జనం కంటిరెప్ప జగన్‌

30 May, 2020 00:38 IST|Sakshi

సందర్భం 

సంక్షేమ పాలనే తన అభిమతంగా, సంస్కరణలే ప్రజాబలంగా సాగుతోన్న వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి ఏడాది పాలన జననీరాజనాలు అందుకుంటోంది. 2019 మే 30న నవ్యాంధ్రప్రదేశ్‌కు యువ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం రోజు వృద్ధాప్య పింఛన్లు పెంచుతూ ఆయన తొలి సంతకం చేశారు. నాటి నుంచి నేటి ఇంగ్లిష్‌ మీడియం విద్య ప్రవేశపెడుతూ తీసుకొచ్చిన చట్టాల వరకు ఆయన ఆలోచనా విధానాన్ని పరిశీలిస్తే గొప్ప సంస్కర్తగా సాక్షాత్కరిస్తారు. తెలుగు ముఖ్యమంత్రులందరి కంటే ఆయన గొప్ప సామాజిక  చైతన్యానికి నాంది పలికిన సీఎంగా తారసపడతారు. అన్ని వర్గాల ప్రజానీకం అభ్యున్నతికి వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి శ్రేయోపాలకునిగా ముద్రవేసుకున్నారు. చేతివృత్తులవారికి, కులవృత్తులవారికి, రైతులకు, రైతు కూలీలకు, చిరువ్యాపారులకు, వృద్ధులకు, యువజనులకు, మహి ళలకు, దివ్యాంగులకు, పరిశ్రమలకు, పారిశ్రామికవేత్తలకు ఒక్కరికి కాదు. అన్ని సామాజిక, ఆర్ధిక శ్రేణులకు చెందిన ప్రజానీకాన్ని అక్కునచేర్చుకుని రాష్ట్రాన్ని మునుముందుకు నడిపిస్తున్నారు. 

తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి రైతు సంక్షేమపాలన కంటే రెట్టింపు ఉత్సాహాన్ని ఆయన మదినిండా నింపుకున్నారు. అందుకే ఆయన ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ పథకాన్ని  తీసుకొచ్చి రైతుల్లో నూత నోత్సాహాన్ని కలిగించారు. వ్యవసాయం చేయడమే దండగగా భావించిన రైతులు ప్రభుత్వం కల్పించిన రాయితీలను, సహకారాన్ని చూసి మళ్ళీ పొలాల్లో అడుగుపెట్టి వ్యవసాయ క్షేత్రాల్ని తీర్చిదిద్దారు. మరో హరితవిప్లవానికి ఆంధ్రప్రదేశ్‌ను సంసిద్ధం చేస్తున్న ఘనత జగన్‌దేనని రైతులు సగర్వంగా చాటుతున్నారు. ‘వైఎస్సార్‌ ఆసరా’ మహిళా పొదుపు సంఘాల్లో గతం కంటే విశ్వాసపూరితమైన పరపతి పెంచింది. ఎక్కువ పర్యాయాలు రుణాలు, సున్నావడ్డీ రుణాలు నిరాటంకంగా ఆర్ధిక స్వావలంభన వైపు అడుగులు వేయిస్తుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ‘అమ్మఒడి’ పథకం ఆంధ్ర ప్రదేశ్‌లో అక్షరాస్యతా ఉద్యమానికి నాందిపలికిందని చెప్పవచ్చు. ‘ప్రతి పేదవాడికి ఇల్లు’ పథకం ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న విషయం. పేదలకు ఇంటి స్థలం మంజూరు చేసి ఆపై ఇల్లు నిర్మించుకోవడానికి తగిన రాయితీతో కూడిన రుణ సదుపాయం, మరికొంత మందికి ఉచిత ఇల్లు నిర్మాణం చేయడం వంటి నిర్ణయాలు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులు.
 
దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మానస పుత్రిక ‘ఆరోగ్యశ్రీ’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమైన ప్రభుత్వ పథకంగా పేరొందింది. అటువంటి సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి బతుకు భరోసా ఇచ్చే ‘ఆరోగ్యశ్రీ’ పథకాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తూ శక్తివం తంగా నేటి ప్రభుత్వం అమల్లోకి తీసుకురావడం నిజంగా  ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చేసుకున్న అదృష్టంగా భావించాలి. అలాగే గతంలో దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ని మరిన్ని మెరుగులుదిద్దుతూ ఉన్నతవిద్యలో పూర్తి  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని సంచలనాత్మకంగా జగన్‌ ప్రభుత్వం కార్యాచరణకు నిర్ణయం తీసుకుంది. అపర భగీరథునిగా రాజశేఖరరెడ్డి తలపెట్టిన అనేక నీటి ప్రాజెక్టు నిర్మాణాలను పూర్తిచేయడానికి జగన్‌ అవిశ్రాంతమైన కృషి చేస్తున్నారు. కేంద్రం నుంచి నిధులు సాధించి అపురూపమైన విధులు నిర్వహిసున్నారు.

పోలవరం ప్రాజెక్టు చుట్టూ అలుముకున్న అనేక అడ్డంకులను అధిగమించి సక్రమంగా నిర్మాణం జరగడానికి తగిన పరిస్థితుల్ని ఏర్పర్చడం ఆయన పాలనాప్రతిభను వెల్లడించే విషయమే. ఇక ఎన్నో కుటుంబాలను వీధిన పడేస్తున్న మద్యపాన వ్యసనం మీద చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌రెడ్డి నిలుస్తారు. రాష్ట్ర ప్రజలను కాపాడే విధంగా అంచలంచెలుగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇస్తూ ఎన్నికలకు వెళ్లడం సాహసోపేత నిర్ణయం. అధికారం సాధించిన అనంతరం ఆ మాటకు కట్టుబడి రాష్ట్రంలో మొదటిసారిగా బెల్ట్‌షాపులు మూయించారు. రాష్ట్ర ఖజానాకు చేరే ఆదాయాన్ని సైతం లెక్కచేయకుండా  ప్రజారోగ్యాన్ని కాపాడటమే పరమావధిగా చిత్తశుద్ధితో మద్యనిషేధాన్ని అమలు దిశగా పయనించడం ప్రజల ఆరోగ్యం పట్ల ఆయన బాధ్యతను గుర్తు చేస్తుంది. ఏ ప్రమాదం సంభవించినా ప్రభుత్వం వైపునుంచి ఎంత సహాయం చేయొచ్చో అంత సహాయాన్ని అందిస్తున్నారు. ప్రత్యక్షంగా సందర్శించి ఎల్జీ పాలీమర్స్‌ స్టై్టరిన్‌ గ్యాస్‌లీక్‌ ఘటనలో చనిపోయిన బాధితులకు రూ. కోటి, మిగతా సహాయక చర్యలకు ఆయన ప్రకటించిన నష్టపరిహారాలు గతంలో ఎన్నడూ జరగలేదు. ఇంగ్లీషు మీడియం విద్య విషయంలో ఎన్ని న్యాయపరమైన అడ్డంకులు ఎదురైనా తొణకలేదు, బెణకలేదు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకొని ప్రజాతీర్పుకు పట్టంకట్టారు. ఆ ప్రజాతీర్పును కోర్టులు గౌరవించేదిశగా ఆంగ్లమాధ్యమ విద్యను అమల్లోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. నేడు కరోనా మహమ్మారి అలుముకున్న సమయంలో కూడా ఆయన వీరోచితమైన పటిమ ప్రదర్శించారు. ఆంధ్ర ప్రజానీకానికి కష్టాలు ఎదురు కాకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ‘నేనున్నాను’ అనే వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి శక్తివంతమైన నినాదం ప్రజాహృదయాల్లో ఎన్నటికీ పదిలమే. 

వ్యాసకర్త : డాక్టర్‌ జీకేడీ ప్రసాద్‌,
ఫ్యాకల్టీ, జర్నలిజం అండ్‌మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం, ఏయూ,విశాఖపట్నం
93931 11740 

మరిన్ని వార్తలు