ఉల్లి.. తలచినంతనే కన్నీటి జల్లు!

22 Oct, 2013 15:19 IST|Sakshi
ఉల్లి.. తలచినంతనే కన్నీటి జల్లు!

ఉల్లిపాయ.. పెట్రోలు.. బీరు.. ఈ మూడూ ఇప్పుడు దాదాపు ఒకే ధర పలుకుతున్నాయి. దేశ రాజధాని నగరంలో ఉల్లిపాయలు కిలో 80-90 రూపాయలకు పైగా ఉంటోంది. రాష్ట్ర రాజధాని నగరంలో కూడా 40 నుంచి 60 రూపాయలకు ఏమాత్రం తగ్గడంలేదు. రైతు బజార్లలోనే చూసుకున్నా కూడా కిలో ఉల్లిపాయలు 44 రూపాయల వరకు ఉంటున్నాయి. ఉల్లిపాయను కోస్తే కాదు.. తలచుకుంటేనే కన్నీళ్లు పెట్టాల్సిన పరిస్థితి ఉంటోంది. వారం కాదు.. నెల కాదు.. దాదాపు మూడు నెలలుగా ఉల్లిపాయ ధరలు ఆకాశంలోనే ఉంటున్నా, ప్రభుత్వాలు మాత్రం చలించిన పాపాన పోవట్లేదు. దేశంలోని చాలా వరకు ప్రధాన నగరాల్లో ఉల్లిపాయలు కిలో 60 నుంచి 80 రూపాయల వరకు పలుకుతున్నాయి.

ఉల్లిపాయలు ఎక్కువగా సాగుచేసే మహారాష్ట్రలో అకాల వర్షాలు కురవడం వల్ల అక్కడి ఖరీఫ్ పంట బాగా దెబ్బతింది. దీంతో దిగుబడి లేక ఉల్లిధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో జనం ప్రభుత్వాల మీద మండిపడుతున్నారు. ఆమ్లెట్లో ఉల్లిపాయలు వేయలేదన్న కోపంతో ఉత్తర భారతంలో ఓ వ్యక్తి ఏకంగా ఓ చిరువ్యాపారిని తుపాకితో కాల్చిపారేసిన సంఘటన కూడా జరిగింది. హోటళ్లు, రెస్టారెంట్లలో అయితే ఉల్లిపాయల వాడకం పూర్తిగా మానేశారు. బిర్యానీ, రోటీలు ఆర్డర్ చేసినప్పుడు ఇంతకుముందు ఉల్లిపాయలు కోసి, నిమ్మకాయ ముక్కలతో ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం కేవలం కీరా, క్యారెట్ ముక్కలు, నిమ్మకాయ మాత్రమే ఇస్తున్నారు. ఉల్లి రేటు చూస్తే అంత భయపడాల్సి వస్తోంది మరి.

ఉల్లిధరలు అదుపులోకి రాకపోవడంతో ఇప్పుడు ఎగుమతుల మీద నిషేధం విధించే ఆలోచన చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వంలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గతంలో టన్నుకు 650 డాలర్లుగా ఉన్న కనీస ఎగుమతి ధరను 900 డాలర్లు చేశారు. అయినా అది ఏమాత్రం ఫలితాన్ని ఇవ్వలేదు. ఉల్లిపాయల సరఫరా పడిపోవడంతో ఏమీ చేయలేకపోతున్నామని అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఈనెలలో ఉల్లిపంట దిగుబడి వస్తుందని, అది బాగా వస్తే అప్పుడు ధరలు ఒక్కసారిగా పడిపోవడం ఖాయమని ప్రభుత్వం ఆశాభావంతో ఉంది.

మరిన్ని వార్తలు