వర్తకం కోసమే భూములు కొనాలి

16 Nov, 2016 04:12 IST|Sakshi
వర్తకం కోసమే భూములు కొనాలి

- ప్రజావసరాల కోసం భూములు కొనరాదు  
- జీవో 123పై హైకోర్టులో వాదనలు
- విచారణ నేటికి వారుుదా
 
 సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంలోని అధికరణ 298 కింద ప్రభుత్వం వర్తక, వాణిజ్యావసరాల కోసమే భూములు కొనుగోలు చేయాలి తప్ప ప్రజాప్రయోజనాల నిమిత్తం సేకరించాల్సిన భూములను కొనుగోలు చేయడానికి వీల్లేదని సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ తెలిపారు. పార్లమెంటు చట్టం అమల్లో ఉండగా కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా చట్టాన్ని మీరి వ్యవహరించడానికి వీల్లేదన్నారు. మల్లన్నసాగర్‌తో పాటు ఇతర సాగునీటి ప్రాజెక్టుల కోసం అవసరమైన భూములను 2013 భూ సేకరణ చట్టం కింద కాకుండా జీవో 123 ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తుండటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పెద్ద ఎత్తున పిటిషన్లు దాఖలవడం తెలిసిందే.

వీటిపై ఇప్పటికే పలుమార్లు విచారణ చేపట్టిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, సత్యప్రసాద్ వాదనలు వినిపించారు. ‘‘కేంద్ర చట్టాన్ని అమలు చేస్తే బాధితులకు ఎక్కువ పరిహారం చెల్లించాల్సి ఉంటుందనే ప్రభుత్వం జీవో 123ను తెరపైకి తెచ్చింది. పైగా భూములను ఇష్టానుసారం తీసుకుంటోంది. నిబంధనలను ఎక్కడా పాటించడం లేదు’’ అన్నారు. 2013 భూ సేకరణ చట్టంలోని షెడ్యూల్ 3 కేవలం సాగునీటి ప్రాజెక్టులకు మాత్రమే వర్తిస్తుందా అని ధర్మాసనం ప్రశ్నించింది.

కాదని, నిర్వాసితులున్న ప్రతి ప్రాజెక్టుకూ వర్తిస్తుందని అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి చెప్పారు. పునరావాసం కింద నిర్మాణాలు చేపట్టి ఇచ్చినా వాటిని వాడుకోవడానికి బాధితులు ఇష్టపడడం లేదన్నారు. పునరావాసానికి డబ్బులిచ్చేందుకు సైతం సిద్ధంగా ఉన్నామని ఏజీ చెప్పారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాసితులకు ఇప్పటికీ పునరావాసం కల్పించలేదని సత్యప్రసాద్ అన్నారు. వాదనలు బుధవారమూ కొనసాగుతారుు.
 
 జీవో 190, 191 ప్రకారం ప్రయోజనాలు...
 భూమి లేని వ్యవసాయ కూలీలు, ఇతరులకు జీవో 190, 191 ప్రకారం ప్రయోజనాలు కల్పిస్తామని ఉమ్మడి హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. జీవో 123 ద్వారా చేపట్టే భూ సేకరణ వల్ల ప్రభావితమయ్యే కూలీలు తదితరుల కోసం 190, 191 జీవోల ద్వారా సంక్షేమ చర్యలు తీసుకుంటామంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. భూములమ్మేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వారి నుంచి కొనుగోలు చేసేందుకే జీవో 123 జారీ చేశామని వివరించారు. నిర్వాసితుల కుటుంబానికి ఎకరాకు రూ.5.04 లక్షలు చెల్లిస్తామన్నారు. ఈ జీవోల కింద ఇచ్చే ప్రయోజనాలకు అంగీకరించని బాధితులకు 2013 భూ సేకరణ చట్టం కింద ప్రయోజనాలను వర్తింపజేస్తామన్నారు.

మరిన్ని వార్తలు