లాక్‌డౌన్‌ ఒక్కటే రోగనివారిణి కాదు

10 Apr, 2020 00:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

విశ్లేషణ

లాక్‌డౌన్‌లో ఉంటున్నాం కాబట్టి అంతా సజావుగా కుదురుకుంటుందని ఎవరు భావించినా తప్పే. ఎందుకంటే లాక్‌డౌన్‌తో వైరస్‌ నివారణ కాదు. అది కరోనాను అరికట్టలేదు. ప్రజల సమయాన్ని పణంగా పెట్టి స్వీయనిర్బంధంలో ఉంచిన తర్వాత ప్రభుత్వం చేయవలసిన కీలకమైన పని విస్తృత స్థాయి పరీక్షలకు రంగం సిద్ధం చేసుకోవాలి. ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు, మాస్కులు, ఇతర వైద్య సామగ్రిని తక్షణ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలి. వైరస్‌ విస్తరిస్తున్న ప్రారంభ దశలోనే అలా చేసిన కొన్ని దేశాలు వైరస్‌ నుంచి బయటపడ్డాయి. అలా పాటించని సంపన్న దేశాలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా అడుగేయలేదు. మనకు కనిపించని అదృశ్య శత్రువును సెల్‌ఫోన్లు, దీపాలు, క్యాండిల్స్‌తో మాత్రమే ఎదుర్కొంటున్నాం. ఇది ఏమాత్రం సరిపోదని అందరం గ్రహించాలి.

ఏప్రిల్‌ 15వ తేదీ లాక్‌డౌన్‌ ఎత్తివేత గురించి ఆశలు పెరుగుతున్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడు రోజువారీ పనులన్నీ ఇళ్లలోనే చేసుకుంటూ గడుపుతున్నాం. రష్యాలోని కమ్‌చత్కా ప్రాంతంలో, యూఎస్‌లోని అలాస్కా ప్రాంతంలో నివసించే 700 కిలోల బరువుండే అతిపెద్ద ఎలుగుబంట్లు కూడా శీతాకాలం ప్రారంభమైన వెంటనే దాదాపు 7 నెలలపాటు వార్షిక లాక్‌డౌన్‌లోకి వెళతాయి. శీతాకాలంలో ఆహారం దొరకదు కాబట్టి ప్రకృతి అవి నిద్రపోయేలా ఏర్పాటు చేసింది. పైగా శీతాకాలం నిద్రపోవడం వల్ల మన శక్తిని ఆదా చేసుకోవచ్చు కూడా. అదేవిధంగా ప్రపంచం ఇప్పుడు కరోనా వైరస్‌పై పోరులో భాగంగా లాక్‌ డౌన్‌లోకి దాదాపు వెళ్లిపోయింది. ఎందుకంటే కరోనాపై పోరుకు దాక్కోవడం ఒక్కటే మార్గమని ప్రపంచం భావిస్తోంది. అయితే మంచు ఎలుగుబంట్ల లాగా కాకుండా మనం నిద్రమేల్కొని ఆందోళన పడుతుంటాం. ఎలుగుబంట్లు మాత్రం 7 నెలలు సంతోషంగా నిద్రపోతాయి. మానవ సహజాతం మనుగడ కోసమే ఉంటుంది. ప్రమాదం ఉందని ప్రజలు భావించినప్పుడు తమను కాపాడే ఏపని చేయడాని కైనా వారు సిద్ధపడతారు. టీవీ, మీడియా పుణ్యమా అని కరోనా వైరస్‌ ప్రమాదం గురించి చాలా వివరాలు తెలిసిపోయాయి కాబట్టి ప్రజలు లాక్‌డౌన్‌ ప్రకటించగానే ఆమోదం తెలిపారు. ఇక మనుషుల కంటే కార్లు ఎక్కువగా కనిపించే కాలిఫోర్నియాలో ఇప్పుడు రోడ్లమీద కార్లు అసలు కనిపించడం లేదు. ఇదే మనిషికి మనుగడ పట్ల ఉండే సహజాతం. తన మనుగడ కోసం ఏమైనా చేస్తారు. 

అయితే లాక్‌డౌన్‌ అనేది కరోనాకు చికిత్స కాదు. లాక్‌డౌన్‌ తాత్కాలికమేనని, ఏప్రిల్‌ 15 తర్వాత అంతా సాధారణంగా అయిపోతుందని భావిస్తున్నారు. అలాగే లాక్‌డౌన్‌ ద్వారా భారతదేశం కరోనాపై విజయం సాధించేసిందని అందరిలో ఒక తెలీని ఆశాభావం ఒకటి ఏర్పడిపోయింది. అయితే ఈ రెండు ఊహలు కాల పరీక్షకు నిలబడాల్సిందే. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తర్వాత, పరీక్షలు మొదలైన తర్వాత దేశంలో కరోనా వైరస్‌ ఎంత విస్తారంగా ఉంటోంది, దాని ప్రభావం ఎలా ఉంది అని తెలుస్తుంది. ఇంతవరకైతే దేశంలో కరోనా వైరస్‌ బారిన పడ్డవారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటోంది. దానికి కారణం పెద్దగా పరీక్షలు జరగలేదు. ఒకవేళ విస్తృతంగా పరీక్షలు జరిగితే, అప్పుడు మాత్రమే భారతదేశంలో కరోనావైరస్‌ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనేది మనం తెలుసుకోగలుగుతాం. 

దేశం ముందున్న ప్రధాన ప్రశ్న ఏమిటంటే, మన ప్రభుత్వం కరోనా వైరస్‌ను ఎలా ఎదుర్కొంటోందన్నదే. కరోనా వైరస్‌ గురించి 2019 డిసెంబర్‌లో ప్రపంచానికి తెలిసివచ్చింది. తర్వాత ప్రపంచం ఒక సాంక్రమిక వ్యాధిని ఎదుర్కోనుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 జనవరి 30 న ప్రకటించింది. ఇది తీవ్రస్థాయిలో ఉండే వ్యాధి పట్ల చేసిన హెచ్చరిక. అయితే ఆ వైరస్‌ ఆనాటికి చైనాకే పరిమితమై ఉండేది. ప్రతి ప్రభుత్వమూ దానితో సమర్థంగా వ్యవహరించేందుకు తగిన అవకాశం ఉండేది. తర్వాత ఇతర దేశాలకు విస్తరించినప్పుడు జర్మనీ, దక్షిణ కొరియాల గురించి అప్పట్లో న్యూయార్క్‌ టైమ్స్‌ ఒక అంశాన్ని ప్రచురించింది. ఆ పత్రిక ప్రకారం..‘జర్మనీలో 95 వేలమందికి కరోనా వైరస్‌ సోకింది. కానీ అక్కడ 1300 మంది మాత్రమే చనిపోయారు. అంటే వైరస్‌ సోకినవారిలో 1.4 శాతమంది మాత్రమే చనిపోయారు. ఇక దక్షిణ కొరియాలో మొత్తం రోగులలో 1.7 శాతం మరణాలు సంభవించాయి. ఏ దేశంలో కంటే కూడా ఎక్కువగా జర్మనీ వైరస్‌ పరీక్షలు నిర్వహించింది. అయినా అక్కడ తక్కువ మరణాలు సంభవించాయని గ్రహించాలి’.

ఇక వైరస్‌ పట్ల సమర్థంగా వ్యవహరించిన సంపన్న దేశాలు సింగపూర్, హాంకాంగ్, తైవాన్‌. ఈ మూడు దేశాలు చైనాకు సమీపంలో ఉన్నప్పటికీ, చైనాతో సంబంధాలు విస్తృతంగా ఉన్నప్పటికీ, ఈ దేశాలు కరోనా వ్యాప్తిని అరికట్టాయి. వైరస్‌ అడుగుపెట్టిన తక్షణం వారు విస్తృతంగా పరీక్షలు నిర్వహించారు. రోగులను గుర్తించి వారిని వేరుపర్చారు. భారీ స్థాయిలో వైద్యపరంగా రక్షణనిచ్చే దుస్తులను నిల్వ చేసుకున్నాయి కూడా.చఅదేసమయంలో అమెరికా, ఇంగ్లండ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీలు అత్యంత సంపన్న దేశాలు. కానీ ఇవి ఆలస్యంగా మేల్కొనడమే కాకుండా తప్పుల మీద తప్పులు చేస్తూ పోవడంతో కరోనావైరస్‌తో పోరాటంలో ఘోరంగా దెబ్బతిన్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అయితే 15 రోజుల క్రితం కూడా కరోనా వైరస్‌నుంచి పెద్దగా ప్రమాదం లేదని, దానిపై చర్య తీసుకోబోనని చెప్పేశారు. ఇంగ్లండ్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మరీ ఘోరంగా మాట్లాడారు. ఇంగ్లండ్‌లో కొన్ని లక్షల మంది చనిపోయాక, సహజసిద్ధమైన రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కానీ సాక్షాత్తూ బ్రిటిష్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఇప్పుడు కరోనావైరస్‌ సోకి ఆసుపత్రిలో చేరారు. అలాగే ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌ వైరస్‌కు సంబంధించి ఎలాంటి ముందస్తు చర్యా తీసుకోలేదు. ఫ్రాన్స్, అమెరికా, స్పెయిన్, ఇటలీ, ఇంగ్లండ్‌ దేశాల్లో ఇప్పుడు రోజూ వందలాదిమంది చనిపోతున్నారు. ఈ దేశాల వద్ద డబ్బు ఉంది. కానీ వాటి నాయకత్వం విఫలమైంది.

కరోనా వైరస్‌ విషయంలో సమర్థంగా వ్యవహరించిన, విఫలమైన సంపన్నదేశాలకు మధ్య తేడా ఏమిటంటే పరీక్షలు నిర్వహించడం, ప్రారంభంలోనే పరీక్షించడమే. కరోనా వైరస్‌పై విస్తృ తంగా పరీక్షలు నిర్వహించిన దేశాలు వ్యాధిని అదుపుచేశాయి. అలా పరీక్షలు నిర్వహించని దేశాలు దారుణంగా దెబ్బతిన్నాయి. ఉదాహరణకు భారీస్థాయి పరీక్షల ద్వారా జర్మనీ, దక్షిణ కొరియా ఉత్తమంగా వ్యవహరించాయి. అయితే అలా విస్తృత స్థాయి పరీక్షలను ప్రోత్సహిం చని భారతీయ వైద్య పరిశోధనా మండలిని భారత్‌ అనుసరించింది. కాబట్టే జర్మనీ, కొరియాలు కోటిమంది జనాభాకు లక్షమందికి పరీ క్షలు నిర్వహించగా భారత్‌లో కోటిమందికి గాను 450 మందికి మాత్రమే పరీక్షలు నిర్వహించారు. కానీ తనకులాగే అమెరికా, ఇంగ్లండ్‌ కూడా పెద్దగా పరీక్షలు జరపలేదని భారత్‌ చెప్పవచ్చు. అందుకే వేలాదిమంది అమెరికన్లు, ఇంగ్లిష్‌ ప్రజలు ఇప్పుడు శ్మశానాల్లో చోటుకోసం వెతుక్కుంటున్నారు. తాము చేసిన తప్పులను దాచిపెట్టేందుకు అమెరికా, ఇంగ్లండ్‌ ఇప్పుడు కరోనాపై పోరుకోసం ట్రిలియన్ల కొద్దీ డాలర్లను మదుపు చేస్తున్నాయి.

