బడుగుల కల సాకారం

16 Nov, 2023 06:00 IST|Sakshi
సంఘీభావం ప్రకటిస్తున్న నేతలు

హిందూపురంలో సామాజిక సాధికార సంబరం

అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలు 

సీఎం జగన్‌ చేస్తున్న మేలును కీర్తిస్తూ ముందుకు సాగిన జనం 

అశేష జనవాహిని మధ్య సభ 

జగన్‌ పాలనలోనే సామాజిక సాధికారత సాధ్యమైందన్న నేతలు 

సాక్షి, పుట్టపర్తి: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో బుధవారం సామాజిక సాధికార బస్సు యాత్ర ఓ ఉత్సవంలా సాగింది. అశేష జనవాహిని మధ్య పండగ వాతావరణంలో బస్సు యాత్ర జరిగింది. ఈ యాత్రకు అడుగడుగునా ప్రజలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సీఎం వైఎస్‌ జగన్‌ చేసిన మేలును కీర్తిస్తూ ముందుకు సాగారు. సాయంత్రం హిందూపురం అంబేడ్కర్‌ కూడలిలో అశేష జనవాహిని మధ్య జరిగిన సభలో పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు రాష్ట్రంలో సామాజిక న్యాయం నెలకొన్న తీరును వివరించారు.  

బడుగుల కల సాకారం చేసిన సీఎం జగన్‌:  ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా 
రాష్ట్రంలో సామాజిక సాధికారతను సాధించడం ద్వారా సీఎం వైఎస్‌ జగన్‌ బడుగుల కలను సాకారం చేశారని ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు అయినా, వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యే వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకున్న నాయకుడు లేరన్నారు. వార్డు స్థాయి నుంచి పార్లమెంటు వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నాలుగింట మూడొంతుల ప్రాధాన్యం ఇచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌దేనని చెప్పారు. పలు సంక్షేమ పథకాల ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అభివృద్ధిలోకి తెచ్చారని తెలిపారు. మైనార్టీల పట్ల  చంద్రబాబుది దుర్మార్గపు బుద్ధి అని, 2009లో హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచిన అబ్దుల్‌ ఘనీని 2014లో పక్కనబెట్టి బాలకృష్ణకు టికెట్‌ ఇచ్చారని తెలిపారు. 
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం సామాజిక సాధికార సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం   

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు స్వాతంత్య్రం ఇప్పుడే: మంత్రి గుమ్మనూరు జయరామ్‌ 
వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాకే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా­ర్టీలకు స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి గుమ్మనూరు జయరామ్‌ చెప్పారు. గత ఏడు దశాబ్దా­లుగా ఏపీలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అణచివేతకు గురయ్యారని తెలిపారు. ఈసారి ఫ్యాన్‌ గాలికి హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణకు మైండ్‌ బ్లాక్‌ కావాలన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనా­ర్టీలు ఏ­కమై టీడీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. 

హిందూపురంలో చరిత్ర తిరగరాద్దాం: మంత్రి ఉషశ్రీ చరణ్‌ 
40 ఏళ్లుగా హిందూపురంలో టీడీపీ అభ్యర్థులను గెలిపిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించి చరిత్ర తిరగరాద్దామని మంత్రి ఉషశ్రీ చరణ్‌ పిలుపునిచ్చారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తున్నసీఎం జగన్‌కు అందరమూ సహకరిద్దామని అన్నారు. బడ్జెట్‌లో మహిళా సాధికారతకు పెద్దపీట వేసిన ఘనత జగన్‌దేనని చెప్పారు. 

పక్క రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ పాలన
– రాజ్యసభ సభ్యుడు ఆర్‌.క్రిష్ణయ్య 
ఏపీ పాలన పక్క రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య చెప్పారు. బెంగళూరు నుంచి హిందూపురం వస్తుండగా.. కొందరు వచ్చి ఏపీలో పాలన బాగుందని, వారి ప్రాంతాలను ఏపీలో కలిపేందుకు ఉద్య­మం చేయాలనుకుంటున్నామని, అందుకు తన సహకారం కోరారని తెలిపారు. ఒక సీఎంకు ఇంతకంటే ఇంకేం కావాలని అన్నారు. జగన్‌ పాలన ఇలాగే కొనసాగితే రానున్న 20 ఏళ్లలో దేశంలోనే ఏపీ అత్యంత ధనిక రాష్ట్రంగా అవుతుందన్నారు.  

ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్సీ మంగమ్మ, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, డాక్టర్‌ పీవీ సిద్దారెడ్డి, డాక్టర్‌ తిప్పేస్వామి, హిందూపురం నియోజకవర్గ సమన్వయకర్త టీఎన్‌ దీపిక తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు