లైఫ్‌నిచ్చింది సిటీనే

18 Feb, 2015 00:37 IST|Sakshi
లైఫ్‌నిచ్చింది సిటీనే

‘1940లో ఒక గ్రామం’ సినిమా అరంగేట్రంతోనే టాలీవుడ్ అభిమానులను మెప్పించి నంది అవార్డును దక్కించుకుంది. ‘విరోధి’తో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటింది. అలియాస్ జానకిగా అందరి నోళ్లలో నానిన శ్రీ (అలియాస్ శ్రీరమ్య) ఇటీవల సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో శారీలో తళుక్కుమంది. తాను పుట్టి పెరిగిన హైదరాబాద్‌లో నాటి, నేటి జ్ఞాపకాలను, తన కెరీర్ విశేషాలను ‘సిటీ ప్లస్’తో ఇలా చెప్పుకొచ్చింది...
 
 మాది విజయవాడ. నేను పుట్టి పెరిగింది మాత్రం హైదరాబాద్‌లోనే. నానల్‌నగర్‌లోని కేంద్రీయ విద్యాలయలో టెన్త్ వరకు చదివా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీకాం. చదువు అంతగా అబ్బేది కాదు. మూడేళ్ల నుంచే క్లాసికల్ డ్యాన్స్‌పై మోజు. వెంటనే బెంగళూరు పద్మ వద్ద శిక్షణ తీసుకున్నా. ఐదేళ్లకే నాట్యమందిర్ అవార్డు వచ్చింది. క్లాసికల్ డ్యాన్స్‌ను చూసి మంజూలా నాయుడు పిలిచారు. రుతురాగాలు సీరియల్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా అవకాశమిచ్చారు. ఆ తర్వాత కస్తూరి, చక్రవాకం, చక్రతీర్థం, శాంతినివాసం తదితర సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకుల మన్ననలు పొందా. ఈ క్రమంలోనే ‘1940లో ఒక గ్రామం’ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. తర్వాత శ్రీకాంత్‌తో ‘విరోధి’లో చేశా. ‘అలియాస్ జానకి’ మూవీ కూడా చేశా. తమిళంలో ‘యమున’లో నటించా. మంచి కథ కోసం వేచి చూస్తున్నా.
 
 తారామతి చాలా ఇష్టం...
 గోల్కొండ, తారామతి బారాదరి చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి అక్కడికి ఎన్నోసార్లు వెళ్లా. టైమ్ దొరికితే జూబ్లీహిల్స్‌లోని మహరాజ్ చాట్‌భండార్‌లో వాలిపోవల్సిందే. బేగంపేటలోని నీడ్స్ దాబాలో డిఫరెంట్ స్పైసీ వంటకాల్ని టేస్ట్ చేస్తా. ఓరిస్‌కు రెగ్యులర్‌గా వెళ్తుంటా. హోలీ వచ్చిందంటే ఫ్రెండ్స్‌తో కలిసి రంగుల్లో మునిగి తేలడమే. హైదరాబాద్ బిర్యానీ ఇష్టం. నానల్‌నగర్‌లో బాలాజీ స్వీట్‌షాప్‌లో అజ్మీరీ కలాకంద్, రోడ్ల మీద గప్‌చుప్ లాగిస్తుంటే భలే మజా. బాలీవుడ్ సినిమాల్లో చాన్స్‌ల కోసం ముంబైకి షిఫ్టయ్యా. సిటీలోనే ఫ్యామిలీ ఉండటంతో పండుగలు, బర్త్‌డేలకు వచ్చిపోతున్నా. ఏదిఏమైనా నాకు లైఫ్‌నిచ్చింది సిటీనే! నా చిన్నప్పటి నగరాన్ని మళ్లీ చూడాలనిపిస్తోంది.
 - వాంకె శ్రీనివాస్

మరిన్ని వార్తలు