నది మెచ్చిన నాయకుడు

2 Sep, 2017 00:07 IST|Sakshi
నది మెచ్చిన నాయకుడు

తెలంగాణ
వైఎస్‌ఆర్‌ తలంచిన జలయజ్ఞం ప్రాజెక్టు కింద అందుతున్న ఫలాలు
బీడు భూముల్లో పారుతున్న జలాలు
12లక్షల ఎకరాలకు ఇప్పటికే నీరు..మరో 8లక్షల ఎకరాలు సిద్ధం
జలయజ్ఞంతో తొలి ఫలితం తెలంగాణకే
అలీసాగర్‌ లిఫ్టుతో ఏడాదిలో 53వేల ఎకరాలకు నీరు పారించిన వైఎస్‌
మొత్తంగా రూ.1.11లక్షల కోట్ల వ్యయంతో 33 ప్రాజెక్టులు మొదలు
51లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక

సోమన్నగారి రాజశేఖర్‌రెడ్డి, సాక్షి ప్రతినిధి
చెంతనే నీళ్లు పారుతున్నా పొలాలకు నీరు చేరలేని దౌర్భాగ్యం... ఎండిన పంటలతో నెలకొన్న తీవ్ర దుర్భిక్షం.. రైతు కళ్లలో సంతోషాన్ని నింపని సంక్షోభ పరిస్థితులను మార్చి... తెలంగాణ నేల నుంచి కరువు రక్కసిని శాశ్వతంగా తరిమికొట్టి.. అన్నపూర్ణ నామాన్ని సార్థకం చేసేందుకు, అన్నదాతల కష్టాలను సమూలంగా తొలగించేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన భగీరథ యత్నమే.. జలయజ్ఞం. రాష్ట్ర పరీవాహకంలో లభ్యతగా ఉన్న ప్రతి నీటి చుక్కను పరీవాహక ఆయకట్టుకు మళ్లించడం, అవసరాలకు తగ్గట్టుగా నిల్వ, వినియోగం చేసుకునేలా వైఎస్‌ చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులు నేడు జల సిరులతో కళకళ్లాడుతున్నాయి. బీడు భూముల్లో సిరులు పండి.. పుడమితల్లి పులకరించిపోవాలని తపనపడ్డ మహానేత వైఎస్సార్‌ కల నిజమై... కరువు జిల్లాల్లో బీడు భూములకు జలసిరులు పారుతున్నాయి. కష్టాలతో బిక్కచచ్చిన రైతుల కళ్లలో వెలుగులు నింపుతున్నాయి. నెర్రెలిచ్చిన పొలాల్లోకి పరుగులు పెట్టిన నీళ్లు కోట్లాది మంది రైతులకు భరోసానిస్తున్నాయి.

లక్ష కోట్లతో 50 లక్షల ఎకరాలు
ఏళ్లతరబడి బీళ్లుగా మారిన భూములను చూడలేక వలసబాట పట్టిన తెలంగాణ ప్రాంత రైతన్న ముఖంపై చిరునవ్వు వెల్లివిరియాలని, సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు నీళ్లు పారించాలని 2004కు ముందు వైఎస్‌ స్వప్నించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని అమల్లో పెట్టే యత్నం చేశారు.  జలయజ్ఞం పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 86 ప్రాజెక్టుల నిర్మాణం మొదలుపెట్టగా అందులో 33 ప్రాజెక్టులు తెలంగాణ ప్రాంతంలో చేపట్టినవే. 18 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టులు, రెండు ప్రాజెక్టుల ఆధునికీకరణ, ఫ్లడ్‌ బ్యాంకుల పనులను వైఎస్‌ తన హయాంలో రూ.1,11,433.23 కోట్లతో చేపట్టారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సుమారు 387.88 టీఎంసీల కృష్ణా, గోదావరి నీటిని వినియోగంలోకి తెచ్చి 51.47 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళికలు తయారు చేశారు. జలయజ్ఞం తొలి ఫలితం తెలంగాణలో నిజామాబాద్‌ జిల్లా అలీసాగర్‌ లిఫ్టుకే దక్కింది. 2005లో దీన్ని చేపట్టగా ఏడాదికాలంలో దీన్ని పూర్తి చేసి 53 వేల ఎకరాల మేర సాగు నీరందించారు. ఆ మరుసటి ఏడాదిలోనే గుత్ప లిఫ్టును పూర్తి చేసి మరో 38వేల ఎకరాలకు నీరందించారు. సుద్ద్దవాగును సైతం పూర్తి చేసి మొత్తంగా 1,07,584 ఎకరాలకు సాగు నీరిచ్చారు. ఇందులో ఏఎంఆర్‌పీ, దేవాదుల, ఎస్సారెస్పీ–2, మత్తడివాగు వంటి ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేసి మరో నాలుగు లక్షల ఎకరాలకు నీరందించారు.

యజ్ఞ ఫలం.. 20 లక్షల ఎకరాలు..
రాజశేఖరరెడ్డి మరణించే సమయానికే ఐదు లక్షల ఎకరాలకు నీరివ్వగా, తర్వాత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆయకట్టు లక్ష్యాలు ముందుకు కదల్లేదు. దీంతో 2014 నాటికే కొత్తగా 6లక్షల ఎకరాలకు సాగు నీరందింది. తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రస్తుతం వరకు జలయజ్ఞం ప్రాజెక్టుల కింద మొత్తంగా రూ.60వేల కోట్ల రూపాయలు ఖర్చుకాగా సుమారు 12లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది. మరో లక్ష ఎకరాల మేర స్థిరీకరణ జరిగింది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి 12 ప్రాజెక్టులను వంద శాతం పూర్తి చేయడం, మరో ఐదు ప్రాజెక్టులను పాక్షికంగా పూర్తి చేయాలని నీటి పారుదల శాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. దీని ద్వారా సుమారు 8.73 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సాగులోకి రానుంది. పూర్తి కానున్న ప్రాజెక్టుల జాబితాలో ఎస్సారెస్పీ స్టేజ్‌–2 కింద 1.26 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 80వేలు, భీమాలో 63వేలు, కోయిల్‌సాగర్‌లో 30వేలు, కొమరంభీం కింద20వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అన్నింటికీ మించి వలస బాట పట్టిన పాలమూరు జిల్లాలో సాగు అవకాశాలను పెంచేందుకు వీలుగా చేపట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌లు ఈ ఏడాది గరిష్ట ఆయకట్టుకు నీరందించనున్నాయి. గత ఏడాది 4.60 లక్షల ఎకరాలు ఈ ప్రాజెక్టుల ద్వారా సాగవగా, ఈ ఏడాది ఏకంగా మొత్తంగా ఏడు లక్షల ఎకరాలకు సాగునీరందనుంది. వీటితో పాటే ఎల్లంపల్లి, దేవాదుల కింద సైతం ఆయకట్టు అవకాశాలు మెరుగయ్యాయి. వైఎస్‌ఆర్‌ జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులన్నీ వచ్చే ఏడాదికి ముగింపు దశకు చేరుకోనున్నాయి. అదే జరిగితే గరిష్టంగా 30లక్షల ఎకరాలకు మించి సాగునీరు అందే అవకాశాలున్నాయి.

