గవర్నర్ పాలనాదక్షతపై అనుమానాలా?

30 Mar, 2016 04:39 IST|Sakshi
గవర్నర్ పాలనాదక్షతపై అనుమానాలా?

♦ తోచినవారిని వర్సిటీ చాన్స్‌లర్లుగా నియమిస్తారా?
♦ వీసీల నియామక బిల్లుపై విపక్షాల మండిపాటు
♦ మజ్లిస్ మినహా బిల్లును వ్యతిరేకించిన విపక్షాలు
♦ కొత్త విధానం కాదు.. చాలా రాష్ట్రాల్లో ఉంది: కడియం
 
 సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్స్‌లర్లను నియమించకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోం దంటూ విపక్షాలు మండిపడ్డాయి. మంగళవారం అసెం బ్లీలో వీసీల నియామకానికి ఉద్దేశించిన చట్ట సవరణ బిల్లును వ్యతిరేకించాయి. బిల్లుల్లోని అంశాలపై విబేధించినా యథాతథంగా ఆమోదించేందుకు సిద్ధపడుతోందంటూ అధికార పార్టీ తీరుకు నిరసనగా కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది. ‘‘తెలంగాణ సాధన సమయంలో విద్యార్థులు ఉద్యమానికి అండగా నిలిచారు.

కొన్ని కారణాలతో ఇప్పుడు వారు ప్రభుత్వానికే వ్యతిరేకంగా మారారు. వారిని అణచివేసేందుకే వర్సిటీలను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోబోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మూడున్నర దశాబ్దాలుగా గవర్నరే వర్సిటీలకు చాన్స్‌లర్. ఇప్పుడు ఆయన పాలనాదక్షతపై వచ్చిన అనుమానాలేంటి? మీకు తోచిన వారిని అసలే అలజడిగా ఉన్న వర్సిటీలు రాజకీయ జోక్యంతో మరింత దారుణంగా తయారవుతాయి’’ అని ప్రతిపక్షాలు అధికార పక్షంపై ఎదురుదాడికి దిగాయి.

 చర్చకు పట్టుపట్టిన విపక్షాలు
 మంగళవారం ఉదయం అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి హోదాలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం చట్ట సవరణకు విడివిడిగా బిల్లులు ప్రవేశపెట్టారు. ఇవన్నీ సానుకూల ప్రతిపాదనలే అయినందున చర్చ లేకుండా ఏకగ్రీవంగా బిల్లులకు ఆమోదం తెలపాల్సిందిగా శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు విపక్ష సభ్యులను కోరారు.

అయితే తాము వ్యతిరేకిస్తున్నందున చర్చ జరగాల్సిందేనని విపక్షాలు పట్టుపట్టడంతో సభాపతి అందు కు అనుమతించారు. వీసీ ప్యానెల్ తయారీకి సెర్చ్ కమిటీ ఉంటుందని, అందులో చేసిన సిఫారసు మేరకు ప్రభుత్వం వీసీని నియమిస్తుందని, ఇదేమీ కొత్త విధా నం కాదని రాజస్థాన్, హిమాచల్‌ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అమలవుతున్నదేనని కడియం సభ దృష్టికి తెచ్చారు. ఏపీ నుంచి చట్టాన్ని అడాప్ట్ చేసుకోవడంతోపాటు మన అవసరాలకు తగ్గట్టుగా సవరణ చేసుకునేందుకు ఉన్న వెసులుబాటు మేరకు ఈ బిల్లు తెచ్చినట్టు వివరించారు. ఈ బిల్లుకు మజ్లిస్ సంపూర్ణ మద్దతు ప్రకటి ంచింది.

 యూజీసీ గ్రాంట్లు కోల్పోతాం: జీవన్‌రెడ్డి
 బిల్లుపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి చర్చను ప్రారంభించారు. ఈ బిల్లుతో పెను ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘విద్యార్థుల్లో ప్రభుత్వంపై విశ్వసనీయత దెబ్బతినటమే కాకుండా వర్సిటీలు కేంద్రం నుంచి వచ్చే యూజీసీ నిధులు కోల్పోవాల్సి వస్తుంది. విద్యాహక్కు చట్టం నిర్వీర్యం అవుతున్న మాదిరే విశ్వవిద్యాలయాలు కూడా కొరగాకుండా పోతాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ విశ్వవిద్యాలయంలో కూడా పాలక మండళ్లు లేవు. వాటిని ఏర్పాటు చేసి యూనివర్సిటీలను గాడిలో పెట్టొచ్చు. చాన్స్‌లర్‌గా గవర్నర్ ఉన్నా వీసీ పేరును ప్రభుత్వమే సిఫారసు చేస్తున్నందున ఉన్నట్టుండి గవర్నర్ నుంచి చాన్స్‌లర్ హోదాను ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? గతంలో ప్రభుత్వ ఆధీనంలోనే యూనివర్సిటీలు ఉండేవి. నిష్పాక్షికంగా ఉండేందుకు చాన్స్‌లర్‌గా గవర్నర్ ఉండే పద్ధతి అందుబాటులోకి వచ్చింది’’ అని ఆయన అన్నారు.

 రాజకీయ జోక్యం పెరుగుతుంది: లక్ష్మణ్, బీజేపీ
 వీసీలతోపాటు చాన్స్‌లర్‌లను కూడా ప్రభుత్వమే నేరుగా నియమించే పరిస్థితి ఉన్నందున విశ్వవిద్యాలయాల్లో రాజకీయ జోక్యం పెరిగి ఇబ్బందులకు కారణమవుతుంది. అసలు గవర్నర్ తీరుపై అపనమ్మకం ఎందుకొచ్చిందో ప్రభుత్వం చెప్పాలి. పాలక మండళ్లను ఏర్పాటు చేసి విశ్వవిద్యాలయాలను గాడిలో పెట్టొచ్చు కదా!
 
 చక్కదిద్దమంటే ఇలాగా?: సండ్ర వెంకటవీరయ్య, టీడీపీ
 విశ్వవిద్యాలయాలను చక్కదిద్దమంటే ఏకంగా చాన్స్‌లర్‌గా గవర్నర్ లేకుండా చేస్తారా? ప్రభుత్వ పెత్తనం పెరిగేలా చేయటం సరికాదు. ఈ ఆలోచనను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి.
 
 బలోపేతం చేయాలి: పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్‌సీపీ

 అంబేడ్కర్, రాజీవ్‌గాంధీ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లులు విమర్శలకు ఆస్కారం ఇచ్చేలా ఉండొద్దు. విశ్వవిద్యాలయాలను చక్కదిద్ది బలోపేతమయ్యేలా ముందుకు వెళ్లాలి.
 
 ఇప్పటికే గ్రాంట్లు పోయాయి: రవీంద్రకుమార్, సీపీఐ
 న్యాక్ గుర్తింపు లేకపోవటం వల్ల సగం యూనివర్సిటీలకు గ్రాంట్లు నిలిచిపోయాయి. కొత్త నిర్ణయంతో మరింత నష్టం చేయొద్దు.  
 
 గుజరాత్‌లో ఈ విధానమే: రసమయి బాలకిషన్, టీఆర్‌ఎస్
 చాన్స్‌లర్ హోదాలో గవర్నర్ అన్ని యూనివర్సిటీలను చూసుకోలేకపోతున్నారు. ప్రతి చిన్న విషయం ఆయన దృష్టి తీసుకెళ్లటం కుదరటం లేదు. ప్రభుత్వ పరిధిలో ఉంటే సమస్యలు వెంటనే పరిష్కారమవుతాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కూడా ఈ విధానమే అమల్లో ఉంది.
 
 దేవాలయంలో దేవుడిని తొలగిస్తారా: చిన్నారెడ్డి, కాంగ్రెస్
 వర్సిటీలంటే దేవాలయం. అందులో దేవుడిని తొలగించి ఇష్టమొచ్చిన వారిని కూర్చోబెడతామంటే ఎలా? చాన్స్‌లర్‌గా గవర్నర్‌నే కొనసాగిస్తూ వీసీలపై ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సహకరిస్తాం.

>
మరిన్ని వార్తలు