ఆమె అనురాగం మనసును తేలిక చేసే మంత్రం.. అతడి ప్రేమ అనంతం! ఒకరికి ఒకరై ఉంటే..

9 Nov, 2023 21:14 IST|Sakshi

జీవనసహచరులు.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ పరస్పర సమన్వయంతో కలిసి నడిస్తే జీవితం సాఫీగా సాగిపోతుంది. కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ ముందడుగు వేస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం మరింత సులువవుతుంది. గమ్యాన్ని చేరుకునే క్రమంలో అవాంతరాలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి లభిస్తుంది. 

అందుకే.. అన్ని వేళలా అండగా ఉండే జీవిత భాగస్వామి దొరికితే అంతకంటే అదృష్టం మరొకటి ఉండదంటారు. గ్లెన్‌ మాక్స్‌వెల్‌- వినీ రామన్‌ దంపతులు కూడా ఆ కోవకే చెందుతారు. 

గ్లెన్‌ మాక్స్‌వెల్‌.. ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌గా క్రికెట్‌ ప్రపంచానికి సుపరిచితం. మేటి జట్టులో ఆల్‌రౌండర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్న ఈ విక్టోరియా వీరుడు ఒకానొక సమయంలో తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోయాడు.

చెయ్యి విరగ్గొట్టుకోవాలని చూశా
‘‘నేను చేసిన పనులన్నీ.. నేను చేయనివిగా చూపేందుకు ప్రయత్నిస్తున్నా. వరల్డ్‌కప్‌ సమయంలో నా చెయ్యి విరగ్గొట్టుకునేందుకు ట్రై చేశా. నాకు బ్రేక్‌ కావాలి. ఎవరిని చూసినా ఎందుకో కోపం వస్తోంది. నిజానికి అది నా మీద నాకున్న కోపం ప్రపంచకప్‌ ఈవెంట్లో నేను సరిగ్గా ఆడలేకపోయినందుకు వచ్చిన విసుగు. 

దీని నుంచి తొందరగానే బయటపడదామనుకున్నాను. కానీ.. అనుకున్నంత సులువేమీ కాదు’’ అంటూ తాను డిప్రెషన్‌తో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని 2019లో తొలిసారి బయటపెట్టాడు మాక్సీ. శ్రీలంకతో టీ20 సిరీస్‌ మధ్యలోనే జట్టును వదిలివెళ్లాడు. 

‘‘అతడొక ప్రత్యేకమైన ఆటగాడు’’ అంటూ క్రికెట్‌ ఆస్ట్రేలియా కూడా మాక్సీ నిర్ణయానికి మద్దతునిచ్చింది. ఇక టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లి కూడా.. ‘‘ముందు ఆరోగ్యం.. ఆ తర్వాతే ఆట’’ అని చెప్పకనే చెప్పిన తన స్నేహితుడికి అండగా నిలిచాడు. 

మనసుకు దగ్గరైన మనిషి చెబితేనే
బయట నుంచి ఎవరు ఎంతగా మద్దతునిచ్చినా మనసుకు దగ్గరైన మనిషి చెప్పే మాటలే ఎక్కువ సాంత్వన చేకూరుస్తాయి. మాక్సీ సమస్యను ముందుగానే పసిగట్టింది వినీ(అప్పటికి తను మాక్సీ గర్ల్‌ఫ్రెండ్‌ మాత్రమే). ఒత్తిడి నుంచి అతడిని  బయటపడేసే మార్గం గురించి ఆలోచించింది.

ఇది తేలికగా కొట్టిపారేసే విషయం కాదని.. స్పెషలిస్టును కలవాల్సిందేనంటూ పట్టుబట్టింది. ఇందులో సిగ్గుపడాల్సిన విషయం ఏమీలేదంటూ మానసిక ధైర్యాన్నిచ్చింది. మాక్సీ ఆమె మాటను కాదనలేకపోయాడు. 

గుండెల మీది భారం దిగిపోయింది
వినీ చెప్పినట్లు చేశాడు. గుండె మీది నుంచి పెద్ద కుంపటి దించుకున్నట్లయింది. నెలలపాటు విశ్రాంతి తీసుకున్న తర్వాత మాక్సీ మళ్లీ మునుపటిలా చలాకీగా మారిపోయాడు. పునరాగమనంలో తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ ఆడుతూ అభిమానగణాన్ని ఖుషీ చేస్తున్నాడు.

తాజాగా వన్డే వరల్డ్‌కప్‌-2023లో ఆరంభంలో బ్యాటింగ్‌తో ఆకట్టుకోలేకపోయిన్పటికీ బంతితో ప్రభావం చూపగలిగాడు. అయితే, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో ఫాస్టెస్ట్‌ సెంచరీతో మెరిసిన మాక్స్‌వెల్‌.. అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో అనూహ్య రీతిలో డబుల్‌ సెంచరీ బాదాడు.

మంత్రదండంతో మాయ చేసినట్లు
తన చేతికే బ్యాట్‌ మొలిచిందా అన్నట్లు నిలబడిన చోట నిలబడినట్లే.. మంత్రదండంతో ఏదో మాయ చేసినట్లు పరుగుల వరద పారించాడు. గాయం కారణంగా అంతకు ముందు మ్యాచ్‌కు దూరమైన మాక్సీ నుంచి ఇలాంటి ప్రదర్శన ఎవరు ఊహించగలరు!

ఓడిపోతుందన్న మ్యాచ్‌ను గెలిపించి ఐదుసార్లు చాంపియన్‌ అయిన ఆస్ట్రేలియాను తాజా ఎడిషన్‌లో ఒంటిచేత్తో సెమీస్‌కు చేర్చాడు. ఆత్మవిశ్వాసం చెక్కుచెదరనీయక జట్టుకు చిరస్మరణీయ విజయం అందించిన తీరు ముచ్చటగొలిపింది.

తన భర్తకు సంబంధించిన ఆనంద క్షణాలను ఫోన్‌ కెమెరాతో బందించిన వినీ.. ‘‘100 కాదు.. 201*.. భావోద్వేగాల సమాహారం’’ అంటూ సోషల్‌ మీడియాలో ఫొటోను పంచుకుంది. ఈ ఒక్క క్యాప్షన్‌ చాలు.. మాక్సీ డబుల్‌ సెంచరీ తమకు కేవలం ఒక నంబర్‌ కాదు.. ఓ ఎమోషన్‌ అని చెప్పడానికి!!

భారత సంతతి అమ్మాయి.. తమిళనాడు ఆడపడుచు
తమిళనాడుకు చెందిన వెంకట్‌ రామన్‌, విజయలక్ష్మీ రామన్‌ దంపతులు చాలా ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో స్థిరపడ్డారు. మెల్‌బోర్న్‌లో నివాసం ఏర్పరచుకున్న ఈ ఇండియన్‌ కపుల్‌కి 1993, మార్చి 3న వినీ జన్మించింది.

అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న వినీ ఫార్మాసిస్ట్‌గా కెరీర్‌ నిర్మించుకుంది. తీరిక దొరికినప్పుడల్లా స్నేహితులతో ప్రయాణాలు చేయడం వినీకెంతో ఇష్టం. అలా కామన్‌ ఫ్రెండ్స్‌ ద్వారా 2018లో మాక్స్‌వెల్‌ ఆమెకు పరిచయమయ్యాడు.

రెండు సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి
నాలుగేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న తర్వాత మాక్సీనే వినీ వద్ద పెళ్లి ప్రస్తావన తెచ్చాడు.  తన మనసులో ఉన్న మాట.. కోరుకున్నవాడి నోటి నుంచి.. బయటకు వస్తే ఏ అమ్మాయికి మాత్రం సంతోషంగా ఉండదు.

వినీ కూడా అంతే.. ఇష్టసఖుడి ప్రతిపాదనను నవ్వుతూ అంగీకరించింది వినీ. ఇరు కుటుంబాలు కూడా వీరి ప్రేమను పెళ్లిపీటలెక్కించేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాయి. అలా 2022లో క్రిస్టియన్‌, హిందూ వివాహ పద్ధతిలో మాక్స్‌వెల్‌- వినీ రామన్‌ వివాహం జరిగింది.

గర్భస్రావం.. మానసిక సంఘర్షణ
తమ ప్రేమకు గుర్తుగా ముద్దూమురిపాలు మూటగట్టే చిన్నారి రాబోతుందనే వార్త తెలిసి నూతన జంట ఆనందంలో తేలిపోయింది. కానీ.. దురదృష్టవశాత్తూ వినీకి గర్భస్రావమైంది. ఆ సమయంలో ఆమె  కుంగిపోకుండా అండగా నిలబడ్డాడు మాక్సీ.

మానసిక ధైర్యం కోల్పోకుండా కంటికి రెప్పలా కాచుకున్నాడు. ఆ విషాదం తర్వాత.. లోగాన్‌ మెవెరిక్‌ రూపంలో వారి జీవితాల్లో మళ్లీ కొత్త వసంతాలు చిగురించాయి. లోగాన్‌ మరెవరో కాదండి.. మాక్సీ- వినీల ముద్దుల కుమారుడు. 

రెయిన్‌బో బేబీ రాకతో
ఇక ముందు తల్లిదండ్రులం అవుతామో లేదోనన్న భయాలతో ఆ దంపతుల మనసులో చెలరేగిన అలజడిని.. తుఫాన్‌ తర్వాత వచ్చే ఇంద్రధనుస్సులా మాయం చేసిన బుజ్జాయి. (రెయిన్‌ బో బేబీ- గర్భస్రావం తర్వాత జన్మించిన బిడ్డ). ఈ ఏడాది సెప్టెంబరు 11న జన్మించాడు.

నాన్నకు ఆట నుంచి కాస్త విరామం దొరకగానే ఎంచక్కా అతడి గుండెల మీద వాలి హాయిగా నిద్రపోతాడు లోగాన్‌!! ఇక ఒకరికోసం ఒకరు అన్నట్లు జీవిస్తున్న  వినీ- మాక్సీ తమ గారాల పట్టిని నిద్రపుచ్చేందుకు జోలపాట పాడుతూ లాలిస్తూ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాలా!?
-సుష్మారెడ్డి యాళ్ల

మరిన్ని వార్తలు