విదేశీ కరెన్సీతో ఐదుగురి పట్టివేత

26 Sep, 2016 19:20 IST|Sakshi
హైదరాబాద్ : చెలామణీలో లేని విదేశీ కరెన్సీని అమాయకులకు అంటగట్టి సొమ్ము చేసుకునేందుకు యత్నించిన ఐదుగుర్ని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమమండల డీసీపీ వెంకటేశ్వర రావు తెలిపిన వివరాలివీ.. వరంగల్ జిల్లాకు చెందిన రామసాగర్ (34) కారుడ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. ఓసారి అతడు గోవాకు వెళ్లిన సమయంలో అక్కడ కేరళకు చెందిన జావిద్ పరిచయమయ్యాడు. అతని వద్ద చెలామణీలో లేని వెనుజులా దేశ కరెన్సీ ఉంది. ఆ దేశంలో 2008లోనే బ్యాన్ చేసిన కరెన్సీ మన రూపాయల్లో 11 లక్షల పైచిలుకు ఉంటుందని దాన్ని కేవలం లక్షన్నరకే ఇస్తానని నమ్మ బలికాడు. దీంతో రామసాగర్ తన భార్య నగలు అమ్మి మరీ వాటిని కొనుగోలు చేశాడు. 
 
ఇతని స్నేహితులు సైదాబాద్‌కు చెందిన కె.కరుణాకర్ (43), పద్మారావు నగర్‌కి చెందిన జి.రంజిత్ కుమార్ (33), సైదాబాద్‌కు చెందిన ఎం.రవిచంద్ర (43), గుంటూరు జిల్లాకు చెందిన ఎన్. నాగమల్లేశ్వర్ రావు (30) లతో కలిసి పలువుర్ని మోసం చేసి వాటిని అంటగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమవారం ఉదయం అమీర్‌పేట బిగ్‌బజార్ వద్ద వీరు అనుమానాస్పదంగా తిరుగుతుండగా సమాచారం అందుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సదరు నగదును ఓ వ్యక్తికి రూ.5 లక్షలకు అమ్మేందుకు యత్నిస్తున్నట్లు వారు విచారణంలో ఒప్పుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరికి కరెన్సీ సరఫరా చేసిన జావిద్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 
మరిన్ని వార్తలు