నయీమ్ పేర ఎమ్మెల్యే దందా!

2 Oct, 2016 03:22 IST|Sakshi
నయీమ్ పేర ఎమ్మెల్యే దందా!

సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌ను అడ్డం పెట్టుకుని దందాలు నడిపిన వారి పేర్లు ఒక్కొక్కటే బయటికొస్తున్నాయి. ముఖ్యంగా నల్లగొండ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు నయీమ్ పేరు చెప్పి తమను బెదిరించినట్లు పలువురు బాధితులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆ ఎమ్మెల్యే తెరవెనుకే కథంతా నడిపారని సమాచారం. నయీమ్ ప్రధాన అనుచరునిగా పోలీసులు భావిస్తున్న శేషన్న, నయీమ్ బంధువు ఖలీమ్‌లను అడ్డంపెట్టుకుని ఆయన ఈ వ్యవహారాలన్నీ నడిపినట్లు చెబుతున్నారు. పైగా తన నియోజకవర్గంలోనే గాక నల్లగొండ చుట్టుపక్కల భూ లావాదేవీల్లోనూ వేలు పెట్టినట్టు ఫిర్యాదులున్నాయి.

నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత శేషన్న, ఖలీమ్ అజ్ఞాతంలో ఉండిపోయారు. వీరిని పట్టుకునేందుకు సిట్ వేట కొనసాగిస్తోంది. వీరిలో ఏ ఒక్కరు పోలీసులకు చిక్కినా సదరు ఎమ్మెల్యే బండారం బయటపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆయనపై నేరుగా సీఎంకే ఫిర్యాదులందాయని, నిజానిజాలను విచారించి తనకు నివేదిక అందివ్వాల్సిందిగా సిట్ అధికారులను ఆదేశించారని సమాచారం. ఈ మేరకు ఇప్పటికే విచారణ ప్రారంభించిందని, దీనిపై క్షేత్రస్థాయి విచారణ జరపాల్సిందిగా నల్లగొండ ఎస్పీకి సూచించిందని చెబుతున్నారు. దాంతో ఎస్పీ ఆదేశాల మేరకు సంస్థాన్ నారాయణపురం ఎస్సై విచారణ కోసం రంగంలోకి దిగారని చెబుతున్నారు.
 
ఆరోపణలివీ...
విశ్వసనీయ సమాచారం మేరకు... నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో గ్రామ కంఠం భూములను (వీటినిక్కడ కందకాల భూములని కూడా అంటారు) ఆ ఎమ్మెల్యే మనుషులు ఆక్రమించారని కొందరు బాధితులు సిట్‌కు ఫిర్యాదు చేశారు. ఖలీమ్ ఇప్పటికే ఒక మహిళ పేర ఆ భూమిని రిజిస్టర్ చేయిం చాడు. చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం పరిసరాల్లోనూ ముంబైకి ఓ వ్యక్తి తాలూకు భూమికి అడ్వాన్సు చెల్లించి సొంతం చేసుకున్నారని, తర్వాత మిగతా మొత్తం అడిగితే నయీమ్ పేరు చెప్పి శేషన్న, ఖలీమ్ బెదిరించారని అంటున్నారు.

చౌటుప్పల్, తంగడపల్లి, తాళ్లసింగా రం, లింగోజిగూడెం, పంతంగి తదితర గ్రామాల పరిధిలో ‘గోల్డెన్ ఫారెస్ట్’ అనే సంస్థకు సుమారు 1,300 ఎకరాల దాకా ఉంది. వీటిలో రియల్ ఎస్టేట్ వెంచర్లూ ఉన్నాయి. వీటిలోని వివాదాస్పద భూముల్లో ఈ గ్యాంగ్ తలదూర్చి సుమారు రూ.50 లక్షల దాకా బలవంతంగా వసూలు చేసినట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అతని బాధితులు వందలాదిగా బయటికొస్తుండటం, దాదాపు అన్ని పార్టీల నేతలకూ గ్యాంగ్‌స్టర్‌తో సంబంధాలున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటోంది. నిక్కచ్చిగా వ్యవహరించాలని సిట్ అధికారులకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మరిన్ని వార్తలు