పెళ్లి కానుక ఏమి నీ కోరిక?

12 Oct, 2019 02:11 IST|Sakshi

కొత్తగా వినిపిస్తోంది.. వింతగా అనిపిస్తోంది కదా... కాని ఒకటే తరహా బహుమానాలతో ఇల్లు నిండిపోవడమే కాక అవి నిరుపయోగంగానూ మారి.. జంధ్యాల మార్క్‌ హాస్యసినిమాలా కనిపిస్తాయి! నిజం.. అందుకే ఈ వెడ్డింగ్‌ విష్‌లిస్ట్‌.

 ఏముంటాయి అందులో?
కొత్త కాపురానికి కావల్సిన వస్తువులు .. కిచెన్‌ నుంచి ఫ్యాషన్‌ ప్రపంచం దాకా, కొత్త జంట వెళ్లాలనుకుంటున్న హానీమూన్‌కి టికెట్లు లేదా హోటల్‌ రూమ్‌ బుకింగ్స్, ఆడపిల్లల చదువు కోసం, ఆర్ఫెన్, ఒల్డ్‌ ఏజ్‌ హోమ్స్‌కి విరాళాలు.. ఇలా తాము కోరుకున్న, అనుకున్నవన్నీ ఆ జాబితాలో పొందుపరుస్తారు. ఆ లిస్ట్‌ చూసుకొని అతిథులు తమ కానుకలివ్వొచ్చు. లేదు డబ్బులే ఇస్తామనుకున్నా.. ఆ వెసులుబాటూ ఉంటుంది.

ఎలా తెలుసుకోవాలి?
దీనికి ఒక వెబ్‌సైట్‌ ఉంది. వెడ్డింగ్‌ విష్‌లిస్ట్‌ పేరుతో. పెళ్లి చేసుకోబోయే జంట ఈ సైట్‌లో తమ పేర్లను నమోదు చేసుకోవాలి. పెళ్లికి ఎలాంటి కానుకలు కావాలనుకుంటున్నారో లిస్ట్‌ తయారు చేసుకుని దాన్నీ ఇందులో నమోదు చేయాలి. అలాగే ఆ జంట ఈ వెడ్డింగ్‌ విష్‌లిస్ట్‌ ఆన్‌లైన్‌ రిజిస్ట్రీ గురించీ తమ పెళ్లికి వచ్చే అతిథులకు చెప్పాలి. లేదంటే శుభలేఖల్లో అచ్చు వేయించొచ్చు. దాని ప్రకారం అతిథులు ఈ ఆన్‌లైన్‌ రిజిస్ట్రీని చూసి.. ఆ జంట ఇచ్చిన జాబితాలోంచి వీళ్ల తాహతుకు తగ్గ కానుక దగ్గర టిక్‌ పెడ్తారు. అలా కానుకలు రిపీట్‌ కాకుండా ఉంటాయి. వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్న వాళ్లకే వాళ్లు ఎంచుకున్న కానుకను తెమ్మని చెప్పి వాళ్లకే డబ్బులు కట్టేసే సౌకర్యాన్నీ ఈ ఆన్‌లైన్‌ రిజిస్ట్రీ కల్పిస్తుంది.

మొదలుపెట్టిందెవరు?
అమెరికాలో ఎప్పుడో జీవనశైలిలో భాగమై.. ఇప్పుడు ఇక్కడ ఓ ట్రెండ్‌లా మొదలైంది. ‘వెడ్డింగ్‌ విష్‌లిస్ట్‌’ రిజిస్ట్రీని మూడేళ్ల కిందట రవి, రినీ అనే జంట చెన్నైలో ప్రారంభించింది. దీని వెనక చిన్న కథ ఉంది. రవి వాళ్ల చెల్లి పెళ్లికి ఓ ఇరవై గోడ గడియారాలు, ఓ ముప్పై సిరమిక్‌ బొమ్మలు, ఓ పది డిన్నర్‌ సెట్లు, పది బెడ్‌ల్యాంప్స్, ఓ యాభై ఫొటో ఫ్రేమ్స్‌ .. ఇలా వచ్చిన కానుకలే డజన్లకొద్దీ వచ్చాయట. విస్తుపోయారట ఇంట్లో వాళ్లు. అంతంత డబ్బు పెట్టి తెచ్చిన ఆ బహుమానాలను వాడలేక.. వృథాగా స్టోర్‌ రూమ్‌లో పడేయడం నచ్చలేదు ఆ ఇంట్లో వాళ్లకు.

పోనీ వాటిని మళ్లీ ఇంకెవరికైనా బహూకరిద్దామన్నా మనసొప్పలేదుట. అప్పుడనుకున్నాడట రవి.. తన పెళ్లికి కానుకలిచ్చే ప్రక్రియనైనా నిషేధించాలి లేదంటే ఇలా రిపీటెడ్‌ గిఫ్ట్స్‌ రాకుండా ఓ మార్గమైనా కనిపెట్టాలని. తన కాబోయే భార్య రినీతోనూ ఈ విషయాన్ని చర్చించి, పరిశోధిస్తే అప్పుడు తెలిసింది వీళ్లకు అమెరికాలో ఉన్న వెడ్డింగ్‌ గిఫ్ట్‌ రిజిస్ట్రీల గురించి. అంతే తమ పెళ్లితోనే దీనికి శుభారంభం పలకాలని వెడ్డింగ్‌ విష్‌లిస్ట్‌ను ఆవిష్కరించారు.

దీని గురించి తెలిసి సతీష్‌ సుబ్రహ్మణియన్, కనికా సుబ్బయ్య, తన్వి సరాఫ్‌ అనే ముగ్గురు స్నేహితులూ వెడ్డింగ్‌ విష్‌లిస్ట్‌కి సహ వ్యవస్థాపకులుగా మారారు. ‘‘వెడ్డింగ్‌ విష్‌లిస్ట్‌ ఆలోచన విని మా పేరెంట్స్‌ తిట్టారు నన్ను. ‘‘మాకు ఫలానా గిఫ్ట్స్‌ తెండి అని చెప్తారా ఎవరైనా? ప్రేమతో తెచ్చింది ఏదైనా తీసుకోవడం మర్యాద’’ అంటూ. కాని ఈ ఐడియా మా పెళ్లికి వచ్చిన వాళ్లందరికీ నచ్చింది అని చెప్తారు వెడ్డింగ్‌ విష్‌లిస్ట్‌ ఫౌండర్స్‌లో ఒకరైన రవి.

ఒక్క పెళ్లికే కాదు..
అలా మొదలైన ఈ ఆన్‌లైన్‌ పెళ్లికానుకల వ్యవహారం మూడేళ్లు తిరిగేసరికి ఓ పరిశ్రమగా మారింది. వెడ్డింగ్‌ విష్‌లిస్ట్‌ రిజిస్ట్రీ కేవలం పెళ్లి కానుకల దగ్గరే ఆగిపోతే దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆరంభమైన జిబొంగా, విష్‌ట్రై అనే వెడ్డింగ్‌ గిఫ్ట్‌ రిజిస్ట్రీలు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, సీమంతాలు, బారసాలలు, గృహప్రవేశాలు, ప్రారంభోత్సవాలు, వార్షికోత్సవాలు, సిల్వర్, గోల్డెన్, ప్లాటినమ్‌ జూబ్లీలు వంటి ఎన్నో వేడుకలకు ఈ గిఫ్ట్స్‌ లిస్ట్‌ రిజిస్టర్‌ సంప్రదాయాన్ని వర్తింప చేస్తున్నాయి.2016–17లో అయిదువందల రిజిస్ట్రేషన్లతో లాంచ్‌ అయిన ‘విష్‌ట్రై’లో ఇప్పుడైతే ప్రతి నెలా పలు వేడుకల కోసం రెండువేల అయిదువందల మంది రిజిస్టర్‌ చేయించుకుంటున్నారు.

‘‘ కేవలం పెళ్లి కానుకలే తీసుకుంటే  ఏడాదికి 12 నుంచి 15 శాతం రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. అంతేకాదు ఇది మొదలైన కొత్తలో పది శాతం అతిథులు మాత్రమే దీన్ని అడాప్ట్‌ చేసుకుంటే ఇప్పుడది అరవై శాతానికి పెరిగింది’’ అంటారు విష్‌ట్రై వ్యవస్థాపకురాలు అదితి మెహతా. అయితే.. కానుకలన్నా ఆ డబ్బును సామాజిక ప్రయోజనాలకు వెచ్చించమని కోరుకుంటున్న జంటలే ఎక్కువని చెబుతున్నాయి ఈ వెడ్డింగ్‌ గిఫ్ట్‌ రిజిస్ట్రేషన్‌ సంస్థలు. మంచి పరిణామమే.
 

మరిన్ని వార్తలు