చంద్రబాబూ.. ఎందుకంత అభద్రత?

15 May, 2017 01:21 IST|Sakshi
చంద్రబాబూ.. ఎందుకంత అభద్రత?

- ధ్వజమెత్తిన వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స
- ప్రధానిని ప్రతిపక్షనేత కలిస్తే నీకేంటి సమస్య?


సాక్షి, హైదరాబాద్‌: ప్రధాని నరేంద్ర మోదీని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలిస్తే ఏపీ సీఎం చంద్రబాబు ఎందుకంత అభద్రతా భావానికి లోనవుతున్నారని, వీరిద్దరి భేటీ వల్ల అసలు ఆయనకు వచ్చిన సమస్య ఏమిటని పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ప్రధానిని జగన్‌ కలుసుకోవడం పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఆయన ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడారు. జగన్‌ ప్రధానిని కలుసుకున్నందువల్ల తన అవినీతి, దోపిడీ ఎక్కడ బయటపడతాయోనన్న భయం సీఎంకు పట్టుకుందని, ఆ విషయం ఆయన మాటల్లోని బేలతనం ద్వారా తేటతెల్లమవుతోందని చెప్పారు.

గోప్యత లేనేలేదు...
మోదీని జగన్‌ కలవడంలో గోప్యత ఏ మాత్రం లేనేలేదని అంతా బహిరంగమే అయినప్పటికీ ‘ఉదయం 11 గంటల వరకూ గోప్యంగా ఎందుకు ఉంచారు?’ అని చంద్రబాబు ప్రశ్నించడం  అర్థం లేనిదని బొత్స చెప్పారు. ప్రజా సమస్యలను చంద్రబాబు పూర్తిగా విస్మరించడంతో ఆ బాధ్యతను ప్రతిపక్షనేత జగన్‌ తన భుజాలకు ఎత్తుకుని ప్రధానికి తెలియ జేశారన్నారు. ఇప్పటివరకూ 15 దేశాల్లో పర్యటించిన చంద్రబాబు రాష్ట్రానికి తెచ్చిన పెట్టుబడులెన్నో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్‌ చేయడంపై స్పందిస్తూ... టీడీపీలో ఉన్న ఓ కేంద్రమంత్రి, లోక్‌సభ సభ్యుడు, రాష్ట్రమంత్రి, ఇలా ఆరుగురిపై ఆరోపణలు వచ్చాయని ఈ విధానం వారికీ వర్తింపచేయాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు