ఖండకర కార్పాసకూర్పాసం అంటే...?

24 Aug, 2014 00:59 IST|Sakshi
ఖండకర కార్పాసకూర్పాసం అంటే...?

నవ్వింత: ఈ మధ్య మా రాంబాబుగాడు బనీను మీదే ఉంటున్నాడు. దగ్గర్లోని కూరగాయల షాపు, కిరాణ స్టోరుకు వెళ్లాలన్నా అదే డ్రస్‌కోడు. అందుకే ఓ రోజు తెగించి వాడికి సలహా ఇచ్చా.  ‘‘లుంగీ, బనీను మీద ఇంటి ముందుకొచ్చే బండ్ల దగ్గరకు వెళ్లడం అయితే పర్లేదు గానీ... బజారుకు వచ్చేటప్పుడైనా బట్టలు కట్టుకుని రారా’’. ఊహించినట్టే వాడు ఆవేశపడ్డాడు.
 ‘‘బనీను గొప్పదనం నీకు తెలియట్లేదురా. కొంతమంది బనీను లేకుంటే అసలు చొక్కా వేసుకోనే వేసుకోరు. ఒకవేళ అలా వేసుకోవాల్సి వచ్చినా వాళ్లు సంతృప్తిగా ఉండలేరు. మత్తుమందు కంటే ఎక్కువగా అడిక్టు చేయించే వస్త్రవిశేషం, విశేషవస్త్రం బనీను’’.
 ‘‘బనీను గొప్పదేమిట్రా నీ ముఖం’’ అన్నాను.
 ‘‘బనీనంటే ఏమిటి? బిడ్డపుట్టగానే  బనీను గుడ్డలో చుట్టి ఉంచుతారు. పుట్టుకతో మొదలైన ఈ బనీను బంధం... పుడకల దగ్గర పోవాల్సిందేరా. అంతగా తోడొచ్చే వస్త్రం మరోటి లేదు. అంతెందుకు పైన తొడిగే షర్టు ఓ భవనం అయితే దానికి పునాది బనీను. అందుకే కొందరు బనీనునూ, అది ఇచ్చే కంఫర్టునూ వదల్లేక దానికే కాలరొకటి కుట్టించి, ‘టీ షర్ట్’ అని ముద్దుపేరు పెట్టుకున్నారు’’ అన్నాడు.
 ‘‘ఒరే రాంబాబూ, రోజూ క్యాజువల్‌గా తొడుక్కునే దానికి ఇంత రాద్ధాంతం ఏమిట్రా! టాపిక్ వదిలెయ్’’ అన్నాన్నేను.
 కానీ వాడు అంత తేలిగ్గా వదలడానికి ఇష్టపడలేదు. ‘‘బనీను తెలుగు సినిమా రంగానికి  సేవ చేస్తుంటుందిరా. హీరో ఇమేజ్‌ను కాపాడటానికి తోడ్పడుతుంది’’
 ‘‘బనీనా... హీరో ఇమేజ్‌నా’’ అన్నాను సంభ్రమంగా.
 ‘‘హీరో తన అల్లరి మూకతో ఆగడాలు చేస్తూ పోలీసులకు పట్టుబడతాడనుకో. అప్పుడు పోలీసులు హీరోకు తోడున్న తోకబ్యాచీవాళ్లందర్నీ చారల డ్రాయర్ మీద నగ్నంగా నిలబెడతారు. కానీ హీరోకు మాత్రం బనీనును ఉంచి వాడి ఇమేజు డ్యామేజు కాకుండా కాపాడతారు. ఇక నువ్వు చాలా విలువైన జాతివజ్రాలనూ, మేలురత్నాలనూ బంగారుపళ్లెంలో పోసి రాచకొలువుకు తెస్తున్నావనుకో. అప్పుడు ఒక అందమైన నగిషీల గుడ్డ కప్పి తెస్తావు చూడు... అలాంటిదే హీరో బనీను. జాతివజ్ర, మేలిరత్న దర్శన సమయంలో సదరు జలతారు వస్త్రాన్ని పక్కకు తొలగించినట్టే... సినిమా చివర్లో హీరో కూడా బనీను విప్పేసి తన సిక్స్‌ప్యాక్ చూపిస్తాడన్నమాట. ఇది కండలున్న హీరోకు! ఒకవేళ వాడు కండల్లేని హీరో అనుకో. ఇంటి సీన్లూ, పెరటి సీన్లలాంటి క్యాజువల్ సన్నివేశాల్లో వాడి మానరక్షణతో పాటు మళ్లీ ఇమేజు సంరక్షణకు తోడ్పడుతుంది. అది మన సంస్కృతి’’ అంటూ ఒక థీసిస్ సమర్పించాడు.
 ‘‘బనీను సంస్కృతేమిట్రా బాబూ. అది ఇంగ్లిషు వాళ్లు నేర్పిన అలవాటు కాదా?’’ అని ఆశ్చర్యంగా అడిగాన్నేను.
 ‘‘కాదు... ప్రబంధమహాకవి శ్రీనాథుడేమన్నాడు? ‘కుల్లాయుంచితి... మహాకూర్పాసమున్ తొడిగితిన్’ అన్లేదా? మహాకూర్పాసమంటే ఏమనుకున్నావ్. గొప్ప బనీను అని అర్థం తెల్సా? అలా ఎన్నో రకాలు’’ అన్నాడు వాడు.
 ‘‘బనీన్లలో రకాలా?’’
 ‘‘మహాకూర్పాసమంటే బహుశా శ్రీనాథుడూ దాని గొప్పదనాన్ని అర్థం చేసుకొని, మహా అనే విశేషణాన్ని చేర్చి ఉంటాడు. ఆయన చేతులున్న బనీను వేసుకుని ఉంటాడు. చేతుల్లేని బనీనును ‘ఖండకర కార్పాసకూర్పాసం’ అని మన తెలుగు సార్ చెప్పింది నీకు గుర్తులేదా? మొన్న మొన్నటి వరకూ షావుకార్లూ, మోతుబర్లూ సైనుగుడ్డను బనీనుగా కుట్టించి డబ్బులూ అవీ జాగ్రత్తగా పెట్టుకోడానికి దాన్లోనే కలిసిపోయి కనిపించని విధంగా పెద్ద పెద్ద జేబులు పెట్టించేవారు. పైన షర్టేసేవారు. మామూలు బడుగు జనాలైతే పై అంగీలేకుండా వాటినే వేసుకునేవారు’’ అంటూ బనీన్ల చరిత్ర, వాటి ప్రాధాన్యం గురించి లెక్చరిచ్చాడు.
 ‘‘ఆయనేదో ఆరోజు ఖండకరకార్పాసమంటూ హాస్యానికి అన్నారు. నువ్వేమో  సీరియస్‌గా తీసుకుంటున్నావ్’’
 పిచ్చి వదిలిద్దామని నేను లోతుగా గిల్లితే, అసలు రహస్యమేమిటో చెప్పాడు.
 ‘‘ఆ టీవీలో ప్రకటన చూళ్లేదా? అమ్మాయిల్ని కొందరు ఆకతాయీలు ఏడిపిస్తుంటే ఎలక్ట్రీషియన్ బనీన్‌తో ఎగిరి దూకుతాడు.  ఆ ఎలక్ట్రీషియన్ను సదరు అమ్మాయిలు మోహిస్తారు. ఇంకోటి చెప్పనా? ఫలానా సెంటు వాడితే అమ్మాయిలు వెంటపడతారని చూపిన ప్రకటన చూసి అది వాడా. నిజంగానే వెంటపడ్డారు కొట్టడానికి! అందుకే సెంటు వర్కవుటు కాలేదని బనీను మీద పడ్డా. మన ఫిట్నెస్‌కు విట్నెస్‌గా ఇది నిల్చి ఎప్పటికైనా ఓ అమ్మాయి లవర్‌గా దొరుకుతుందేమోరా’’ అంటూ తన ఆశను బయటికి చెప్పాడు.
 ‘‘మరి చేతిలో ఆ కటింగ్ ప్లేయర్ ఏమిట్రా?’’ అంటే, ‘‘అమ్మాయిలకు కటింగ్ ఇవ్వాలంటే ఈమాత్రం ఉండాలి’’ అన్నాడు.
 - యాసీన్

మరిన్ని వార్తలు