ఆనంద గోవర్థనం

26 Jun, 2013 17:01 IST|Sakshi
ఆనంద గోవర్థనం
 పడితేనే అది ముడి. లేకుంటే ఒట్టి పసుపుతాడు.
 కలిసి పడితేనే అవి ఏడడుగులు.లేకుంటే ఒట్టి అడుగులు.
 కానీ కొన్నిసార్లు... మూడు ముళ్లు పడ్డాక కూడా
 తాడు తాడులా ఉండిపోతుంది!ఏడడుగులు నడిచాక కూడా
 ఏకాకి నడకే బెటరనిపిస్తుంది!చేతన్ ఆనంద్‌కి జరిగిందిదే!
 పెళ్లి వర్కవుట్ అవలేదు. అలాగని ఆనంద్ ఔట్ అవలేదు.
 చేతనను, ఆనందాన్ని ఒకేసారి...తన జీవితంలోకి తెచ్చిన గోవర్ధినితో కలిసి
 ఫ్రెష్‌గా మ్యాచ్ స్టార్ట్ చేశారు. ఈ కొత్త కాంబినేషనే... ఈవారం... ‘మనసే.. జతగా’. 
 
 చేతన్ ఆనంద్ పుట్టి పెరిగింది విజయవాడ. ఇంజనీరింగ్ వరకు చదివిన చేతన్ తొమ్మిదేళ్లకే క్రీడారంగంలోకి అడుగుపెట్టారు. అంతర్జాతీయ టోర్నమెంట్లలో ఆడారు. ఇరవై ఏడేళ్ల వయసులో సహ బాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తాజ్వాలను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఐదేళ్ల దాంపత్యంలో చోటుచేసుకున్న పరిణామాల ఫలితంగా ఇద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత అతని జీవితంలో స్నేహితురాలిగా, తర్వాత ప్రేమికురాలిగా, ఆ తర్వాత ఇల్లాలిగా శారదాగోవర్ధిని ప్రవేశించారు.
 
 శారదాగోవర్ధిని కూడా చేతన్ ఆనంద్ సహ క్రీడాకారిణి. ఆమె పుట్టిపెరిగింది హైదరాబాద్‌లో! వ్యాపార కుటుంబనేపథ్యం నుంచి వచ్చిన శారద అమెరికాలో ఎల్.ఎల్.ఎమ్ చేశారు. ‘‘చేతన్ వ్యక్తిత్వం, సింప్లిసిటీ నన్ను అమితంగా ఆకట్టుకునేవి. అవే నన్ను తనకి దగ్గరచేశాయి’’ అన్నారు శారద. చేతన్ గత జీవితం తనకు అక్కర్లేదని, ఇప్పుడు ఎంత ఆనందంగా జీవిస్తున్నామో, అదే తనకు ముఖ్యం అన్నారామె. 
 
 ‘‘ఆడంబరాలకు పోని వ్యక్తి శారద. మా మతాలు వేరైనా నన్ను పెళ్లి చేసుకోవడం కోసం పెద్దలందరినీ ఒప్పించింది. నాపై చూపే ఆ ప్రేమ శారదకు నన్ను దగ్గర చేసింది’’ అంటారు చేతన్. చేతన్ ఆనంద్ వయసు 32. శారద గోవర్ధిని వయసు 27. కిందటేడాది అక్టోబర్ 25న వీరి వివాహం అయ్యింది. ఎనిమిది నెలల వారి దాంపత్యం గురించి వీరు ఏం చెబుతున్నారంటే...
 
 మీ పరిచయం ప్రేమగా ఎప్పుడు మారింది? పెళ్లి వైపు ఎలా అడుగులు వేయించింది? 
 చేతన్: గోవి (శారదా గోవర్ధినిని ఇలా పిలుస్తారు చేతన్) క్రీడాకారిణిగా నాకు ముందే తెలుసు. మా ఇద్దరి స్నేహితుల ద్వారా మా మధ్య స్నేహం ఏర్పడింది. సాధారణంగా నాకు స్నేహితులు చాలా తక్కువ. కొత్తవాళ్లతో తొందరగా కలవలేను. ఎదుటివారి వేవ్‌లెంగ్త్ కొంత కలిస్తే తప్ప స్నేహం చేయలేను. శారద అలా కాదు, అందరితోనూ కలుపుగోలుగా ఉంటుంది. మా మధ్య స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో గుర్తు లేదు... 
 
