ఓటీటీలోకి నయనతార 'అన్నపూరణి'.. తెలుగులోనూ విడుదల

25 Dec, 2023 07:35 IST|Sakshi

సౌత్‌ ఇండియా లేడీ సూపర్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార తన కెరియర్‌లో  బెంచ్‌మార్క్‌ చిత్రంగా 'అన్నపూరణి' విడుదలైంది. తన సినీ జీవితంలో 75వ సినిమాగా డిసెంబరు 1న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'అన్నపూరణి' ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌ అనే ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో జై, సత్యరాజ్, కేఎస్‌ రవికుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. నికిలేష్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ మూవీ కేవలం తమిళంలో మాత్రమే రిలీజైంది. కానీ ఓటీటీలో మాత్రం తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ అందుబాటులోకి రానుంది.

సినిమా బాగున్నా.. దెబ్బకొట్టిన వర్షాలు
సినిమా బాగుందని టాక్‌ వస్తున్న సమయంలో తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తాయి. దీంతో  అన్నపూరణి మూవీ జనాలకు పెద్దగా రీచ్‌ కాలేకపోయింది. ఈ చిత్రంలో నయనతార బ్రాహ్మణ కుటుంబానికి చెందిన మహిళగా నటించింది. ఇండియన్‌ బెస్ట్‌ ఛెఫ్‌గా ఎదగాలనుకున్న కోరిక ఆమెలో ఉంటుంది. దీనిని ఆమె తండ్రి వ్యతిరేకిస్తాడు. అయితే, తండ్రి వ్యతిరేకత ఉన్నప్పటికీ ఇండియన్‌ బెస్ట్‌ ఛెఫ్‌గా నయనతార ఎలా ఎదిగింది. ఆ తర్వాత ఆ రంగంలో ఆమెకు ఎదురయ్యే సవాల్ ఏంటి? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. కానీ హిందూ, బ్రాహ్మణ సంఘాలు నయనతార  సినిమాపై తీవ్రంగా మండిపడ్డాయి.

ఓటీటీలోకి ఎంట్రీ ఎప్పుడంటే
తాజాగా  'అన్నపూరణి' ఓటీటీలోకి రానుందని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. డిసెంబర్‌ 29 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం స్ట్రీమింగ్‌ కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లోనూ   'అన్నపూరణి' స్ట్రీమింగ్‌ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ కూడా సోషల్‌ మీడియా ఖాతాలో అధికారికంగా ప్రకటించింది. 2023 ఎండింగ్‌లో చాలామందిని మెప్పించిన ఈ సినిమాను ఇంట్లోనే చూసేయండి.

>
మరిన్ని వార్తలు