పుష్కరాలను బాబే తెచ్చారా?

6 Aug, 2016 03:50 IST|Sakshi
పుష్కరాలను బాబే తెచ్చారా?

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపాటు
సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి, కృష్ణా పుష్కరాలను తానే తీసుకొస్తున్నట్లు అందరినీ ఆహ్వానిస్తూ ప్రచారం చేసుకుంటున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. దీన్నిబట్టి చంద్రబాబుకు ప్రచార యావ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్ధమవుతోందని విమర్శించారు. శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ప్రచార పిచ్చితో గోదావరి పుష్కరాలలో 30 మందిని పొట్టనపెట్టుకున్న చంద్రబాబు ఇప్పుడు కృష్ణా పుష్కరాలలో కూడా తన ప్రచారాన్ని ప్రారంభించారని దుయ్యబట్టారు. గుడుల కూల్చివేత, పుష్కరాలలో దోపిడీపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు 23 సార్లు ఢిల్లీకి వెళ్లి ఏం సాధించారో  చెప్పాలని అన్నారు.  
 
మరిగిన రక్తాన్ని ఏం చేశారు?
ప్రత్యేక హోదాపై కేంద్రం తీరును చూసి తన రక్తం మరిగిపోతోందంటూ ప్రెస్‌మీట్లు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి తన మరిగిన రక్తాన్ని ఏం చేశారో చెప్పాలని శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తీరును చూసి కేంద్రం ప్రత్యేక హోదాను పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ట్విస్ట్ చేసి చెప్పడంలో బాబు ఘనాపాఠి
పుష్కరాలకు ఆహ్వానించేందుకు వెళ్లిన తనపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసలు కురిపించారంటూ చంద్రబాబు పత్రికల్లో ప్రచారం చేసుకుంటున్నారని గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. ఎన్‌సీఏఈఆర్ సర్వేలో అవినీతిలో ఏపీ నంబర్ 1గా నిలిచిందేంటని బాబును ప్రణబ్ ప్రశ్నించి ఉంటారని చెప్పారు. దేన్నయినా ట్విస్ట్ చేసి చెప్పడం, ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు అంతటి ఘనాపాఠి ఎవ్వరూ లేరని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు