డిగ్రీ ప్రవేశాలకు ఆధార్ తప్పనిసరి

20 May, 2016 02:04 IST|Sakshi

ఉస్మానియా వర్సిటీ రిజిస్ట్రార్ స్పష్టీకరణ
నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ
 
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వివిధ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ విద్యా సంవత్సరం నుంచి ఆధార్ నంబర్ తప్పనిసరి అని వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సురేశ్‌కుమార్ తెలిపారు. ఓయూ పరిధిలోని ప్రభుత్వ, అటానమస్, ప్రైవేట్, యూనివర్సిటీ అనుబంధ, ఎయిడెడ్ బాలుర, బాలికల డిగ్రీ కళాశాలల్లో 2016-17 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం(జనరల్/కంప్యూటర్స్), బీఎస్సీ, బీబీఏ, బీసీఏ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి నేటి నుంచి జూన్ 6 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరించనునట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో జూన్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
 
 ఓయూతో పాటు కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు విశ్వవిద్యాలయాలకు సైతం డిగ్రీలో ప్రవేశాలకు http:// dost.cgg.gov. in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అయితే ఏ వర్సిటీలో దరఖాస్తు చేసుకున్నా ఆ వర్సిటీ పరిధిలోనే చదవాల్సి ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.100 మాత్రమే చెల్లించాలన్నారు. అయితే ఓయూ పరిధిలో కేవలం జంట నగరాల్లో కొనసాగుతున్న బీకాం ఆనర్స్ కోర్సులో ప్రవేశాలకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించి కౌన్సెలింగ్ ద్వారా అడ్మిషన్లు చేపట్టనున్నట్లు తెలిపారు. బీకాం ఆనర్స్ ప్రవేశ పరీక్షను ఓయూ కామర్స్ విభాగం ఆధ్వర్యంలో 21న నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు ఉస్మానియా వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

మరిన్ని వార్తలు