడు జన్మించిన వారికి ఉంటుంది), పునర్వసు నక్షత్రంలో (ఇది ధనుస్సు ఆకారంలో 5 నక్షత్రాల కూడికతో ఉంటుంది కాబట్టి తనది ధర్మమా? కాదా? అనే అంశాన్ని తనకి తాను తన బాణ ప్రయోగం ద్వారా తెలుసుకుంటాడు ఈ జాతకుడు. అందుకే రాముడు నిత్య ధనుర్ధారి. (ధనువంటే విల్లు కాదు, ధర్మం అని అర్థం). ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా తనని తాను రామునిగా పుట్టించుకోవాలనుకున్నాడు శ్రీహరి. ఆ ప్రణాళికనే అమలు చేస్తూ అలానే జన్మించాడు కూడా!
 
కల్యాణం, పట్టాభిషేకం
 
ఇలాంటి ముహూర్తంలో పుడితే తప్ప ఉత్తర ఫల్గుణీ నక్షత్రంలో పుట్టిన సీతమ్మ తనకి భార్య కాదు. ఆమె భార్యగా కాని పక్షంలో సీతాపహరణ ఘట్టం ఉండదు. ఆ ఘట్టమే లేని సందర్భంలో శ్రీమద్రామాయణ కథే లేదు. అంతటి ప్రణాళికతో తాను పుట్టి ఉండబట్టే 12వ నెలలో పుట్టిన తనకి, సరిగ్గా 12 సంవత్సరాల వయసులో తన వద్దకు విశ్వామిత్రుడు వచ్చి 12 మాసాల పర్యంతం రాముణ్ణి తన వెంట తిప్పుకున్నాక, 12 రోజుల వ్యవధిలో శివధనుర్భంగం, వివాహానికి తరలివెళ్లడం, వివాహం ముగించుకోవడం అనే ఈ కథంతా సవ్యంగా జరిగింది.
 
అంతేకాదు, ఈ కథని గ్రంథస్థం చేసిన వాల్మీకి మహర్షి కూడా 2 ్ఠ 12 కోట్ల మార్లు చేసిన రామనామ జపాన్ని ముగించడం కూడా సశాస్త్రీయంగా జరిగింది. అలాగే ఆ సీతారాముల జంట సరిగ్గా 12 సంవత్సరాల పాటు కాపురం చేసిందో లేదో రాజ్యపట్టాభిషేక ఘట్టం ప్రారంభమయింది. సరిగ్గా 12 గంటల వ్యవధిలో పట్టాభిషేకం భంగమై అరణ్యాలకు వెళ్లవలసి వచ్చింది. (ఉషిత్వా ద్వాదశ సమాః).
 
సరిగ్గా 12 నెలల కాలం పాటు అరణ్యంలో సీతారామలక్ష్మణులు తిరిగారో లేదో రావణుని వధకు అవసరమైన తపోశక్తి కోసం రాముడు మహర్షుల ఆశ్రమాలకు వెళ్లి మరీ ప్రార్థించాడు. వారంతా తపోఫలాన్ని ధారపోస్తే అప్పుడు శూర్పణఖ వచ్చింది... ఆనాటి రాముని పుట్టుకకు పెట్టిన ముహూర్త బలానికి అనుగుణంగా! అంతే, 12 గడియల కాలంలో రామునితో శూర్పణఖ విరోధాన్ని ఏర్పాటు చేసుకుంది. రావణుని వద్దకు వెళ్లింది. అలా కథని నడిపింది. ఖర దూషణ త్రి శిరాది రాక్షసులతో పాటు 14 వేల మందిని వధించే ఏర్పాటు చేసింది. అదికూడా 12 గడియల కాలంలోనే. అదొక్కటే కాదు, రామ విరోధాన్ని రావణునికి కలిగించి రామునితో యుద్ధం చేయాలనే బుద్ధిని కూడా పుట్టించింది.
 
అతడే శ్రీహరి!
 
రాముడు మానవుడు కాదు కాబట్టే 10 వ నెలలో కాక, 12వ నెలలో జన్మించాడు. ఈ జన్మించడం అనేది ఓ సూచన అన్నమాట... ఇతడు శ్రీహరే సుమా! అని. అందుకే వివాహం కూడా ఆ పుట్టిన తిథి నాటి 12 గంటల వేళకే ఏర్పాటు చేశాడు వశిష్ఠుడు. దీన్ని గ్రహించిన మరో దైవజ్ఞుడు అహల్యాగౌతమ పుత్రుడు శతానందుడు జనకుణ్ణి దీవిస్తూ - నీ జన్మ ధన్యం అన్నాడు.
 
లోకంలో సాధారణులమైన మనం ఎన్నో విధాల ఏర్పాట్లను చేసుకుని సక్రమంగా అమలు చేసుకోలేకపోతుంటాం. ఇన్ని సమాచార వ్యవస్థలుండీ సక్రమ కార్యాచరణని మనం చేసుకోలేకపోతూంటే, కేవలం తపశ్శక్తిని మాత్రమే సమాచార వ్యవస్థగా చేసుకుని వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, శతానందుడు, భరద్వాజుడు అటు రావణునితో సహా అందరూ కూడా కథని నడిపించగలిగారంటే ఆ ప్రణాళికా రచనం అత్యద్భుతం కాదూ!
 
ఈ ముహూర్తపు గొప్పతనాన్ని గ్రహించిన భరతుడు కూడా రామునితో... 14 సంవత్సరాలు ముగిసిన మర్నాడు అయోధ్య నగరానికి నువ్వు రాని పక్షంలో ఇక్కడే ప్రాతఃకాల సూర్య సమక్షంలో అగ్నికాహుతినౌతా’నన్నాడు. (యది త్వాంతు న ద్రక్ష్యామి ప్రవేక్ష్యామి హుతాశనమ్‌).
 
ఇంతటి పట్టాభిషిక్తుడైన రాముడు కూడా వైకుంఠానికి వె ళ్లాల్సి ఉంది కాబట్టే 11 వేల సంవత్సరాలే పరిపాలించి 12 వేల సంవత్సరం ప్రారంభం కాకుండానే రాజ్యాన్ని ముగించి సరయూ నదిలో ప్రవేశం చేశాడు. ద్వాదశ నామాలు (హనుమానంజనా సూను... ద్వాదశైతాని నామాని) తనవైన ఆంజనేయుడు మాత్రం రామకథా వ్యాప్తికి ఇక్కడే ఉండిపోయాడు చిరంజీవిగా. ఇంత ప్రణాళికాబద్ధమైన, అంతటి ముహూర్త గొప్పదనం కల చైత్రే శుద్ధ నవమిని వివరించాలంటే కొంత జ్యోతిషబలం కూడా ఉండాలి.
 
 - డా॥మైలవరపు శ్రీనివాసరావు
 

మరిన్ని వార్తలు