పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

15 Dec, 2015 23:55 IST|Sakshi
పేదలందరికీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు

నిరంతర విద్యుత్, మంచినీటి సరఫరా   పాతబస్తీకి మహర్దశ
ఆర్టీఏ భవన ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్    

 
సిటీబ్యూరో: ఇళ్లులేని నిరుపేదలందరికీ రానున్న మూడు, నాలుగేళ్లలో డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు కట్టించి ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ అంతటా దశలవారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు  పేర్కొన్నారు. అలాగే నిరంతర విద్యుత్ సరఫరా, ప్రతి ఇంటికీ మంచినీటి వసతి కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. చంద్రాయణగుట్టలో రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్టీఏ దక్షిణమండలం నూతన భవనం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా  హాజరయ్యారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్  ఓవైసీ  ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, డిఫ్యూటీ సీఎం మహమూద్ అలీ, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, ఎమ్మెల్యేలు అహ్మద్‌బిన్ అబ్దుల్ బలాలా, పాషాఖాద్రి, రవాణాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సునీల్‌శర్మ, రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియా, జేటీసీలు వెంకటేశ్వర్లు, రఘునాథ్,  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సుమారు రూ.8 లక్షల చొప్పున వ్యయం అయ్యే డబుల్‌బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రజలపైన ఒక్క రూపాయి భారం మోపకుండా ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు.

ఈ ఏడాది 10 వేల ఇళ్లు కట్టించి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే 3 ఏళ్లలో 50 వేల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు  పేర్కొన్నారు. పాతబస్తీతో పాటు నగరానికి  సమృద్ధిగా మంచినీటి సరఫరా చేసేందుకు రెండు రిజర్వాయర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాతబస్తీని అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ మాట్లాడుతూ, ఆటోమోబైల్, విద్యారంగాల్లో  పాతనగరం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఉప రవాణా కమిషనర్ ప్రవీణ్‌కుమార్, తెలంగాణ మోటారు వెహికిల్ ఇన్‌స్పెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు పాపారావు తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు