గుండె బరువైంది

21 Feb, 2018 23:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం 

పెళ్లైన పదిహేను రోజులకే పుట్టింటికి

మంచి ఆకృతికి సర్జరీ చేసుకోవాలని సలహా      

అప్పటివరకు రావొద్దని ఆదేశం

ఎద లోతుల్లో ఉన్న బాధను ఆడపిల్లలు బయటపెట్టకపోతే..  మగాళ్ల వికృత బుద్ధికి హద్దే లేకుండా పోతుంది! భార్య ఆకారాన్ని వెక్కిరించి  సొమ్ము చేసుకోవాలని చూశాడు అతడు.  మహిళ శక్తిని మించిన అందం లేదని.. ఆమె నిరూపించింది. 

మాది జగిత్యాల జిల్లాలోని ఓ కుగ్రామం. నాన్న వ్యవసాయం చేస్తాడు. అమ్మ బీడీలు చుడుతుంది. చిన్ననాటి నుంచి నాన్న నన్ను కూడా తమ్ముడితో సమానంగా చూశాడు. నన్ను ఉన్నత చదువులు (ఎమ్మెస్సీ) చదివించాడు. అమ్మ, నాన్న, తమ్ముడు, నేను అంతా హాయిగా ఉన్నాం. పీజీ పూర్తయిన తరువాత నాకు పెళ్లి చెయ్యాలని అమ్మా నాన్న అనుకున్నారు. సరేనన్నాను. 2017, ఫిబ్రవరిలో ఓరోజు నాన్న హడావుడిగా ఇంటికి వచ్చాడు. ‘‘మా ఫ్రెండు చెప్పిండు.. ఆమ్మాయిని చూసేందుకు వరంగల్‌ నుంచి పిలగాడు, ఆయన తల్లిదండ్రులు వస్తుండ్రట.. చిన్నిని రెడీ చేయి’’ అని అమ్మతో చెప్పిండు. అమ్మ వచ్చి నాకు విషయం చెప్పింది. 

మళ్లీ వచ్చి చూస్తాడు
పెళ్లి కొడుకు తల్లిదండ్రులు, ఆడబిడ్డ, బంధువులతో కలిపి ఆరుగురు వచ్చారు. అమ్మ పిలవగానే నేను వెళ్లి వాళ్ల ముందు కూర్చున్నా. అందరు నన్ను  పరిశీలనగా చూసుకున్నారు. రకరకాల ప్రశ్నలు వేశారు. చివరికి ‘‘మా అబ్బాయి మళ్లీ వచ్చి చూస్తాడు..ఆ తరువాత మాట్లాడుకుందాం’’ అనేసి వెళ్లిపోయారు. అబ్బాయి తల్లిదండ్రులకు నేను నచ్చానని అమ్మా, నాన్న సంతోషంగా ఉన్నారు. మొదటి పెళ్లి చూపులతోనే చిన్నికి సంబంధం ఖరారు అవుతుందని సంబరపడ్డారు. నాలుగు రోజులకే మళ్లీ అబ్బాయి వచ్చి చూసిండు. అబ్బాయి సెల్‌ఫోన్ల రిపేరింగ్‌ షాపు బాగా నడుస్తుందని చెప్పుకున్నారు. అంతా ఒకే అనుకున్నారు. నాలుగు లక్షల కట్నం, రెండు లక్షల రూపాయల సామాన్లు ఇస్తామని నాన్న ఒప్పుకున్నడు. వారం రోజుల వ్యవధిలోనే పెళ్లి జరిగిపోయింది. కట్నం, ఆడబిడ్డ కట్నాలు, పెళ్లి ఖర్చులు కలిపి మొత్తం రూ.8 లక్షల దాకా ఖర్చు వచ్చింది. నాన్న దగ్గర డబ్బులు లేకున్నా అప్పు తెచ్చి సర్దుబాటు చేసిండు. మొత్తం మీద బిడ్డ పెళ్లి చేశానన్న సంతోషం అమ్మానాన్నల మోములో కనబడింది.

రెండు వారాలకే ఆవిరి
పెళ్లయిన పదిహేను రోజులకు మా ఆయన నన్ను తీసుకువచ్చి అమ్మానాన్నల దగ్గర వదిలి భోజనం చేసి వెళ్లాడు. నేను మాములుగానే ఇంటి దగ్గర దింపాడనుకున్నాను. అమ్మా నాన్న అలానే అనుకున్నారు. అల్లుడు మరో నాలుగు రోజుల్లో వచ్చి తీసుకెళ్తాడని భావించారు. వారం గడిచింది. ఆయన రాలేదు. నేను ఫోన్‌ చేశాను. ‘‘పని బిజీగా ఉంది తరువాత వస్తాను’’ అని చెప్పాడు. మరో వారం చూశాం. ఈ సారి నాన్న ఫోన్‌ చేశాడు. రెండు మూడు రోజుల్లో వచ్చి తీసుకెళ్తానని చెప్పాడు. సరేలే.. ఏదో పని మీద ఉన్నట్టున్నాడు.. వస్తాడులే అనుకున్నారు అమ్మానాన్న. మరో పదిహేను రోజులు చూసి మా మామయ్యకు ఫోన్‌ చేశారు. అల్లుడు రావడం లేదని అడిగారు. అప్పుడు ఆయన.. ‘‘మమ్మల్ని మీరు మోసం చేశారు.. నీ బిడ్డనే అడుగు’’ అంటూ కఠినంగా జవాబివ్వడంతో మా అమ్మానాన్న షాక్‌ అయ్యారు. పెళ్లి సందడి మర్చిపోక ముందే మామయ్య నుంచి అలాంటి సమాధానం రావడంతో నిర్ఘాంతపోయారు. 

ఏమని చెప్పేది..?
మామయ్యతో మాట్లాడిన తరువాత అమ్మా నాన్న నన్ను అడిగారు. పదిహేను రోజుల్లోనే అత్తగారింటి వద్ద ఏం జరిగిందో చెప్పమన్నారు. ఏమని చెప్పాలో తోచలేదు. కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. ‘‘ఏమయిందమ్మా..’’ అని కలవరపడ్డారు. అమ్మతో చెప్తానని అన్నాను. నాన్న మా ఇద్దరికీ ఏకాంతం కల్పించాడు. మెల్లగా. అమ్మ నన్ను దగ్గరకు తీసుకుని, విషయం చెప్పమంది. ‘‘అమ్మా.. మా ఆయన నన్ను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకోమంటున్నాడు’’ అని చెప్పాను. అమ్మ నివ్వెరపోయింది. ‘‘ఎందుకు?’’ అని అడిగింది.  ఏడుస్తూ అంతా చెప్పాను. ‘‘నా ఒంటి ఆకారం బాగాలేదట, నా వక్షోజాలు పెద్దగా ఉన్నాయట. వక్షోజాల పైభాగం కుచించుకుపోవడం బాగాలేదట. అవి అలా ఉంటే పెద్ద వయసు ఆడమనిషితో ఉంటున్నట్లు అనిపిస్తుందట. మూడ్‌ వస్తలేదట. మొదటి రోజు నుంచి నాకు ఇదే టార్చర్‌’’ అంటూ అమ్మతో గోడు వెళ్లబోసుకున్నా. నన్ను పట్టుకుని బోరున ఏడ్చింది అమ్మ. నాన్నకు ఏమని చెప్పాలో తెలియక వారంరోజులు తనలో తాను కుమిలిపోయింది. నాన్న గట్టిగా ఏమీ అడగలేదు.. ఇంట్లో పెళ్లి వాతావరణం కనుమరుగైంది. గత్యంతరం లేక అమ్మ నాన్నకు విషయం చెప్పింది. నాన్న మండిపడ్డాడు. పెద్ద మనుషులను పిలిపించాలనుకున్నా.. బిడ్డకు ఇలా జరిగిందని చెప్పలేక.. ఫ్యామిలీ ఫ్రెండ్‌కు విషయం చెప్పాడు. ఆయన మా మామయ్య వాళ్లతో విషయం బయటకు తెలియకుండా సర్దుబాటు చేసి మాట్లాడదామన్నాడు.  

అందరికీ చెప్పేశాడు!
రెండు నెలలు గడిచిపోయాయి. నేను ఇంకా ఇంటి దగ్గరే ఉంటున్నాను. చుట్టుపక్కల ఉన్న అమ్మలక్కలు నా గురించి గుసగుసలాడటం మొదలైంది. ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే నామోషీగా ఉంది. చివరకు మా నాన్న స్నేహితుడిని తీసుకుని మా అత్తమామలతో మాట్లాడదామని వరంగల్‌ వెళ్లాడు. అక్కడ మా ఆయన పెద్ద పంచాయితీ పెట్టాడు. సహజమైన విషయాన్ని అసహజమైనదిగా చిత్రీకరించి పెద్ద మనుషులందరికీ  చెప్పాడు. వాళ్లంతా మా నాన్నను.. ముందే ఇలా ఉందని చెప్పకుండా మోసం చేశారని, పెళ్లికొడుకు కోరిన మేరకు సర్జరీ చేయించాలని అన్నారు. ఇది సమస్య కానే కాదని నాన్న స్నేహితులు వాదించినా అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. సర్జరీకి దాదాపు పది లక్షలు ఖర్చు అవుతాయి. ఆ డబ్బులు మా నాన్నను భరించాలని గదమాయించినట్లుగా అన్నారు. చివరకు చేసేదేమీ లేక నాన్న ఆయన స్నేహితులు తిరిగివచ్చారు. 

మరో పెళ్లికి ఒప్పుకోవాలట
పంచాయితీ అయిన పదిహేను రోజులకు మా ఆయన నాకు ఫోన్‌ చేశాడు. నువ్వు సర్జరీ చేయించుకున్నాక నిన్ను ఇంటికి తీసుకెళ్తా.. కానీ మన ఇద్దరికి పుట్టే పిల్లలకు నీ లాగే సమస్య వస్తే ఎట్లా. అప్పుడు మీ నాన్న సర్జరీ చేయించలేడు కదా. రూ.10 లక్షలు మీ నాన్నను ఇవ్వమను. ఆ డబ్బులు డిపాజిట్‌ చేసుకుని సర్జరీ చేయిస్తా. ఇక నాకు నీతో తృప్తి లేదు కాబట్టి నేను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తన అన్యాయమైన ఆలోచనలు బయటపెట్టాడు. అప్పటి దాకా ఏదో ఓ మూల ఆయన మీద ఉన్న ఆశ ఈ మాటలతో ఆవిరైంది. ఇక నేను అత్తారింటికి వెళ్లొద్దని నిశ్చయించుకున్నా. పీజీ చదివాను. నేను ఎక్కడయినా జాబ్‌ చేసుకుంటానని నాన్నకు చెప్పా. అంతే కాదు.. నా భర్త, అత్తమామలపై పోలీస్‌ కేస్‌ పెట్టమని నాన్నకు చెప్పి ఒప్పించా. ఆ తరువాత  పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశా. 

సోషల్‌గా, లీగల్‌గా బయటికి ఈడ్చాలి
ఈ అమ్మాయి ఆర్థిక హింసనూ ఎదుర్కొంది. అందులో వరకట్న వేధింపు కూడా ఉంది. ముందు.. దేహాన్ని గేలి చేస్తూ చివరకు  పదిలక్షల డిమాండ్‌ పెట్టాడు! ఈ తరహా ‘బాడీ షేమింగ్‌’ అనేది అమ్మాయిల ఆత్మ స్థయిర్యం దెబ్బతీసే చర్యల్లో భాగమే. కాబట్టి  అమ్మాయిలు మానసికంగా బలంగా ఉండాలి. ఇంట్లోవాళ్లకు చెప్పాలి. నిశ్శబ్దంగా భరించొద్దు. లోపల్లోపల కుమిలిపోవద్దు. మన నిశæ్శబ్దం అవతలివాళ్లను మరింత బలవంతులుగా మారుస్తుంది. గృహహింస వంటివాటి మీద అవగాహన కల్పించి.. లీగల్‌గా, సైకాలజికల్‌గా గైడ్‌ చేయడానికి ప్రతి జిల్లాలో ‘సఖీ’ సెంటర్స్‌  ఉన్నాయి. ఎలాంటి అబ్యూజ్‌కు గురైన మహిళలైనా సఖీ సెంటర్స్‌కు వెళ్లి సలహాలు   తీసుకోవచ్చు. తమను అబ్యూజ్‌కు గురిచేసిన వాళ్లు మళ్లీ జీవితంలో వేరే అమ్మాయితో అలా ప్రవర్తించకుండా వాళ్లను సోషల్‌గాను, లీగల్‌గానూ ఎక్స్‌పోజ్‌ చేయడం చాలా అవసరం. 
– సుమిత్ర, ‘అంకురం’ (స్త్రీ,శిశు అభివృద్ధి సంస్థ)
– ముక్కెర చంద్రశేఖర్, కోరుట్ల, జగిత్యాల జిల్లా

మరిన్ని వార్తలు