ఉన్నదంతా పోయింది.. అప్పులపాలయ్యా.. దివాలా తీశానంటున్న రైతుగా మారిన నటుడు

23 Nov, 2023 13:07 IST|Sakshi

బుల్లితెర నటుడు రాజేశ్‌ శర్మ రైతుగా మారాడు. మంచి అవకాశాలు రాకపోవడం వల్లే నటనకు గుడ్‌బై చెప్పి కర్షకుడిగా మారానంటున్నాడు. మొదట ఇతడి నిర్ణయం విని ఊరికే అంటున్నాడేమో అనుకున్నారు, కానీ నిజంగానే రైతుగా మారి పొలం పండిస్తున్నాడు. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. '2017లో నేను యాక్టింగ్‌ మానేద్దామనుకున్నాను. అప్పుడే మా నాన్నకు చెప్పాను. వారసత్వంగా వస్తున్న పొలం ఉంది కదా.. నేను పంట పండిస్తా అన్నాను. తను నా మాట పెద్దగా పట్టించుకోలేదు. కానీ నేను అనుకున్నది చేసి చూపించాను.

ప్రకృతి నాతో చెలగాటం ఆడింది
రైతుగా మారడానికి ప్రధాన కారణం.. నటుడిగా నాకు మంచి అవకాశాలు రాలేదు, కెరీర్‌లో ఎదుగుదల లేకుండా పోయింది. అదే రైతుగా మారితే.. నాకు నచ్చినవి పండించొచ్చు, నచ్చిన ప్రయోగాలు చేయవచ్చు. అందుకే పొలంలో దిగాను. దాదాపు ఐదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నాను. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ప్రకృతి నాతో ఎన్నోసార్లు ఆడుకుంది. 20 ఎకరాల పొలంలో 15 వేల మొక్కలు నాటితే వరదల్లో కొట్టుకుపోయాయి. నాలుగేళ్ల తర్వాత కూడా మళ్లీ అలాంటి నష్టమే జరిగింది. ఆర్థికంగా చాలా నష్టపోయాను.

దివాలా తీశా
లాక్‌డౌన్‌లో నేను దాచుకున్న సేవింగ్స్‌ అంతా ఖర్చయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే దివాలా తీశాను. అప్పులు ఎక్కువవడంతో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాను. ఆ సమయంలో నేను ఎంతో నేర్చుకున్నాను. నా పిల్లలు నన్ను రైతుగా మారిన నటుడు అని చెప్తుంటే గర్వంగా అనిపిస్తుంది' అని చెప్పుకొచ్చాడు. కాగా రాజేశ్‌ శర్మ.. సారాభాయ్‌ వర్సెస్‌ సారాభాయ్‌ అనే సీరియల్‌లో నటించాడు. ఇది 2004-2006 మధ్య కొనసాగిన ఈ సీరియల్‌ సూపర్‌ హిట్‌గా నిలిచింది. 2017లో దీనికి సీక్వెల్‌ కూడా వచ్చింది. ఆ సమయంలో గత సీరియల్‌ నటీనటులంతా కలిసి పార్టీ కూడా చేసుకున్నారు.

చదవండి:  హీరోయిన్‌గా బోర్‌ కొట్టిందంటున్న బ్యూటీ.. ఇకపై మరో టాలెంట్‌ చూపిస్తుందట!

మరిన్ని వార్తలు