వలసబాటకు విరుగుడు ప్రాజెక్టులే
వలస బతుకుల పేరెత్తితే గుర్తుకు వచ్చే పాలమూరు జిల్లా రైతుల బతుకులను మార్చేందుకు ఏకంగా నాలుగు భారీ సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి, తన హయాంలోనే 60 శాతం పనులు పూర్తి చేయించిన ఘనత వైఎస్‌ది. ప్రస్తుతం పాలమూరు ముఖచిత్రం మారి వలసలు తిరుగుముఖం పట్టాయంటే రాజన్న వేసిన బాటలే కారణం. కృష్ణా బేసిన్‌ నుంచి ఏకంగా 70 టీఎంసీల మేర నీటిని వినియోగంలోకి తెస్తూ చేపట్టిన కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌లతో ఏకంగా 7.80 లక్షల ఎకరాల ఆయకట్టును వృద్ధిలోకి తెచ్చేలా రూ.7,969.38 కోట్లతో వీటిని 2005లో ఆరంభించారు. అదే వేగంతో ప్రాజెక్టుల నిర్మాణం, భారీగా నిధుల కేటాయింపు వల్ల శరవేగంగా పనులు జరిగాయి. 2009లో సెప్టెంబర్‌ నాటికి ఈ నాలుగు ప్రాజెక్టుల కింద 60 శాతం పనులు పూర్తయ్యాయి. రూ.2,990 కోట్లతో చేపట్టిన కల్వకుర్తిలో వైఎస్‌ హయాంలో రూ.2,904.01 కోట్లు ఖర్చవగా, భీమా కింద రూ.2158.40 కోట్లలో రూ.1492.38 కోట్లు, నెట్టెంపాడు కింద రూ.1862.73 కోట్లలో రూ.1124.52 కోట్లు, కోయిల్‌సాగర్‌లో రూ.458.25 కోట్లకు గానూ రూ.235.91 కోట్ల మేర ఖర్చయ్యాయి. అయితే ఆయన మరణానంతరం వచ్చిన ముఖ్యమంత్రులు  ప్రాజెక్టులపై చిన్నచూపు చూశారు. భూసేకరణ ఆలస్యం, పరిహారం చెల్లింపులో ఇబ్బందులు, రహదారులు, రైల్వే క్రాసింగ్‌లపై ప్రభుత్వాల పట్టింపు తగ్గడంతో ప్రాజెక్టులన్నీ ఆలస్యమయ్యాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రస్తుత ప్రభుత్వం పాలమూరు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి అవి పూర్తికావడానికి చొరవ చూపడంతో గత ఏడాది 4.60లక్షల ఎకరాలకు నీరందగా, ఈ ఏడాది  ఏడు లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేలా పనులు పూర్తి చేశారు.


ఎల్లంపల్లి ప్రాజెక్టు వచ్చాక వరి పండిస్తున్నా!
నాకు నాలుగు ఎకరాల పొలం ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు పడకముందు కేవలం ఆరుతడి పంటలతోనే కాలం వెల్లదీసేవాళ్ళం. ఆ సమయంలో బోర్లు వేసి వరి సాగు చేద్దామంటే బోర్లు పడే పరిస్థితి లేదు. భూమి ఉన్నా సరే, ఏడాదంతా తిండి గడిచేదెలాగా అని బెంగపడేవాడిని. పోనీ నా భూమిని అమ్మేసి మరోచోట ఎక్కడైనా కొందామంటే అమ్మిన డబ్బులతో మరోచోట భూమి వచ్చే పరిస్థితి లేకుండే. ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మాణం తర్వాత కూడా మాకు నేరుగా నీళ్లు అందవు. కానీ భూగర్భ జలాలు పెరగడంతో బోరు వేస్తే పైపైనే నీళ్ళు పడ్డయ్‌. ఇప్పుడు నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తున్నా.
– గెల్లు రాజయ్య, రైతు, ఎల్లంపల్లి, అంతర్గాం మండలం, పెద్దపల్లి జిల్లా