 శారద: క్రీడాకారిణిగా చేతన్ గురించి ముందే తెలుసు. చదువుకోసం అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత మా మధ్య పరిచయం ఏర్పడింది. కామ్‌గా తన పనేదో తను చేసుకుంటూ, కలిసినప్పుడు చాలా చక్కగా మాట్లాడే చేతన్ అంటే... ఎప్పుడు ఇష్టం ఏర్పడిందో నాకే తెలియదు. కాని ఏ చిన్న విషయమైనా షేర్ చేసుకునే వాళ్లం. అప్పుడే పెళ్లి చేసుకుంటే బాగుంటుంది కదా! అని అడిగాను...
 
 చేతన్: దాదాపు ఏడాది పాటు కొనసాగిన మా స్నేహంలో గోవి ఎప్పుడూ  నా గత జీవితం గురించి అడగలేదు. అయినా ఏదో సందర్భంలో ‘ఇష్టపడ్డాను’ అని చెప్పినప్పుడు కూడా ‘ముందే ఆలోచించుకో’ అని భయపెట్టాలని చూశాను (నవ్వుతూ)... కాని తన అమ్మనాన్నలను ఒప్పించి మరీ మా బంధాన్ని పెళ్లి పీటలవైపుకు తీసుకెళ్లింది.
 
 శారద: ఈయన చెంత ఉంటే నేను సంతోషంగా ఉంటాను అనే నమ్మకం వచ్చింది కనుకే పెళ్లివైపు అడుగులు వేశాను.
 
 పెళ్లి తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు చూశారు?
 శారద: పెళ్లికి ముందు కూడా ప్రతి అమ్మాయికి కూతురిగా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ తర్వాత ఇల్లాలిగా ఈయన అవసరాలు చూడటం, ఇంటిని చక్కదిద్దుకోవడం.. బాధ్యతలలో మార్పు వచ్చిందనుకున్నాను తప్ప ప్రత్యేకించి ఏమీ అనిపించలేదు.
 
 చేతన్: నేనెప్పుడూ ఒకేలా ఉన్నాను. పెద్ద మార్పేమీ అనిపించలేదు.ఒకరిలో ఒకరికి నచ్చినవి?
 చేతన్: గోవి నన్ను, నా అవసరాలను గమనించి చూసుకోవడం, మా అమ్మనాన్నలకు ఇచ్చే గౌరవం నాకు బాగా అనిపిస్తాయి. పార్టీలకి, పబ్‌లకు వెళ్లడం, పెద్ద పెద్ద కార్లలో తిరగడం అంటే నాకు ఇష్టం ఉండదు. గోవి కూడా అంతే! ఎవరో చూస్తున్నారు కదా, బ్రాండెడ్ దుస్తులు వేసుకోవాలి, పెద్ద పెద్ద కార్లలో తిరగాలి, రకరకాలుగా డ్రెస్ చేసుకోవాలి, ప్రతి రోజూ మీడియాలో కనిపించాలి అనుకోదు. 
 
 పార్టీలకు వెళ్లినా జస్ట్ అటెండ్ అయ్యి వచ్చేస్తాం. పార్టీలకు వెళ్లడం తప్పు అనను కాని పార్టీలే లోకంలా, పార్ట్‌నర్ కన్నా స్నేహితులే ముఖ్యంగా అనుకోకూడదు. వాటికే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తే కుటుంబం స్పాయిల్ అవుతుంది. గోవి అలాంటివాటికి పూర్తి విరుద్ధం. అలాగే టూ మచ్‌గా నన్ను ఫలానా చోటుకి తీసుకెళ్లాలి అనుకోదు. ఇంట్లో ఉండటం ఎక్కువ ఇష్టపడుతుంది. నా నుంచి పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయదు... ఇలా నచ్చే అంశాలు చాలానే ఉన్నాయి.
 
 శారద: ఈయన ఎవరినీ హర్ట్ చేయరు. బయట వాళ్లతో ఎలా ఉన్నా, నా దగ్గరకు వచ్చేసరికి చాలా ఓపెన్‌గా ఉంటారు.
 
 గతం నుంచి నేర్చుకున్న పాఠాలు?
 చేతన్: జరిగినదాంట్లో నా పొరపాటు ఏమీ లేదు. ఇక పాఠాలేముంటాయి? ఎప్పుడూ నేను సింపుల్‌గా ఉండటానికి ఇష్టపడతాను. నాకు నచ్చే అమ్మాయి ఎలా ఉండాలో గోవిలో ఆ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకు నేను అదృష్టవంతుణ్ణి అనుకుంటాను. 
 
