మా బిడ్డ నీవని...

5 Jan, 2016 23:55 IST|Sakshi
మా బిడ్డ నీవని...

షర్మిలకు అడుగడుగునా ఆదరణ
తోబుట్టువులా అక్కున చేర్చుకున్న నగరం
తొలిరోజు 8 కుటుంబాలకు పరామర్శ
రాజన్న బిడ్డ రాకతో బాధితుల కళ్లలో సంతోషం

 
సనత్ నగర్: రాజన్న బిడ్డ, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి షర్మిలను హైదరాబాద్ నగరం తోబుట్టువులా అక్కున చేర్చుకుంది. అంతులేని ప్రేమాప్యాయతలను పంచింది. పుట్టింటికి వచ్చిన కుమార్తెలా సంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి.. గాజులు వేసి ఆత్మీయతను పంచింది. ‘చిన్నా... అక్క వచ్చిందిరా...ఒక్కసారి చూడరా’ అంటూ రాజన్న మృతిని తట్టుకోలేక అనంత లోకాలకు వె ళ్లిపోయిన తన బిడ్డను తలచుకుంటూ ఓ తల్లి కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతుంటే... ‘నేనున్నాన’ంటూ షర్మిల అందించిన ఓదార్పు ఆ కుటుంబానికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ‘తల్లీ బాగా చదవాలి... చదువుపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒక్క ఫోన్ చెయ్యి... నేను చూసుకుంటా’నంటూ షర్మిల ఇచ్చిన భరోసా ఇంటర్మీడియెట్ చదువుతున్న ఓ విద్యార్థినిలో ఎంతో ఆత్మ విశ్వాసాన్ని నింపింది. ‘గ్రామ పంచాయతీలో ఏదైనా కొలువు ఇప్పించండమ్మా...’ అని అడగడమే తరువాయి... అక్కడి సర్పంచ్‌కు ఆ పనిని పురమాయించగానే ‘ఇంటికి పెద్ద దిక్కుగా వచ్చావా తల్లీ...’ అంటూ మరో కుటుంబం మురిసిపోయింది.

మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక గ్రేటర్ హైదరాబాద్‌లో అశువులు బాసిన కుటుంబాల కోసం ఆయన కుమార్తె షర్మిల  చేపట్టిన పరామర్శ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు సాగే ఈ యాత్రలో భాగంగా మొదటి రోజు 8 కుటుంబాలను ఆమె పరామర్శించారు. వెళ్లిన చోటల్లా ‘అధైర్య పడవద్దు... రాజన్న కుటుంబం ఎప్పుడూ అండగా ఉంటుంద’ని భరోసా ఇచ్చారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి నియోజక వర్గాల్లో పరామర్శ యాత్ర సాగింది. ఈమార్గాల్లో వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు షర్మిలకు ఘన స్వాగతం పలికారు. వైఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సురేశ్‌రెడ్డి, రాఘవరెడ్డి తదితరులతో కలిసి మొదటి రోజు షర్మిల పరామర్శ యాత్ర కొనసాగింది.
 

మరిన్ని వార్తలు