దేవాదుల వచ్చింది... వలసెల్లినోళ్లు తిరిగొస్తున్నరు!
‘మా ఊరి పక్కనే కాకతీయులు నిర్మించిన భీంఘన్‌పూర్‌ రిజర్వాయర్‌ ఉంది. కానీ దాన్ని ఒక్కరోజు మరమ్మతు చేసిన వారు లేరు. వరద నీరు వచ్చినప్పటికీ బుంగలు పడి నీరంతా వృథాగా పోయేది. మా ఊళ్ళో ప్రతి రైతుకూ మూడు ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉంది. వర్షాలు సరిగా పడక, వరద నీరు రాక చెరువులో ఎప్పుడూ నీరు ఉండకపోయేది. దీంతో పంటలు పండక రైతులు అప్పులపాలై కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు వలసపోయేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దేవాదుల ఎత్తిపోతల పథకానికి మొదటి రిజర్వాయర్‌ మాదే(భీంఘన్‌పూర్‌). పథకం మొదలు పెట్టాక చెరువును బాగా చేశారు. కట్ట ఎత్తు పెంచడమే కాక, బుంగలు పడకుండా చేశారు. పూడిక మట్టిని ఏటా తొలగిస్తున్నారు. దీంతో చెరువులో పుష్కలంగా నీరు నిల్వ ఉంటోంది. ఇదంతా ఆ మహానుభావుడు వైఎస్‌ రాజశేఖర‡రెడ్డి చలువే. ఇప్పుడు మా ఊరిలో ప్రతి రైతూ రెండు పంటలు పండిస్తున్నాడు. మా ఊరి నుంచి ఒక్కరు కూడా వలస వెళ్ళడం లేదు. వలస వెళ్ళిన వారు కూడా తిరిగి వచ్చి వ్యవసాయం చేస్తున్నారు.
– గజ్జి సమ్మయ్య, పంబాపూర్, భూపాలపల్లి మండలం, భూపాలపల్లి జిల్లా

అలీసాగర్‌ ప్రాజెక్ట్‌తో రెండు పంటలు పండిస్తున్నా
‘నవీపేట, శివతండా గ్రామాల మధ్య నాకు రెండెకరాల పొలం ఉంది. అలీసాగర్‌ ప్రాజెక్ట్‌కు ముందు ఈ రెండెకరాల భూమిపై ఆధారపడి జీవించాను. ఉన్న ఒక్క బోరుతో అడపాదడపా పంటలు సాగు చేశాను. ఆశించిన దిగుబడి రాకున్నా పొట్టాబట్టకు లోటురాలేదు. అలీసాగర్‌ ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ నీరు వచ్చాక మరో అయిదెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాను. అలీసాగర్‌ ఎత్తిపోతల పథకంతో నిజాంసాగర్‌ డి–50 ఉప కాలువ ద్వారా నేరుగా పంట పొలాలకు సాగు నీరు వస్తోంది. తొమ్మిదేళ్లుగా రెండు పంటలు పండిస్తున్నా’.
–షేక్‌ మునీర్, రైతు, శివతండా, నవీపేట మండలం, నిజామాబాద్‌ జిల్లా

వాన కోసం ఎదురుచూపుల్లేవు
‘నాకు చలివాగు కింద 1.20 ఎకరాల పొలం ఉంది. ఇంతకు ముందు చలివాగులో నీరున్నప్పుడే నాట్లు వేసేవాడిని. ఒక్కో ఏడాది సమయానికి సరిగా వర్షాలు పడక చెరువు నిండక, పంట ఎండిపోయేది. పెట్టిన పెట్టుబడి రాక, తినేందుకు వడ్ల గింజలు లేక ఇబ్బంది పడేవాళ్ళం. రైతులం అయి ఉండీ బియ్యం కొనుక్కొని తినాల్సిన దుస్థితి. రెండవ పంట అంటే ఎట్లుంటదో మాకు తెలియదు. కానీ ఇప్పుడు రెండు పంటలు సూపర్‌గా పండిస్తున్నాం. దేవాదుల పథకం రెండవ దశ కింద చలివాగును నింపుతున్నరు. వానల కోసం ఎదురు చూపులు, చెరువు నిండుతదో లేదో చింత లేదు. గోదావరిలోకి నీళ్ళు వచ్చినయంటే చాలు. దేవాదుల మోటార్లు ఆన్‌ చేస్తున్నరు.
– కొమ్ము కొమురయ్య, పెద్దకోడెపాక, శాయంపేట మండలం, వరంగల్‌ రూరల్‌ జిల్లా


 

మరిన్ని వార్తలు