 ఎప్పుడైనా మీ ముగ్గురూ (చేతన్, జ్వాల, శారద) తారసపడిన సందర్భాలు?
 చేతన్: రెగ్యులర్‌గా ఎల్.బి.స్టేడియమ్‌లో ప్రాక్టీస్ దగ్గర ఎదురుపడుతుంటాం. ‘హాయ్’ చెప్పేసుకుంటాం. ఎవరి జీవితంలో వాళ్లం హ్యాపీగా ఉన్నాం కాబట్టి ఏమీ అనిపించదు.
 
 శారద: ఫీలవడం లాంటివి ఏవీ ఉండవు. గతం గతః అంతే! 
 ఒకరిలో ఒకరికి నచ్చనివి?
 చేతన్: గోవి ఓ పెద్ద క్వొశ్చన్ బ్యాంక్. చెడు అయినా, మంచి అయినా ఏ చిన్న విషయంలో అయినా డౌట్ వచ్చిందంటే చాలు చెప్పేదాకా వదిలిపెట్టదు. ఇదే నాకు నచ్చదు. పుస్తకాలు, పేపర్లు తెగ చదివేస్తుంటుంది. అందులో ఏదైనా డౌట్ వచ్చిందా... నెట్ సెర్చింగ్ చేసైనా సరే తెలుసుకునేదాకా నిద్రపోదు.
 
 శారద: ఇలాంటి వ్యక్తి నచ్చకుండా కూడా ఉంటారా?! (నవ్వులు)
 పొదుపు, పెట్టుబడులు... డబ్బు విషయంలో ఇద్దరిలో ఎవరు పర్‌ఫెక్ట్?
 చేతన్: మా నాన్నగారు విజయవాడలోనే బాడ్మింటన్ అకాడమీ స్టార్ట్ చేశారు. దానికి క్రీడలపరంగా సపోర్ట్ చేస్తుంటాను. కాని బిజినెస్ మ్యానేజ్ చేయాలంటే చాలా కష్టం అనుకుంటాను. అలాగే సేవింగ్స్ కూడా! ఆ క్రెడిట్ గోవికే...!
 
 శారద: నేను డాడీ కంపెనీలోనే ఏడాది పాటు జాబ్ చేశాను. అలా కొంతవరకు మనీ మేనేజ్‌మెంట్ గురించి తెలుసు. కాని పెద్దగా తెలియదు. (నవ్వుతూ)
 
  బాడ్మింటన్‌లో ఎవరు ఎవర్ని ట్రైన్ చేస్తుంటారు? 
 చేతన్: ఇంతకు ముందు గోవి కూడా ఆడే ది. ఇప్పుడు ప్రెగ్నెంట్. అందుకే ప్రాక్టీస్ చేయడం లేదు. అందుకేనేమో నన్ను ఎక్కువ ట్రైన్ చేయాలని చూస్తుంటుంది. (నవ్వుతూ) తనూ ప్లేయర్ కాబట్టి, ఆ సూచనలు తీసుకుంటుంటాను. 
 
 శారద: టెన్నిస్ కోర్ట్‌లో ఇద్దరం డబుల్స్ ఆడుతుంటాం. అప్పుడు నేను సరిగా ఆడకపోతే ఈయనకి చాలా కోపం వచ్చేస్తుంది. ఎవరు సరిగా ఆడకపోయినా ఏమీ అనరు. నన్ను మాత్రం అంటారు. అప్పుడు నాకూ కోపం వస్తుంటుంది. 
 
 పిల్లలు దాంపత్యబంధాన్ని పట్టి ఉంచుతారంటారా?
 చేతన్: పిల్లలు ఉంటే దాంపత్యం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కాని పిల్లల కోసమే అన్నట్టుగా ఉంటే అది రాజీ పడడమే అవుతుంది. 
 
 శారద: మరో ఐదు నెలల్లో మా మధ్య ఇంకో ప్రాణి వస్తుందనుకోవడమే చాలా ఆనందంగా ఉంది. 
  ఇద్దరికీ కంగ్రాట్స్!
 చేతన్, శారద: థాంక్యూ! 
 
 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
మరిన్ని వార్తలు