భారత్‌ ఇప్పటికీ వైద్యరంగంలో అలాంటి భారీ మదుపులకు పూనుకోలేదు. సింగపూర్‌ కూడా ఈరోజు ఒక నెలపాటు లాక్‌డౌన్‌ ప్రకటిం చింది కానీ ప్రజలకు అయిదురోజుల ముందే లాక్‌డౌన్‌ గురించి తెలి పింది. కానీ భారత్‌ మాత్రం రెండుగంటల ముందు మాత్రమే దేశప్రజలకు లాక్‌ డౌన్‌ విధిస్తున్నట్లు తెలిపింది. అయితే లాక్‌డౌన్‌లో ఉన్న అత్యంత ప్రధాన వాస్తవం ఏదంటే, అది వ్యాధి విస్తరణను మందగిం పజేస్తుంది. పరీక్షలు నిర్వహించడం, ఆసుపత్రులను సిద్ధం చేయడం, వైద్యసిబ్బందిని సమాయత్తం చేయడం వంటి ఇతర పనులు పూర్తి చేసుకోవడానికి లాక్‌డౌన్‌ని ఉపయోగించుకోవాలి. కానీ భారత్‌ ఆ పని మాత్రం చేయడం లేదు. భారత్‌కు వ్యవహారాలు చక్కబెట్టడానికి దాదాపు 3 నెలల సమయం ఉండింది. కానీ లాక్‌డౌన్‌ ప్రకటించేవరకు అది చేసిందేమీ లేదు. లాక్‌డౌన్‌ తనకు తానుగా రోగాన్ని నివారించదు. కానీ సామాన్య ప్రజలను పణంగా పెట్టి తగినంత సమయాన్ని అది వ్యవస్థకు ఇవ్వగలుగుతుంది. అందుకే ప్రజలు లాక్‌డౌన్‌ ప్రయోజనాల గురించి గందరగోళపడకూడదు.

భారత్‌ ముందస్తుగా నోటీసు ఇచ్చి 75 రోజుల పాటు లాక్‌డౌన్‌ ప్రకటించి కరోనా వైరస్‌ని నిరోధించే ప్రయత్నాలు చేయవలసి ఉండె. పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం, టెస్టింగ్‌ కిట్ల కొనుగోలు, ఆసుపత్రుల్లో ఐసీయూ పడకలు పెంచడం వంటివి సిద్ధం చేసుకోవల్సి ఉండే. కానీ ప్రభుత్వం ఇవేవీ చేయలేదు. భారత్‌ ఇప్పటికే 50వేల వెంటిలేటర్లకు ఆర్డర్‌ ఇచ్చింది. కానీ 6 నుంచి 9 నెలలలోపే అవి అందుబాటులోకి వస్తాయి. ఏప్రిల్‌ 6 నాటి తన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ దేశం దీర్ఘకాలంపాటు యుద్ధం చేయాల్సి ఉందని చెప్పారు. నేను దీన్ని వ్యతిరేకిస్తున్నాను. యుద్ధం దీర్ఘకాలంపాటు సాగుతుంది కానీ అది ఇంకా మొదలుకాలేదు. వైరస్‌లపై సమకాలీన చరిత్రలోనే అతి గొప్ప నిపుణుడు డాక్టర్‌ ఆంథోనీ ఫాసీ కొన్నిరోజుల క్రితం చెప్పారు. వైరస్‌కు తనదైన కాలవ్యవధి ఉంటుంది. తానెప్పుడు వెళ్లిపోవాలో అది నిర్ణయించుకుంటుంది అన్నారాయన. వైరస్‌పై విజయం సాధించగలమా అనేది మోదీజీకే తెలీదు. ప్రస్తుతానికైతే చేతులు లేని అదృశ్య శత్రువుకోసం మనందరం వేచి ఉంటున్నాం. అయితే సెల్‌ఫోన్లు, దీపాలు, క్యాండిల్స్‌తో మాత్రమే దాన్ని ఎదుర్కొంటున్నాం.

పెంటపాటి పుల్లారావు
వ్యాసకర్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు