సిరా చుక్కలో ఉషోదయం

12 Oct, 2017 02:22 IST|Sakshi

కొత్త కోణం
గౌరీ లంకేశ్‌ జీవితం, ఆలోచన, ఆచరణ ఒక విశాల ప్రజాస్వామ్య తాత్వికతకు అద్దం పడుతున్నాయి. ఏదో ఒక సిద్ధాంత చట్రంలో ఒదిగిపోయే తత్వం కాదు ఆమెది. ఆమె గత ముప్ఫై ఏళ్లుగా సాగించిన రచనలతో హిందుత్వ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అనేక సామాజిక సమస్యలపై విరుచుకుపడ్డారామె. హిందుత్వ వ్యతిరేక పోరాటం ఆమె ఎజెండానే. ఆమె హత్యకు ఇదే కారణం. వందల సంవత్సరాలుగా కులతత్వ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములైన ఎన్నో వందల మంది ప్రాణత్యాగం చేయాల్సి వచ్చింది కూడా అందుకే.

‘మతవాదాన్ని రెచ్చగొట్టడమో, ప్రచారం చేయడమో నా ఉద్దేశం కాదు. ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా చాలామంది ఐక్యమవుతున్నారని మాత్రమే చెప్పదలచుకున్నాను. అబద్ధపు వార్తలను అసత్యాలుగానే బట్టబయలు చేస్తున్నందుకు అందరికీ సెల్యూట్‌ చేస్తున్నాను. ఇంకా చాలామంది ఇటువంటి మంచి ప్రయత్నంలో కలసి వస్తారని ఆశిస్తున్నాను’ అంటూ గౌరీ లంకేశ్‌ తన ‘గౌరీ లంకేశ్‌ పత్రిక’ చివరి సంపాదకీయంలో ప్రజాస్వామ్య, లౌకిక శక్తులకు, జర్నలిస్టులకు ఇచ్చిన సందేశమిది. 54 ఏళ్ల గౌరీ లంకేశ్‌ గత నెల 5వ తేదీన బెంగళూరులోని తన ఇంటి గుమ్మంలోనే హంతకులు జరిపిన కాల్పుల్లో మరణించారు. ఆమె రచనలు ఎక్కువగా కన్నడలోనే ఉన్నాయి. అందుకే బాహ్య ప్రపంచానికి ఆమె రచనలు, తాత్విక దృక్పథాల గురించి తక్కువ తెలుసు. మరణానంతరం కొన్నింటిని ఇంగ్లిష్‌లోనికి అనువదించారు. ఆ చివరి సంపాదకీయం అలా  లభించిందే. ఈ రచనను ప్రత్యేకమైనదిగా భావించాలి. తప్పుడు వార్తలను ప్రచారం చేయడానికి కొన్ని శక్తులు, ప్రధానంగా హిందుత్వవాదులు చేస్తున్న ప్రయత్నాన్ని ఆధారాలతో సహా అందులో బయటపెట్టారు. ఉదాహరణకు గణేశ్‌ చతుర్థి సందర్భంగా ప్రచారమైన ఒక అసత్యపు వార్త – సోషల్‌ మీడియాలో చాలా దుమారాన్ని లేపిన వార్త – గురించి ఆ సంపాదకీయంలో వివరించారు.

‘గణేశ్‌ ఉత్సవాల సందర్భంగా విగ్రహాలను ప్రభుత్వం సూచించిన స్థలంలోనే ప్రతిష్టించాలని, అందుకు పది లక్షల రూపాయలను డిపాజిట్‌ చేయాలని, విగ్రహం ఎత్తుకు సంబంధించి కూడా ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని, ఇతర మతస్తులు నివాసాలున్న చోట నుంచి నిమజ్జనం ఊరేగింపు వెళ్లకూడదని, టపాకాయలు కాల్చకూడదని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది’ అన్నదే ఆ వార్త. ఇది నిజం కాదని, కావాలనే ‘మోదీ భక్తులు’ ఈ వార్తను ప్రచారం చేశారని ఆ సంపాదకీయంలో ఆరోపించారు. కర్ణాటక పోలీసు ఉన్నతాధికారి ఆర్‌.కె. దత్తా విలేకరుల సమావేశం నిర్వహించి, ఈ వార్తలో నిజం లేదని తేల్చి చెప్పిన విషయాన్ని కూడా ఆమె వివరించారు. ఈ వార్తతో పాటు, బాబా గుర్మీత్‌ రామ్‌ రహీంతో ప్రధాని మోదీ సహా పలువురు హరియాణా మంత్రులు తీయించుకున్న ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయనీ, వాటిని పక్కదోవ పట్టించడానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ రామ్‌ రహీంతో దిగినట్టు ఉన్న ఫొటోను సోషల్‌ మీడియాలో ఉంచారనీ, నిజానికి అది కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమన్‌ చాందీతో దిగిన ఫొటో అని తెలిసిందని కూడా ఆమె రాశారు. ఇంకొన్ని అంశాలను కూడా ప్రస్తావించారు. ఇది గౌరి సత్యశోధనకు నిదర్శనం. ఇటువంటి అసత్యాలు ఎలాంటి దుష్ప్రభావాన్ని కలుగజేస్తుంటాయో కూడా వివరించారు.

కాదనుకుంటూనే తండ్రి వారసత్వం
జర్నలిజం వ్యాసంగంలో ప్రవేశించాలని అనుకోలేదని ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. వైద్యవృత్తిని చేపట్టాలని భావించానని, సాధ్యం కాక జర్నలిజం చదివానని చెప్పారు. తన తండ్రి పి. లంకేశ్‌ నడుపుతున్న పత్రికలో పనిచేయడం కష్టమని భావించానని, అలాగే ఆయన సాహసాన్ని అందుకోలేనని భావించినందువల్లే టైమ్స్‌ ఆఫ్‌ ఇండియాలో మొదట చేరానని తెలిపారు. తండ్రి మరణం తర్వాత కూడా ఆ పత్రికను నడపాలని ఆమె అనుకోలేదు. కానీ పి. లంకేశ్‌ స్నేహితులు పత్రికను మూసివేయవద్దని గౌరి కుటుంబాన్ని కోరారు. తన తదనంతరం ఏం చేయాలో తండ్రి ఏనాడూ చెప్పకపోయినా, పరిస్థితులను గమనించి పత్రికను కొనసాగించాలని గౌరి కుటుంబం నిర్ణయించుకున్నది. అయితే 2001 సంవత్సరం మొదట్లో గౌరికీ, ఆమె సోదరుడు ఇంద్రజిత్‌కూ పత్రిక విషయంలో విభేదాలు పొడసూపాయి. తన సోదరి మావోయిస్టు రాజకీయాలను పత్రిక మీద రుద్దుతున్నదని ఇంద్రజిత్‌ ఆరోపించారు. ఆ విమర్శకు సమాధానంగా తాను కూడా పత్రికాముఖంగా సోదరుడి వైఖరిని దుయ్యబట్టారు. చివరికి ‘గౌరీ లంకేశ్‌ పత్రిక’ పేరుతో ఆమె వేరే పత్రికను స్థాపించారు.

గౌరి తన పత్రికను విలక్షణంగా నిర్వహించారు. ఏ పత్రిక నడపాలన్న ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. దానికి ప్రభుత్వాల నుంచి, కార్పొరేట్‌ సంస్థల నుంచి వచ్చే ప్రకటనలే ఆధారం. కానీ ఆమె ఈ రెండు రకాల ప్రకటనలను తిరస్కరించారు. ప్రధానంగా చందాదారుల సహాయంతో పాటు, ఇతర రచనల ముద్రణల నుంచి వచ్చిన ఆదాయంతోనే పత్రికను వెలువరించేవారు. ఇదో కొత్త పద్ధతి. ప్రజల కోసం నడిచే పత్రికలు మనగలగడం కష్టమనే అభిప్రాయాన్ని గౌరీ లంకేశ్‌ పూర్వపక్షం చేశారు. మావోయిస్టుగా, హిందూమత వ్యతిరేకిగా, తీవ్రవాద భావాలను ప్రచారం చేస్తున్నదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కానీ ఆమె రచనలను, జీవిత గమనాన్ని, రాజకీయ, సామాజిక సంబంధాలను పరిశీలిస్తే ఒక నిజమైన ప్రజాస్వామ్యవాదిగా, మానవ హక్కుల గొంతుకగా, అసమానతలను నిరసించి, సామాజిక సమత్వాన్ని ప్రబోధించిన ఒక నిండైన శక్తిగా కనిపిస్తారు. కర్ణాటకలో చాలా ఏళ్లుగా పత్రికాస్వేచ్ఛ మీద దాడులు జరుగుతున్న సంగతినీ, మావోయిస్టు నాయకునితో ఇంటర్వ్యూ చేసినందుకు ఒక జర్నలిస్టు మీద కేసు బనాయించడానికి పోలీ సులు చేసిన ప్రయత్నాన్ని తాను అడ్డుకున్న విషయాన్నీ ఆమె ఒక వ్యాసంలో వివరించారు.

లౌకికత్వాన్ని భగ్నం చేయవద్దన్నందుకు...
‘మతం, రాజకీయాలు, నగ్నసత్యం’ అనే పేరుతో ప్రచురితమైన ఒక వ్యాసంలో హరియాణా అసెంబ్లీలో నగ్నంగా దర్శనమిచ్చిన జైన ముని తరుణ్‌సాగర్‌ ఉదంతాన్ని ఉటంకించారు. ‘మన లౌకిక రాజ్యాంగం రాజకీయాల నుంచి మతాన్ని వేరుగా చూడాలని ప్రబోధించింది. కానీ మన దేశ రాజకీయాల్లో మతం ప్రధాన పాత్రను పోషిస్తున్నది’ అంటూ రాజ్యాంగ విలువలను గుర్తు చేశారామె. దేశభక్తి గురించి రాసిన మరొక వ్యాసంలో ‘ఈ రోజు దేశభక్తి గురించి జబ్బలు చరచుకొంటున్న హిందుత్వ శక్తులేవీ దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదు. పైగా వారంతా బ్రిటిష్‌ వారికి సానుభూతిపరులుగా ఉన్నారు’అంటూ చారిత్రక సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఆ రాష్ట్రంలో ఒక్కళిగ సామాజిక వర్గం యువతి, ముస్లిం యువకుడు వివాహం చేసుకున్నప్పుడు వివాదం చెలరేగింది. అప్పుడు ఆమె కుల సమస్యను తూర్పారబట్టారు. ‘కులం అసమానతలను పెంచి పోషిస్తున్నది. ఎన్నో ఉద్యమాలు కొనసాగుతున్నప్పటికీ ఇంకా కుల వ్యవస్థ పునాదులు బలంగానే ఉన్నాయి. వీటిని పట్టి పల్లార్చటమెట్లా’ అని ప్రశ్నిస్తూనే, కుల నిర్మూలన కోసం కులాంతర, మతాంతర వివాహాలు అవసరమని చెప్పే అంబేడ్కర్‌ ఆలోచన దీనికి పరిష్కారమంటూ ఆ వ్యాసాన్ని ముగించారు.

బెంగళూరులో సఫాయి కార్మికులు మ్యాన్‌హోల్‌లో దిగి ప్రాణాలు కోల్పోయినప్పుడు ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తరతరాలుగా అంటరాని కులాలు ఎన్నో అవమానాలకు, అత్యాచారాలకు బలవుతున్నాయనీ, ఇలాంటి చావులు అందులో భాగమేనంటూ సమాజం ప్రదర్శిస్తున్న వివక్షను ఎత్తిచూపారు. బెంగళూరులో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఉదహరిస్తూ, నూతన సంవత్సర వేడుకల సందర్భంగా, వారిపై జరిగిన వేధింపులను నిరసించారు. వీటితో పాటు, ఇటీవల గోరఖ్‌పూర్‌ హాస్పిటల్‌లో జరిగిన పసిపిల్లల మరణాలను బీజేపీ నరమేధంగా అభివర్ణించారు.

హిందువులం కాదన్నందుకు...
తన సామాజిక నేపథ్యాన్ని గౌరి ప్రగతిశీలమైనదిగా ప్రకటించుకున్నారు. గౌరి తండ్రి లింగాయత్‌ సామాజిక వర్గం. వీరు బసవేశ్వరుని అనుచరులు. బసవేశ్వరుడు నడిపిన వీరశైవ ఉద్యమాన్ని క్రమంగా హిందూ మతం మింగేసింది. బసవేశ్వరుడి ఉద్యమం కుల రహిత, కుల నిర్మూలన ఉద్యమంగా ఆమె అభివర్ణించారు. లింగాయత్‌లు హిందువులు కారని, తాము కుల వ్యవస్థకు వ్యతి రేకమని తన సామాజికవర్గం భావించే హిందూత్వ వ్యతిరేకతలోని ప్రత్యేకతను  గౌరి వెల్లడించారు. ఇది హిందుత్వ వాదులను, కుల సమాజ రక్షకులను భయపెట్టింది. అందుకే హిందూ మత వ్యతిరేకిగా, కమ్యూనిస్టుగా, నక్సలైటుగా ముద్ర వేశారు. కానీ ఆమె రచనలు చదివిన వారెవ్వరికైనా ఆమె ఏదో ఒక రాజకీయాలకు పరిమితమైన వ్యక్తికాదని అనిపిస్తుంది. జీవితాన్ని సంపూర్ణంగా ప్రజలను ప్రేమించడానికి, ప్రజాఉద్యమాలకు అండగా నిలబడటానికే ఆమె వెచ్చించింది. పెళ్లి చేసుకున్నా, కొద్దికాలానికే విడాకులు తీసుకున్నారు. ఇటీవలి కాలంలో వెల్లువెత్తిన విద్యార్థి యువజనోద్యమాలను ఆమె హత్తుకున్న తీరు ఆశ్చర్యపరుస్తుంది.

ఢిల్లీ జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ ఉద్యమ నాయకులైన కన్హయ్య కుమార్, గుజరాత్‌ దళిత యువకిశోరం జిగ్నేష్‌ మేవాని, షీలా రషీద్, ఉమర్‌ ఖలీద్‌లను తాను దత్తత తీసుకున్నానని, తాను వారి పెంపుడు తల్లినని ప్రకటించుకుని తన ఉద్యమ వాత్సల్యాన్ని చెప్పకనే చెప్పారు. అయితే ఈ నలుగురి రాజకీయ నేపథ్యం ఒకటి కాదు. ఈ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎక్కడ, ఎవరు ఉద్యమాలు చేసినా అందులో తాను మమేకమైపోవడం ఆమె సొంతం. మావోయిస్టు ముద్ర కూడా ఆమెకు సరైంది కాదు. అలాగని ఆమె మావోయిస్టులకు వ్యతిరేకంగా పని చేయలేదు. విప్లవ రచయిత వరవరరావుతో కలసి ఆమె అధ్యయనం చేశారు. కర్ణాటక – తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌వేలో నిర్వాసితులవుతున్న ప్రజల గురించి వీరిద్దరూ ఒక నివేదిక తయారు చేసినట్టు వరవరరావు చెప్పారు. లొంగిపోయిన నక్సలైట్ల పునరావాసం కోసం ఏర్పాటు చేసిన కమిటీలో గౌరి సభ్యురాలు. ఆమెను మావోయిస్టుగా అభివర్ణించి, ఆ కమిటీ నుంచి తొలగించాలని ఒత్తిడి వచ్చినప్పటికీ ప్రభుత్వం అంగీకరించలేదు.

గౌరీ లంకేశ్‌ జీవితం, ఆలోచన, ఆచరణ ఒక విశాల ప్రజాస్వామ్య తాత్వికతకు అద్దం పడుతున్నాయి. ఏదో ఒక సిద్ధాంత చట్రంలో ఒదిగిపోయే తత్వం కాదు ఆమెది. ఆమె గత ముప్ఫై సంవత్సరాలుగా సాగించిన రచనలతో హిందుత్వ వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు అనేక సామాజిక సమస్యలపై విరుచుకుపడ్డారామె. హిందుత్వ వ్యతిరేక పోరాటం ఆమెకు ప్రధాన ఎజెండానే. ఆమె హత్యకు ఇదే అసలు కారణం. వందల సంవత్సరాలుగా కులతత్వ వ్యతిరేక ఉద్యమంలో భాగస్వాములైన ఎన్నో వందల మంది ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చింది కూడా అందుకే. కానీ అటువంటి త్యాగాలెప్పుడూ ఓడిపోలేదు. పోవు.


మల్లెపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 

మరిన్ని వార్తలు