ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు...ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు!

14 Sep, 2013 23:24 IST|Sakshi
ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు...ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు!

ప్రయత్నం... ఎలాగైనా ఉండొచ్చు.
 అసలంటూ ఉండాలి.
 ఎమ్మెస్ నారాయణ చాలా ప్రయత్నాలు చేశారు.
 చదువుకోడానికో ప్రయత్నం.
 (నాన్నకు ఇష్టం లేదు) లెక్చరర్ అవడానికో ప్రయత్నం.
 (జీతం ఎక్కువ రాదు) సినీ రచయిత అయే ప్రయత్నం.
 (పడిన కష్టం ఒకటి కాదు)  నటుడిగా నిలబడే ప్రయత్నం.
 (నో రెస్ట్, నో ఫియర్) కొడుకుని హీరో చేసే ప్రయత్నం.
 (లాస్‌ని లెక్కే చేయలేదు).
 గెలిచామా ఓడామా అని కాదు...
 ప్రయత్నం చేశామా? లేదా?
 ఇదీ ఎమ్మెస్ ఫిలాసఫీ!
 జీవితం ఆయనకి ఫస్ట్ టెస్ట్ పెట్టినరోజు...
 చిన్న కాగితం ముక్కమీద ఏం రాసుకున్నారో తెలుసా?
 ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు... ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు’.
 ఇలాంటి మనిషిని...
 ఎన్ని టెస్టులు మాత్రం ఏం చెయ్యగలవు?
 ఈవారం ‘తారాంతరంగం’ చదవండి.
 అప్రయత్నంగా మీరూ ఏదో ఒకజీవిత సత్యాన్ని...
 కాగితం ముక్కపై రాసుకుంటారు!

 
 ఎమ్మెస్‌గారూ... ఓసారి మీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్దామా?
 ఎమ్మెస్: పశ్చిమ గోదావరి జిల్లాలో నిడమర్రు అనే అందమైన పల్లెటూరు మాది. మేం ఏడుగురు అన్నదమ్ములం, ముగ్గురు అక్కాచెల్లెళ్లు. అప్పటికి ఊరినిండా మట్టి రోడ్లు. అందరికీ సైకిళ్లే ఆధారం. మోటార్ సైకిల్ ఉందంటే దొరబాబు కింద లెక్క. ఊళ్లో పెద్దగా చదువుకున్నవాళ్లు లేరు. మా మేనమామ సత్యంగారు బీఏ చదివితేనే గ్రేట్‌గా చూసేవాళ్లు. నాన్నగారు వ్యవసాయం చేసేవారు. చదువంటే ఆసక్తి లేదాయనకు. నాకేమో బాగా చదువుకోవాలని ఉండేది. కానీ నాన్నగారు నాతో పొలం పనులు, పశువుల కాపలా చేయించేవారు.
 
 మరి మీ చదువు ఎలా సాగింది?
 ఎమ్మెస్: నాన్న ఎన్ని చెప్పినా నా దారి నాదే. ఆయన అలా వెళ్లగానే ఇలా నేను పొలం నుంచి పారిపోయేవాణ్ణి. మళ్లీ మా నాన్నగారు స్కూల్‌కి వచ్చి తీసుకెళ్లేవారు. అలా చిన్నప్పట్నుంచి చదువు, వ్యవసాయం రెండూ కలగలుపుగా పెరిగాను. అలా అలా ఐదోతరగతి వరకు బండి లాగించాను. ఆ తర్వాత మా ఊళ్లో హైస్కూల్ పెట్టారు. మూర్తిరాజుగారని పత్తేపురంలో ఓరియంటల్ కాలేజ్ పెట్టారు. పెద్ద చరిత్ర ఉన్న వ్యక్తి. మంత్రిగా కూడా చేశారు. ఆయన వెస్ట్ గోదావరిలో 60 స్కూల్స్, 12 కాలేజీలు పెట్టారు. మూర్తిరాజుగారితో నాకు మంచి అనుబంధం ఏర్పడి, ఆయన పెట్టిన హైస్కూల్‌లో చదువుకుని, ఆ తర్వాత పత్తేపురంలోని ఓరియంటెల్ కాలేజీలో చదివాను. అక్కడే భాషా ప్రవీణ పాసయ్యాను. ఆ తర్వాత ఆయన స్కూల్లోనే ఉద్యోగం ఇచ్చారు.
 
 మీ చదువు విషయంలో మీ అమ్మగారి ప్రోత్సాహం ఎలా ఉండేది?
 ఎమ్మెస్: మా నాన్నగారు చదువుకోలేదు కానీ, మా అమ్మగారు చదువుకున్నారు. ఆవిడ బాగా ప్రోత్సహించేవారు. పత్తేపురం కాలేజీలో చదువుతున్నప్పుడు నాన్నగారికి తెలియకుండా అమ్మ నాకు బట్టలు, బియ్యం పంపించేవారు.
 
 అసలు మీ నాన్నగారికి చదువంటే ఎందుకిష్టం లేదు?
 ఎమ్మెస్: మనుషులను నమ్మితే లాభం లేదు.. మట్టిని నమ్ముకుంటే అన్నం పెడుతుంది అనేవారు. కానీ ఓసారి నా చదువు గురించి మా ఊరి కరణంగారు, మరికొంతమంది ‘మీవాడు సంస్కృతం చదువుతున్నాడు. మా పిల్లల్ని చదివించాలని ఉన్నా చదువుకోలేకపోతున్నారు’ అనడంతో నాన్నగారు కన్విన్స్ అయ్యి, అప్పట్నుంచీ చదువుకోమని ప్రోత్సహించారు.
 
 ఆ సమయంలోనే కొన్ని రచనలు చేశారట?
 ఎమ్మెస్: హైస్కూల్‌లో పని చేస్తున్న సమయంలో 1977 నవంబర్ 19 అర్ధరాత్రి దివిసీమ ఉప్పెనలు వచ్చాయి. అక్కడికెళ్లి, శవాలను చూసి కదిలిపోయాను. ఆ మానసిక స్థితి నన్ను ‘జీవచ్ఛవాలు’ అనే నాటిక రాసేలా ప్రేరేపించింది. ఆ నాటికను జిల్లా అంతా ప్రదర్శించి, బట్టలు, బియ్యం సేకరించి, బాధితులకు అందజేశాం. ఆ నాటికలో నేను యాక్ట్ చేయలేదు. హైస్కూల్ పిల్లలతో యాక్ట్ చేయించాను. నాది రచన, దర్శకత్వం మాత్రమే.
 
 టీచర్‌గా మీ ప్రస్థానం గురించి...
 ఎమ్మెస్: తెలుగు పండిట్‌గా చేస్తూ.. ఎంఏకి కట్టాను. ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యాను. భీమవరంలోని కేజీఆర్ కాలేజీలో లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించాను. అదప్పుడు ఎయిడెడ్ కాలేజ్ కాదు... అన్‌ఎయిడెడ్. అందుకని నాకు 250 రూపాయలు మాత్రమే జీతం ఇచ్చేవారు. కానీ అంతకు ముందు మున్సిపల్ హైస్కూల్‌లో నాకు ఎనిమిది వేల రూపాయలు వచ్చేవి. లెక్చరర్ అవాలనే ఆకాంక్షతో ఆ జాబ్‌కి రిజైన్ చేసి, తక్కువ జీతమైనా కాలేజీలో చేరాను. ఆ తర్వాత రెండేళ్లకు ఎయిడెడ్ అయ్యింది. దాంతో పూర్తి జీతం వచ్చింది.
 
 కాలేజ్‌లో పని చేస్తున్నప్పుడూ మీ నాటక రచన కంటిన్యూ అయ్యిందా?
 ఎమ్మెస్: మా కాలేజీకి నేనే ఫైన్‌ఆర్ట్స్ కన్వీనర్‌ని. నాటకాల మీద ఇంట్రస్ట్ ఉన్నవారిని తీసుకుని, ‘ప్లస్ అండ్ ఇంటూ ఆర్ ఈక్వల్’ అనే నాటిక రాశాను. ప్లస్ అంటే కలిసి ఉండటానికి గుర్తు. ఇంటూ అనేది వ్యతిరేకతకు గుర్తు. కానీ ఈ రెండూ ఏదో ఒకచోట కలవక తప్పదనేది ఈ నాటిక సారాంశం. ఆంధ్రా యూనివర్శిటీ ‘యూత్ ఫెస్టివల్’లో ఈ నాటికను ప్రదర్శించాం. అక్కడ ఎనిమిది ప్రైజులుంటే, మా నాటికకు ఆరు వచ్చాయి. దాంతో అందరి దృష్టీ నా మీద పడింది! ‘నీలో చాలా టాలెంట్ ఉంది. సినిమా ఫీల్డ్‌కి వెళ్లొచ్చుగా’ అన్నారు చాలామంది. ఇదేదో బావుందనుకుని, సర్కార్ ఎక్స్‌ప్రెస్ ఎక్కి, మద్రాస్ వెళ్లాను. ఆ రకంగా ఆ నాటిక నా సినిమా జీవితానికి నాంది అయ్యింది.
 
 అప్పటికి మీకు పెళ్లయ్యిందా?
 ఎమ్మెస్: అప్పటికే (1972) పెళ్లయ్యింది. జనరల్‌గా సినిమా పరిశ్రమ అంటే పంపించడానికి ఇష్టపడరు. కానీ మా ఆవిడ నన్ను ప్రోత్సహించింది. దాంతో ఓ నమ్మకంతో మద్రాసు ప్రయాణమయ్యాను.
 
 మీది ప్రేమ వివాహమటగా?
 ఎమ్మెస్: అవును. నేను భాషాప్రవీణ చదువుతున్నప్పుడు తను నా క్లాస్‌మేట్. ప్రేమించి పెళ్లాడాను. ఇద్దరివీ వేర్వేరు కులాలు.
 
 ఆ రోజుల్లో కులాంతర వివాహం అంటే చిన్న విషయం కాదు.. మరి మీ ఇంట్లో ఒప్పుకున్నారా?
 ఎమ్మెస్: మా ఇద్దరి ఇళ్లలోనూ ఒప్పుకోలేదు. నేను భాషాప్రవీణ చదువుతున్నప్పుడు పరుచూరి గోపాలకృష్ణగారు ఫైనల్ ఇయర్‌లో మాకు లెక్చరర్. కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి. ఆయన ఆధ్వర్యంలోనే పెళ్లి చేసుకున్నాం. అప్పుడే నాకు భీమవరంలో జాబ్ వచ్చింది. మా ఆవిణ్ణి కూడా భాషాప్రవీణ చదివించాను. ఆవిడకీ భీమవరం హైస్కూల్‌లో జాబ్ వచ్చింది.
 
 ఇంతకూ మీ పెద్దలు ఎప్పటికి ఒప్పుకున్నారు?
 ఎమ్మెస్: నాలుగైదేళ్లు మేం పెద్దలకు దూరంగానే ఉన్నాం. మా అన్నదమ్ములు మాత్రం వస్తుండేవాళ్లు. ఆ తర్వాత నాలుగేళ్లకు మా నాన్నగారు మమ్మల్ని రానిచ్చారు.
 
 నటుడిగా మీ వైభవాన్ని మీ అమ్మానాన్నలు చూశారా?
 ఎమ్మెస్: మా నాన్నగారు చూడలేదు. రచయితగా నేను ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ‘ఎందుకు రా జీవితాన్ని పాడు చేసుకుంటున్నావ్.. పిచ్చి వెధవా’ అని తిట్టేవారాయన. ఆ తర్వాత ‘పేకాట పాపారావు’ సినిమాకి రచయితగా నా పేరు చూసి, ఆనందించారు. అమ్మ రెండేళ్ల క్రితమే చనిపోయారు. ఆమె నా ఎదుగుదలను పూర్తిస్థాయిలో చూశారు.
 
 మద్రాసు లైఫ్‌కొద్దాం... ఊరు కాని ఊరు. లైఫ్ ఎలా ఉండింది?
 ఎమ్మెస్: ఆకురాజు పున్నంరావుగారని మా ప్రిన్సిపాల్ ఉండేవారు. ఓసారి ఆయన ‘ఒరేయ్.. మీ దగ్గర డిక్షనరీ ఉందా’ అని అడిగి, అందులో ‘ఫియర్, రెస్ట్ ’ అనే పదాలను కొట్టేయండన్నారు. అప్పట్నుంచీ ఇప్పటివరకూ నా జీవితంలో ఆ రెండూ లేవు. మా నాన్నగారు చదువుకోకపోయినా మహత్తరమైన వ్యక్తి! ఆయన ఓసారి ఏం చెప్పారంటే, ‘నిద్ర వచ్చినప్పుడే పడుకో. నిద్ర రాకుండా పడుకోవద్దు. ఏదో ఒక పని చేస్తుండు’ అన్నారు. అది ఫాలో అవుతుంటాను. ఖాళీ సమయంలో ఏదైనా పుస్తకం చదవడమో, ఏదో ఒక పని చేయడమో నాకు అలవాటు. అంతేకానీ ఖాళీ దొరికినప్పుడల్లా సోఫాలోనో, మంచం మీదో వాలిపోను. మద్రాసు వెళ్లేటప్పుడు ఒకటే అనుకుని రెలైక్కా - ‘మనం చేసేది మంచిపని. ఎవర్నీ మోసం చేయబోవడంలేదు. ప్రతిభ ఉంది కాబట్టి.. ఓ ప్రయత్నం చేయబోతున్నాం’ అని!
 
 అంటే.. ఆర్థికపరమైన భయం కూడా లేదా?
 ఎమ్మెస్: లేదు! దానికి కారణం మా ఆవిడ. నేను మంచి రచయితనవుతాననే నమ్మకం ఆవిడకి బలంగా ఉండేది. అప్పటికి మాకిద్దరు పిల్లలు. ఇద్దర్నీ చూసుకుంటాను మీరు వెళ్లండని భరోసా ఇచ్చింది.
 
 మరి ఉద్యోగం ఏమయింది?
 ఎమ్మెస్: శని, ఆదివారాల్లో మద్రాస్ వెళ్లేవాణ్ణి. బోల్డన్ని కథలు రాసుకుని, ఓ ఐదేళ్లపాటు చాలామందికి వినిపించాను. కానీ ఫలితం కనిపించకపోయేసరికి ‘లాస్ ఆఫ్ పే’ పెట్టి, మద్రాసులోనే ఉండటం మొదలుపెట్టాను. దాంతో అలెగ్జాండర్, పేకాట పాపారావు, హలో నీకు నాకు పెళ్లంట, ప్రయత్నం... ఇలా ఎనిమిది సినిమాలకు కథలందించగలిగాను. అప్పుడే రవిరాజా పినిశెట్టిగారితో పరిచయం ఏర్పడింది. ఆయన దర్శకత్వం వహించిన ‘ఎమ్. ధర్మరాజు ఎం.ఎ’లో వేషం ఇచ్చారు. అది నేనూహించలేదు!
 
 ఊహించని ఆ మలుపుకి ఎలా రియాక్ట్ అయ్యారు?
 ఎమ్మెస్: రవిరాజాగారితో ‘కాలేజీలో జాబ్ చేస్తున్నా.. వీలు పడదేమో’ అంటే, ‘మీరు మంచి నటుడవుతారు’ అని నమ్మకంగా చెప్పారాయన. ఆ మాటకు ఆ సినిమాలో యాక్ట్ చేశా. ఆ పాత్ర పండింది. ఆ తర్వాత ఆయనే పెదరాయుడు, అరణ్యం, రాయుడు... ఇలా వరసగా ఏడు సినిమాలకు అవకాశం ఇచ్చారు. ఏడో సినిమానే ‘రుక్మిణి’! అందులో మంచి వేషం చేశాను. కథ కూడా ఇచ్చాను. సినిమా అద్భుతంగా ఆడలేదు కానీ, నా పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది. అది చూసి, ఈవీవీ సత్యనారాయణగారు ‘మా నాన్నకి పెళ్లి’లో మంచి కేరక్టర్ ఇచ్చారు. ఆ పాత్ర నా జీవితానికే మలుపయ్యింది. ఎలాంటి మలుపు అంటే ఒక వృత్తి నుంచి ఇంకో వృత్తికి మారేంత.
 
 ఆ సినిమా తర్వాత లెక్చరర్ జాబ్‌కి రిజైన్ చేయాలని నిర్ణయించుకున్నారా?
 ఎమ్మెస్: నేను డిసైడ్ చేయలేదు. ఇండస్ట్రీ డిసైడ్ చేసింది. ‘మా నాన్నకి పెళ్లి’ రిలీజైన ఐదారు రోజులకి ఇరవై సినిమాలు కమిట్ అయ్యాను. అది మొదలు ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసే పరిస్థితి రాలేదు. 1997 డిసెంబర్‌లో ‘మా నాన్నకి పెళ్లి’ చేశాను. ఆ సినిమాకి నంది వచ్చింది. ఆ తర్వాత 1999, 2000, 2003 సంవత్సరాల్లో నంది అవార్డులు తెచ్చుకున్నాను. ఇటీవల ‘దూకుడు’తో ఐదో నంది అందుకున్నాను. దాదాపు పది, పదిహేను సినిమాలు తక్కువగా 700 సినిమాలు చేశాను.
 
 ఒక లక్ష్యం సాధించిన తర్వాత జీవితం పూలబాట అవుతుంది. కానీ లక్ష్యసాధనలో భాగంగా పడిన కష్టాలు మామూలుగా ఉండవు. మరి.. బ్రేక్ వచ్చేంతవరకు మీరు పడిన బాధలు, అవమానాలు ఏమైనా ఉన్నాయా?
 ఎమ్మెస్: చాలా ఉన్నాయి! దాదాపు పన్నెండేళ్లు నేను పడిన కష్టాలు భయంకరం! ఎవరూ తట్టుకోలేరు. వెనక్కెళ్లిపోతారు. ఒక దశలో విరక్తి చెంది, మా ఊరెళ్లిపోదామనుకున్నాను. మర్నాడు రెలైక్కడానికి టిక్కెట్ కూడా తెచ్చుకున్నా. ఆ రాత్రి రూమ్‌లో కూర్చుని ఆలోచనలో పడ్డాను. ఆ ఆలోచనలను పేపర్ మీద పెట్టడం మొదలుపెట్టాను. అప్పుడు నేను రాసిన కథలు గుర్తొచ్చాయి. నా అన్ని కథల్లో హీరో సినిమా మొత్తం కష్టపడి చివరికి అనుకున్నది సాధిస్తాడు. ‘మనం రాసిన కథల్లో హీరోలు మాత్రం అష్టకష్టాలు పడాలి. మనం పడకూడదా?’ అని ఎందుకో అనిపించింది. అంతే.. ‘ప్రయత్నిస్తూ మరణిస్తే గెలిచినట్లు... ప్రయత్నం విరమిస్తే మరణించినట్లు’ అని పేపర్ మీద రాసుకున్నా. దాన్ని గోడకి అంటించి, టికెట్ చించేశాను. ఆ తర్వాతే రవిరాజాగారికి ‘సవ్యసాచి’ అనే కథ ఇచ్చాను. ఆ కథను తీసుకున్నారాయన. అప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందిపడేవాణ్ణి. మా ఆవిడే డబ్బులిచ్చేది. రవిరాజాగారు ఆ కథ తీసుకుని, ‘ఎంతివ్వమంటారు’ అనడిగారు. ఎంతడగాలో తెలియక ‘మీ ఇష్టం’ అన్నాను. ‘యాభైవేలిస్తా’ అనగానే, ‘నా గుండె ఆగినంత పనయ్యింది’. అదే స్వీట్ షాక్ అంటే... ‘మీరు చెప్పిన పద్ధతికి ఓ ఐదు వేలు బహుమతి’ అంటూ మొత్తం యాభైఐదు వేలిచ్చారు రవిరాజాగారు. ఇదంతా ఆర్టిస్ట్ అవకముందు దశ. ఆ తర్వాతే ‘ఎమ్. ధర్మరాజు ఎంఎ’తో నన్ను నటుణ్ణి చేశారు. ఆ సినిమా తర్వాత పార్టీ ఇచ్చి, ‘మీరు నంబర్‌వన్ కమెడియన్ అవుతారు’ అన్నారు. అది సాధించడానికి చాలాకాలం పట్టింది. కానీ దర్శకుడిగా ఆయన విజన్‌ని మాత్రం అభినందించాల్సిందే. నటించగలిగింది నటుడే కావచ్చు.. కానీ నటుణ్ణి కనిపెట్టగలిగేది దర్శకుడే. అందుకే దర్శకుడు గ్రేట్.
 
 లెక్చరర్‌గా చేస్తూ కొన్నేళ్లపాటు ప్రతి శనివారం మద్రాసు వెళ్లేవాణ్ణన్నారు. కష్టమనిపించలేదా?
 ఎమ్మెస్: ‘స్ట్రగుల్ ఫర్ ఎచీవ్‌మెంట్’ పేరుతో ఒకాయన పుస్తకం రాస్తున్నారు. ఓ ఏడాదిలో ఆ పుస్తకం వచ్చేస్తుంది. ఒకటి ఎచీవ్ చేయడానికి నేనెంత స్ట్రగుల్ పడ్డానో వాటి సమాహారంతో ఈ పుస్తకం ఉంటుంది. నిడమర్రు టు మద్రాసు సాగించిన ప్రయాణాల్లో నేను పడ్డ కష్టాలు ఎనలేనవి.
 
 అవెలాంటి కష్టాలు?
 ఎమ్మెస్: ఓసారి టిక్కెట్ తీసుకుని, హాయిగా నా బెర్త్ మీద పడుకున్నాను. మిగతా బెర్తుల్లో ఉన్న ఏడుగురు విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లడానికి అర్జంటుగా రెలైక్కడంతో టిక్కెట్స్ తీసుకోలేదట. ఆ విషయం గురించి వాళ్లు మాట్లాడుకుంటూ.. పక్క స్టేషన్‌లో దిగి, టికెట్ తీసుకోవాలనుకుంటున్నారు. అక్కడే ఉన్న మరో వ్యక్తి వీళ్ల మాటలు విని, ‘స్టేషన్ మాస్టర్ మా బాబాయే. ఒంగోలులో దిగి, నేను టిక్కెట్స్ తీసుకొస్తా’ అంటూ వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నాడు. పైన నిద్రపోతున్న నన్ను చూపించి ‘తను నా తమ్ముడే.. చూసుకోండి’ అంటూ నన్ను తాకట్టు పెట్టి, ట్రైన్ దిగాడు. ఇక వెనక్కి రాలేదు. దాంతో, వాళ్లు నన్ను నిద్ర లేపి, ‘మీ అన్నయ్య ఇంకా రాలేదేంటి’ అనడిగితే, నేను షాకయ్యాను! ‘మా అన్నయ్య ఎవరూ లేరు’ అని చెప్పినా వినకుండా, నా సూట్‌కేస్ లాకున్నారు. కొట్టడానికి సిద్ధపడితే, ‘కొట్టొద్దు.. చైన్ లాగేసి, పోలీసులకు పట్టిస్తా’ అని రివర్స్‌లో బెదిరించాను. నా సూట్‌కేస్ ఇవ్వకపోతుంటే, గూడూరులో ట్రైన్ ఆగగానే, పరిగెత్తుకుంటూ వెళ్లి.. స్టేషన్ మాస్ట్టర్ దగ్గర, నా టిక్కెట్ చూపించి, జరిగినదంతా చెప్పాను. దాంతో వాళ్ల దగ్గర్నుంచి సూట్‌కేసు లాక్కుని, నాకిచ్చి వాళ్లని కిందకు దించేశారు. నా ప్రయాణాల్లో ఇలాంటి చేదు అనుభవాలు బోల్డన్ని ఎదుర్కొన్నాను.
 
 నటుడిగా మారిన తర్వాత రచనకు దూరమయ్యారు కదా! అసలు రచయితగా మీకు తీరని కోరిక ఏమైనా ఉండేదా?
 ఎమ్మెస్: ఏ సినిమా సక్సెస్‌కైనా కథే ప్రధానం. సినిమా సక్సెస్‌కి హీరోయే కారణం అయితే.. ప్రతి సినిమా ఆడాలి కదా. కానీ ఆడటంలేదే. బాగున్న కథలే విజయం సాధిస్తున్నాయి. రచయిత అనేవాడు మంచి కథ ఇస్తేనే కదా, ఇళయరాజాలాంటి సంగీతదర్శకులు పాటలిచ్చేది. అలాంటప్పుడు, వారి ఫొటోలు పోస్టర్‌పైన వేస్తున్నప్పుడు, అన్నిటికీ మూలమైన రచయిత ఫొటో ఎందుకు వేయకూడదు అనిపించేది. కాబట్టి రచయిత బొమ్మ వేసేదాకా రాయాలని బలంగా నిర్ణయించుకున్నాను. కథలు బోల్డన్ని రాసుకుని, సినిమా ఆఫీసులకు వెళ్లేవాణ్ణి. మొదట్లో అన్ని ఆఫీసులకు కాలినడకన, ఆ తర్వాత అద్దె సైకిలు మీద వెళ్లేవాణ్ణి. అప్పుడు ఓ కో-డెరైక్టర్ ‘సైకిల్ మీద రాకండి. కథలు వినరు. ఓ స్టేచర్ ఉండాలి’ అన్నాడు. దాంతో వెళ్లగలిగితే ఆటోలో, లేకపోతే నడుచుకుంటూ వెళ్లేవాణ్ణి. అలాంటి సమయంలో ఓ దర్శకుడు నా కథ తీసుకున్నాడు. రచయితగా నా పేరు వేశారు. నేను మా ఊరెళ్లి మా కాలేజీలో కూడా చూపించుకున్నాను. కానీ ఆ తర్వాత నా పేరు తీసేసి ఇంకో రచయిత పేరు వేశారు. దాంతో కాలేజీలో నా పరువు పోయినంత పనయింది. అదో అవమానంగా భావించాను. ఆ నిర్మాతను అడిగితే, నా పేరు, ఇంకో రచయిత పేరు కలిపి వేశారు. ఆ సినిమాకి కథ, మాటలు మొత్తం నేనే అందించాను. ఆ కథను నిర్మాతకు, అతని బావమరిదికి, దర్శకుడికి... ఇలా ఒకే రోజులో ఏడుగురికి చెప్పించారు. ఇక, నా కష్టం ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఆ రోజు నేను కష్టపడ్డాను. కానీ, నన్ను కష్టపెట్టినవారికన్నా నా భవిష్యత్తే బాగుంది. భగవంతుడు నాకే మంచి మార్గం చూపించాడు. దానికి కారణం నా నిజాయితీ, ప్రతిభ, నా కష్టమే.
 
 వాల్‌పోస్టర్ మీద రచయితగా మీ బొమ్మ చూసుకోకుండానే, రచనలు మానేశారు... బాధ అనిపించలేదా?

 ఎమ్మెస్: రచయిత అనేవాడు పుస్తకాలు రాయకపోయినా, రచన అనేది అతని జీవన పరిధిలో ప్రతిచోటా ఉపయోగపడుతుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు, నటించేటప్పుడు ఉపయోగపడుతుంది. జీవితాన్ని రచించుకోగలిగినవాడే మంచి రచయిత. ఆ విధంగా నాలో రచయిత మరుగునపడిపోలేదు. కానీ పేపర్ మీద రాయలేదనే ఫీలింగ్ కొంత ఉంది. నటన సులువు కాదు. పైగా నేను షిఫ్టులవారీగా చేయడంతో, ఒత్తిడికి గురవుతుంటాను. ఆ ఒత్తిడిలో ఇక ఏం రాయగలను? కానీ నాలోని రచయిత షూటింగ్స్‌లో సీన్స్‌కి ఉపయోగపడతాడు.
 
 లెక్చరర్ అంటే.. కొంచెం గంభీరంగా ఉంటారు. దానికి పూర్తి వ్యతిరేకంగా నవ్వించే పనిని అంగీకరించారు మీరు. అసలు మీకు సెన్సాఫ్ హ్యుమర్ ఎలా అలవడింది?
 ఎమ్మెస్: లెక్చరర్స్ అందరూ గంభీరంగా ఉండరు. కొంతమంది మాత్రమే. అలాగే వారిలో సెన్సాఫ్ హ్యూమర్ ఉన్నవాళ్లూ ఉంటారు. నాకు చిన్నప్పట్నుంచీ సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. క్లాస్‌రూమ్‌లో నేను పాఠాలు చెప్పేటప్పుడు సందర్భోచితమైన ఛలోక్తులు కలిపి చెప్పేవాణ్ణి. దాంతో పక్క క్లాసువాళ్లు కూడా వచ్చి వినేవాళ్లు. పిల్లలను విపరీతంగా నవ్వించేవాణ్ణి. భారత రామాయణాలని సోషలైజ్ చేసి, చెప్పేవాణ్ణి.
 
 అయితే స్టూడెంట్స్‌లో బాగా ఫాలోయింగ్ వచ్చుండాలే...!
 ఎమ్మెస్: అవును, సినిమాల్లోకి రాకముందు నాకు ఫాన్స్ ఉండేవారు. మా ‘నారాయణ మాస్టార్’ అంటూ అభిమానంగా ఉండేవాళ్లు. నా శిష్యుల్లో ఎంతోమంది జిల్లా కలెక్టర్లు, ఐఏయస్, ఐపీఎస్ ఆఫీసర్లు, అమెరికాలో జాబ్ చేస్తున్నవాళ్లు ఉన్నారు. ‘దేవదాస్’ సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లినప్పుడు పన్నెండు మంది శిష్యులు ప్రతి రాత్రి కార్లేసుకొచ్చి, అమెరికా అంతాతిప్పారు. జనరల్‌గా మన దగ్గర చదువుకున్న పిల్లలు, మనకన్నా గొప్పవాళ్లు అవుతారు. ఏ కలెక్టర్‌గానో, ఐపీఎస్‌గానో... అలా! కానీ నా శిష్యులతో పాటు నేనూ ఎదిగాను (నవ్వుతూ) ఓ మోస్తరు ఎక్కువగానే! నేను సాధించింది వాళ్లు సాధించినట్లుగా ఆనందపడేంత శిష్యులు ఉన్నారు నాకు.
 
 మీ అబ్బాయి గురించి మాట్లాడదాం... విక్రమ్ కెరీర్ విషయంలో ఎదురుదెబ్బ  తిన్నట్టున్నారు?
 ఎమ్మెస్: నా ఇమేజ్ వాడికి అడ్డంకి అయ్యింది. నాలాగే వాడూ నవ్విస్తాడనుకున్నారు ప్రేక్షకులు. అందుకే ‘కొడుకు’ సినిమా వాళ్లని నిరుత్సాహపరిచింది. నాకు ఫైన్ ఆర్ట్స్ తెలుసు కానీ కామర్స్ తెలియదు. నేను చదివింది బీఏ... బీకామ్ కాదు. అందుకని కమర్షియల్ ఎస్టిమేషన్ తెలియలేదు. పెద్దపెద్ద నిర్మాతలే వాళ్ల తనయుల్ని సక్సెస్ చేయలేకపోతున్నారు. నేనెంత? డబ్బుపెట్టి, మంచి సినిమా తీయడం మాత్రమే కాదు.. ఆ సినిమాని కమర్షియల్‌గా వర్కవుట్ చేసుకోవడం కూడా తెలియాలి. మా అబ్బాయి హీరోగా నేను ‘కొడుకు’ సినిమాని బాగానే తీశాను. నన్నెవరూ తప్పు పట్టలేదు. విక్రమ్‌నీ తప్పు పట్టలేదు. బాక్సాఫీస్ దగ్గర సరిగ్గా రిలీజ్ చేయడం చేత కాలేదు. పంపిణీ వ్యవస్థ గురించి నాకిప్పటికీ తెలియదు. థియేటర్లో ప్రేక్షకులు కొనుక్కునే టికెట్ డబ్బు నిర్మాతకు ఎలా చేరుతుందో తెలియదు. ఆ మార్గం తెలిసుంటే ‘కొడుకు’ సేఫ్ ప్రాజెక్టే.
 
 కమెడియన్ కొడుకు కమెడియనే ఎందుకవ్వాలి.. హీరోగా ఎందుకు చేయకూడదని మీ అబ్బాయిని హీరోని చేశారా? లేక మీ అబ్బాయి హీరో మెటీరియలే అని నమ్మి చేశారా?
 ఎమ్మెస్: కమెడియన్ కొడుకు కమెడియనే ఎందుకవ్వాలి అని మనం అనుకోవచ్చు. కానీ ప్రేక్షకులు అనుకోరు. వాళ్ల అభిప్రాయాన్ని మార్చలేముగా! విక్రమ్‌తో సినిమా చేసేటప్పుడు.. నగేష్‌గారి కొడుకు ఆనంద్ సక్సెస్ అవ్వలేదు. ఇంకా కొంతమంది హాస్యనటుల కొడుకులు సక్సెస్ అవ్వలేదని కొంతమంది ఉదాహరణలు చెప్పారు. మా అబ్బాయి పక్కా హీరో మెటీరియలే అనే కాన్ఫిడెన్స్‌తోనే తీశాను. కెమెరా ముందు హైటు ప్రాబ్లమ్ ఉండదు. ఉదాహరణకు మన హీరోల్లో.. హైటు తక్కువ ఉన్నవాళ్లల్లో కూడా అద్భుతమైన హీరోలు ఉన్నారు. ఇతర భాషల్లో కూడా హైటు తక్కువ ఉన్నవాళ్లల్లో మంచి హీరోలు చాలామందే ఉన్నారు.
 
 ఆ చిత్రం ద్వారా ఆర్థికంగా బాగానే నష్టపోయారు కదా..?
 ఎమ్మెస్: అవును. అయినా అదేం పెద్ద లెక్క కాదు. ఎందుకంటే, దానికంటే ఎక్కువే సంపాదించాను. ఓ ప్రయత్నం చేయాలనుకుని చేశాను. దాన్ని ఓటమి అనుకోవడంలేదు.
 
 మళ్లీ మీ అబ్బాయి విక్రమ్ సినిమా చేస్తారా?

 ఎమ్మెస్: చేయొచ్చు. తన ప్లానింగ్స్ ఏవో తనకున్నాయి. ఆ ప్లాన్స్ గురించి తనే చెబుతాడు.
 
 ‘దుబాయ్ శీను’ సినిమాలో సాల్మన్ రాజు పాత్రకు  ఓ పెద్ద  నటుణ్ణి అనుకరించారు. ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలు చేశారు. అలా చేయడం వివాదాస్పదం అవుతుందని ఎప్పుడూ అనిపించలేదా?

 ఎమ్మెస్: ఓ ఆర్టిస్ట్‌గా దర్శకుడు ఏం చెబితే అది చేయడమే నా బాధ్యత. ఆ స్టార్ ఎంతో ఫేమస్ అయితేనే దర్శకుడు పేరడీ చేయిస్తాడు. అయినా ఆ పేరడీలు వివాదం అవుతాయనుకోలేదు. ఎందుకంటే, అవన్నీ కామెడీ కోసమే.
 
 మందు కొట్టే పాత్రలను అద్భుతంగా పండిస్తారు. నిజంగా అలవాటుంది కాబట్టే.. అంతలా పండిస్తున్నారా?
 ఎమ్మెస్: రియల్ లైఫ్ అలవాటుకీ దానికీ సంబంధం లేదు. ఎందుకంటే, నిజజీవితంలో అలవాటుంది కాబట్టే.. బాగా చేస్తున్నానని అంటే, మరి ఆ పాత్రలు చేసేటప్పుడు తాగి నటించాలిగా. నేనలా చేయను. రవిరాజాగారు ఫస్ట్ తాగుబోతు పాత్ర ఇచ్చినప్పుడు, అసలు తాగినవాడు నత్తిగానే ఎందుకు మాట్లాడాలి? కిక్కుండాలి.. నత్తి ఉండకూడదని మంచి డిక్షన్‌తో డైలాగ్ చెప్పాను. ఆ మాడ్యులేషన్‌లో ఓ స్వీట్‌నెస్ ఉంటుంది. అది ప్రేక్షకులకు నచ్చింది. నేను చేసే తాగుబోతు పాత్రలు సక్సెస్ అవ్వడానికి కారణం, ఆ పాత్ర మర్డర్లు, మానభంగాలు చేయదు, దుష్ట పనులేవీ చేయదు. నవ్విస్తుంది. అందుకే అందరూ ఎంజాయ్ చేస్తున్నారు.
 
 ఓ సినిమాలో మందు తాగే పాత్రలో ‘నేను టాక్స్ పేయర్’ని అంటూ తాగడాన్ని కన్విన్సింగ్‌గా డైలాగ్ రూపంలో చెప్పారు? నిజంగా కూడా అలానే ఫీలై, తాగుతారా? మందు తాగడం మంచిది కాదని మీకు తెలియదా...?

 ఎమ్మెస్: మందు నాకు హాని కాదు. నా లైఫ్‌ని తీసుకుందాం. షూటింగ్స్ కారణంగా రెస్ట్‌లెస్‌గా ఉంటాను. ఆ అలసట పోగొట్టుకోవడానికి చిన్న పెగ్ తీసుకుని, హాయిగా నిద్రపోతాను. దానివల్ల నాకు ఎనర్జీ వస్తుందే తప్ప, జీవితం నాశనం అయిపోయే రేంజ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఆరోగ్యాన్ని పాడు చేసే చీప్ లిక్కర్ జోలికి వెళ్లను. చాలామంది ప్రచారం చేస్తున్నట్లుగా నేను బీభత్సమైన తాగుబోతుని కాదు!
 
 అలా మీ మీద దుష్ర్పచారం చేస్తున్నదెవరంటారు...?

 ఎమ్మెస్: పేర్లు అనవసరం. అసూయతో ప్రచారం చేస్తుంటారు. అవన్నీ పట్టించుకోను. మనం గొప్పవాళ్లమైతేనే ఎదుటివాళ్లకు అసూయ కలుగుతుంది. అలాగే ఎప్పుడైతే మన గురించి అలా లేనిది ప్రచారం చేస్తున్నారో అప్పుడు వాళ్లు మనకు భయపడుతున్నట్లే లెక్క. నేనెప్పుడూ నా గురించి ఆలోచిస్తాను. ఎదుటివాడి గురించి అస్సలు ఆలోచించను.
 - డి.జి. భవాని


***********


 నా పూర్తి పేరు మైలవరపు సూర్యనారాయణ. స్కూల్లో ఎమ్మెస్‌గారనేవారు. పెద్దవాళ్లు ‘సూన్నారాయణ’ అనేవాళ్లు. లెక్చరర్ అయ్యాక తొలి ఉగాదికి ‘ఎమ్మెస్ నారాయణ’ అని మార్చుకున్నాను. అప్పుడో గేయం రాశాను. ఇంత పొడుగు పేరెందుకని, ‘ఎమ్మెస్ నారాయణ’ అని పెట్టుకున్నాను.
 
 నేను ‘కాళిదాసు’ని ఎక్కువగా చదివాను. ఎంఏ ప్రీవియస్‌లో ‘ఇండియా ఈజ్ కాళిదాస్’ అని రాశాను. ఎందుకంటే, భారతదేశం అంటే.. నా దృష్టిలో ఉత్తరాన హిమాలయాలు, దక్షిణాదిన సముద్రం.. ఇది కాదు..  ‘కల్చర్’.  వాటీజ్ ది ఇండియన్ కల్చర్ అనేది కాళిదాసు రాశారు... వివేకానందుడు ప్రపంచానికి చెప్పారు. 1921లో చికాగోలో జరిగిన హిందూ మత మహాసభల్లో వివేకానందుడు మాట్లాడి ఉండకపోతే.. మన దేశం గురించి ప్రపంచ దేశాలకు తెలిసి ఉండేది కాదు.
 
 దేవుణ్ణి నమ్ముతాను. పొద్దుటే లేచి, నమస్కారం పెట్టుకుంటాను. అప్పుడు నా మనసులో ఏమీ ఉండదు. దేవుడి ముందు ఎలాంటి ఎజెండాలూ పెట్టను. భగవంతుడి ముందు ఒక ఎజెండాను పెట్టడం ఆయన్ను ఫూల్ చేసినట్లేనని నా అభిప్రాయం. ఎందుకంటే నీ గురించి ఆ దేవుడికి తెలియదా? ఒకవేళ తెలియదని నీకనిపిస్తే.. సమస్యలు తెలియని దేవుడికి దణ్ణం పెట్టుకోవడం ఎందుకు? నీ గురించి ఆయనకు తెలుసు.. ఏం చేయాలో అది చేస్తాడు.
 
 పానగల్ పార్కులో పస్తులున్నవాళ్లల్లో పైకొచ్చినవాళ్లు చాలామంది ఉన్నారని ఎక్కడో చదివాను. ఆ జాబితాలో చిత్తూరు నాగయ్యగారు కూడా ఉన్నారు. అందుకని నా జేబులో డబ్బులున్నప్పటికీ కావాలనే భోజనం చేయకుండా, ఓ రోజంతా పానగల్ పార్క్‌లో గడిపాను (నవ్వుతూ).
 

మరిన్ని వార్తలు