ముఖ్యమంత్రిగారూ.. ‘హోదా’లాభాలివిగో!

12 Sep, 2016 02:30 IST|Sakshi
ముఖ్యమంత్రిగారూ.. ‘హోదా’లాభాలివిగో!

పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి

 

 సాక్షి, హైదరాబాద్: ‘ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా విషయంలో తరచుగా మాట మారుస్తూ చివరకు ఇపుడు హోదావల్ల లాభాలేమిటో చెప్పండి.. నన్ను ఎడ్యుకేట్ చేయండి అంటున్నారు. హోదాతో అనేక లాభాలున్నాయి. కేంద్రం ఇపుడు ప్రత్యేకహోదా ఇవ్వలేదు. ప్రత్యేక ప్యాకేజీ కూడా లేదు. అందరూ గొప్పగా చెబుతున్నవన్నీ విభజన చట్టంలో ఉన్నవే. కొత్తగా రాష్ట్రానికి వచ్చిందేదీ లేదు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేకహోదా వల్ల రాష్ట్రానికి వచ్చే లాభాల గురించి వివరించారు...
 

► కేంద్రానికి ఆదాయపు పన్ను, సెంట్రల్ ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్, కస్టమ్స్ సుంకాల ద్వారా ఆదాయంలో సుమారు 60 నుంచి 62శాతం ఆదాయాన్ని రాష్ట్రాలకు నిధులుగా ఇస్తుంది. అవి కాక గ్రాంట్లు, రుణాలు కూడా విడిగా వస్తాయి.
► మామూలు రాష్ట్రాలన్నిటికీ కలిపి 70శాతం ఉంటే ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు 30శాతం అందుతుంది. జనాభా శాతాన్ని బట్టి చూస్తే 6 లేదా 7శాతం జనాభా ఉండే ప్రత్యేక హోదా రాష్ట్రాలకు 30శాతం సహాయం వస్తుందన్నమాట.

► ఇది కాక ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చే సహాయంలో 90శాతం గ్రాంటు రూపంలోనూ, 10శాతం అప్పుగానూ ఉంటుంది. మామూలు రాష్ట్రాలకు 30శాతం గ్రాంటు రూపంలో, 70శాతం అప్పురూపంలో ఉంటుంది.
► పరిశ్రమలు పెడితే  కేంద్ర ఎక్సైజ్ పన్ను పూర్తి మినహాయింపు ఉంటుంది. ఆ మినహాయింపు కూడా సెన్‌వ్యాట్ ఇన్‌పుట్ క్రెడిట్‌గా పరిశ్రమ తీసుకోవచ్చు. అంటే ఒక పరిశ్రమలో రూ 100 విలువైన ఉత్పత్తి చేస్తే రూ 12లు కేంద్ర ఎక్సైజ్ పన్ను కట్టక పోగా అమ్మేటపుడు ఆ రూ.12లు కూడా ఇన్‌పుట్ క్రెడిట్‌గా తీసుకోవచ్చు. దీనివల్ల వస్తువుల ధరల్లో ఎంతో తేడా వస్తుంది.
► వంద శాతం ఆదాయపుపన్ను కట్టనవసరం లేదు. అంతేకాకుండా కొన్నేళ్ల తర్వాత ఆదాయపు పన్నులో రిబేటు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇంకా పెట్టుబడిపై కేంద్రం 30 శాతం సబ్సిడీ ఇస్తుంది. 

► బీమా ప్రీమియం మొత్తం వెనక్కి వస్తుంది. ఉదాహరణకు రూ 100 కోట్ల పరిశ్రమ ఏడాదికి కోటి రూపాయల బీమా చేస్తే ఆ ప్రీమియం మొత్తం వెనక్కి ఇస్తారు.

► పరిశ్రమలకు రవాణా సబ్సిడీ లభిస్తుంది. ముడి సరుకుని తీసుకు వెళ్లేందుకు, తయారైన వస్తువులను పంపేందుకు అయ్యే రవాణా ఖర్చులను కూడా కేంద్రమే చెల్లిస్తుంది.

► చంద్రబాబు ప్రత్యేక హోదా వల్ల ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయని అంటున్నారు. ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబుకు ఈశాన్య రాష్ట్రాల్లో ఎంత దుర్భరమైన వాతావరణం ఉంటుందో తెలియదా? ప్రత్యేక హోదా ఇవ్వక పోతే అసలు అక్కడి ప్రజలు మనుగడ సాగించగలరా? హోదా ఉంది కాబట్టే వాళ్లు ఆ మేరకైనా బతకగలుగుతున్నారని చంద్రబాబు అర్ధంకాదా?  
 

 కాంట్రాక్టుల కోసమే పోలవరం ప్యాకేజీ..

 పోలవరం కోసం ప్రత్యేక హోదాను పూడ్చి పెట్టేశారు. బీజేపీ మేనిఫెస్టోలో బహుళార్థ సాధక పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. ఈరోజు ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటనలో కేవలం సాగునీటి ప్రాజెక్టుకు మాత్రమే కేంద్రం సాయం చేస్తుందన్నారు. బహుళార్థసాధక ప్రాజెక్టు అంటే అందులో 960 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు కూడా ఇమిడి ఉంది. అయితే ఆ భారం తగ్గించుకునేందుకు సాగునీటి ప్రాజెక్టు అని జైట్లీ తెరమీదకు తెచ్చారు. అలా చేస్తున్నా చంద్రబాబు ఎందుకు తలొగ్గుతున్నారని ప్రశ్నిస్తున్నాం. చట్ట ప్రకారం కేంద్రం చూడాల్సిన పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ర్టప్రభుత్వం ఎందుకు అడుగుతున్నదంటే.. కాంట్రాక్టులు, కమీషన్ల కోసమేనని అందరికీ అర్ధమౌతోంది.’’అని బుగ్గన వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు