దళారీ రాజ్యం..

28 Dec, 2016 01:43 IST|Sakshi
దళారీ రాజ్యం..

నగర మార్కెట్లలో మోసపోతున్న కూరగాయల రైతులు
చిల్లర కొరత..అధిక ఉత్పత్తి సాకుగా చూపి అడ్డంగా దోపిడీ
తక్కువ ధరకు కొని.. రిటైల్‌లో డబుల్‌ రేట్లకు విక్రయిస్తున్న దళారీలు..  lదిగుబడి ఉన్నా అన్నదాతకు నష్టాలే..


నగర మార్కెట్లలో అన్నదాత నిలువునా దోపిడీకిగురవుతున్నాడు. వానలు బాగా కురిసి..పంటలు బాగా పండి..మంచి దిగుబడి చేతికొచ్చినా అటు రైతన్నకు సరైన ఫలితం దక్కడం లేదు. ఇటు వినియోగదారులకు తక్కువ ధరలకు కూరగాయలు లభించడం లేదు. దీనికి కారణం దళారుల మాయాజాలమే. నోట్ల రద్దు..చిల్లర కొరతను సాకుగా చూపి మధ్య దళారులు రైతుల వద్ద అతి తక్కువ ధరకే కూరగాయలను కొనుగోలు చేస్తున్నారు. వీటిని రిటైల్‌ మార్కెట్లలో మాత్రం రెట్టింపు ధరలకు విక్రయిస్తున్నారు. దీంతో దిగుబడి పెరిగినా ఫలితం దక్కక అన్నదాత..చిల్లర కొరతతో అధిక ధరలకు కూరగాయలు కొనలేక వినియోగదారులు అల్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా మార్కెటింగ్‌ శాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు. – సాక్షి, సిటీబ్యూరో

సిటీబ్యూరో: ఈ ఏడాది కూరగాయల ఉత్పత్తి భారీగా పెరగడంతో ధరలు తగ్గుతాయనుకున్న గ్రేటర్‌ వాసుల ఆశలపై దళారులు నీళ్లు చల్లుతున్నారు. అలాగే అధిక దిగుబడి వచ్చినందున లాభాలు బాగానే వస్తాయనుకున్న రైతులూ నిరాశ చెందుతున్నారు. నగరంలోని పలు మార్కెట్లలో మధ్య దళారులు పాగా వేసి చిల్లర కొరతను బూచీగా చూపి రైతులను దోచుకోవడంతోపాటు..వినియోగదారుల జేబులు గుల్ల చేస్తుండడం గమనార్హం. ఉత్పత్తి అనూహ్యంగా పెరగడంతో అన్నదాతల నుంచి తక్కువ ధరలకు కూరగాయలను కొనుగోలుచేసి మార్కెట్‌లో మాత్రం రెట్టింపు ధరలకు విక్రయిస్తుండడం పట్ల విమర్శలు వస్తున్నాయి.

రైతన్నకు కుడి, ఎడమల దగా...
ఆరుగాలం శ్రమించి కూరగాయలు పండించిన రైతన్నలు మార్కెట్లలో నిలువునా దోపిడీకి గురవుతున్నారు. కనీసం గిట్టుబాట ధర కూడా రాకపోవడంతో వచ్చినకాడికి అమ్మేసుకుంటున్నారు. ఉత్పత్తి పెరిగిందన్న సాకు, నోట్ల రద్దు ప్రభావంతో ఏర్పడిన చిల్లర కొరత కారణాలు చూపుతూ దళారులు, మధ్యవర్తులు రేట్లు తగ్గించి మరీ కొనుగోలు చేస్తున్నారు. అయితే వీరు ఇవే కూరగాయలను రిటైల్‌ మార్కెట్‌లో రెండింతలు, మూడింతలకు అమ్ముతూ లాభపడుతున్నారు. కూరగాయల రేట్లు తగ్గిన ఫలాలు వినియోగదారుడికి కూడా అందలేదు. రైతన్నలు, వినియోగదారులు మోసపోతుండగా, దళారులు, మధ్యవర్తులు మాత్రం లాభాల గడించేస్తున్నారు. దీనికి కొంత మార్కెటింగ్‌ శాఖ అధికారులు కూడా సహకరిస్తుండటంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది.

కూరగాయల ధరలపై నోట్ల రద్దు ప్రభావం...
సిటీలో నిత్యవసరమయ్యే కూరగాయల ధరలపై నోట్ల రద్దు ప్రభావం భారీగానే కనిపించింది. రైతన్నలు తాము పండించిన పంటలను మార్కెట్‌కి తీసుకెళ్లేందుకు రవాణా, ఇతరత్రా ఖర్చులకు డబ్బులు లేక..వారి వద్దకే వచ్చిన మధ్యవర్తులకు ఎంతో కొంతకు విక్రయించారు. కొందరి వద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని అనుకూలంగా మలుచుకున్న దళారులు, వ్యాపారులు ‘మేం రేటు ఇంతే ఇస్తాం. లేదంటే తీసుకెళ్లండి అంటూ కొర్రీలు పెట్టడం’తో చేసేదేమీ లేక ఇచ్చి వెళ్లినవారూ ఉన్నారు. గిట్టుబాటు కాక చాలా మంది ఉల్లిగడ్డ రైతులు తాము తెచ్చిన సరుకును మలక్‌పేటలోని వ్యవసాయ మార్కెట్‌లోని రోడ్లపై పడేసి వెళ్లిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. వాటిని నిల్వ చేసేందుకు అధికారులు కోల్డ్‌ స్టోరేజీలు కూడా అందుబాటులోకి తీసుకరాకపోవడంతో దళారుల పంట పండింది.

ఉత్పత్తి పెరిగింది..
నగర శివారు ప్రాంతాలతో పాటు వివిధ జిల్లాల నుంచి నగరానికి టమాటా, వంకాయ, బెండకాయ, సొరకాయ, బీరకాయ ఇలా నిత్యం అవసరమయ్యే కూరగాయలన్నీ వస్తుంటాయి. ప్రస్తుతం నల్గొండ, ఖమ్మం, వరంగల్, వికారాబాద్, మెదక్, అనంతపురం, చిత్తూరు, తాండూరు జిల్లాల నుంచి కూరగాయలు, ఆగ్రా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా నుంచి ఆలుగడ్డలు బోయిన్‌పల్లి, గుడిమల్కాపూర్‌ మార్కెట్లకు తరలివస్తున్నాయి. అయితే కోటి జనాభా వున్న నగరానికి ప్రతిరోజు దాదాపు 35 లక్షల కిలోల కూరగాయలు అవసరం. అయితే హోల్‌సేల్‌ మార్కెట్లకు 25 లక్షల కిలోల కూరగాయలు వస్తున్నాయి. వేసవికాలంలో పది లక్షల కిలోల వరకు కూరగాయల కొరత నగరాన్ని పీడించిందని, ఇప్పుడు ఆ స్థాయి ఇబ్బంది లేదని మార్కెటింగ్‌ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది నవంబర్‌తో  పోల్చుకుంటే ఈ ఏడాది  కూరగాయల ధరలు తగ్గినట్టు కనిపిస్తున్నప్పటికీ..ఆ ఫలితం వినియోగదారులకు దక్కడంలేదని విశ్లేషిస్తున్నారు.

మరిన్ని వార్తలు