ఆటోను ఢీకొన్న కారు

11 Nov, 2023 09:05 IST|Sakshi
చొల్లంగి వద్ద ఆటోను ఢీకొన్న కారు

తాళ్లరేవు: జాతీయ రహదారి 216పై చొల్లంగి వద్ద శుక్రవారం జరిగిన ప్రమాదంలో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, కోరంగి పోలీసుల కథనం ప్రకారం.. అమలాపురం నుంచి కాకినాడ వైపు వెళ్తున్న కారు ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. అదే సమయంలో కాకినాడ వైపు నుంచి చొల్లంగిపేట వెళ్తున్న మరో ఆటో ఆ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో రెండు ఆటోల డ్రైవర్లతో పాటు ఆయా ఆటోల్లోని 10 మంది ప్రయాణికులు, కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

తాళ్లరేవు మండలం చొల్లంగిపేటకు చెందిన ఆటో డ్రైవర్లు ఈర్ల బాబూరావు, తులసి శ్రీనివాసరావుతో పాటు కోనాడ కామేశ్వరి, శ్రీకోటి లక్ష్మి, కోనాడ సత్యవతి, నీలపల్లి లక్ష్మి, రామిశెట్టి ఎల్లారి, సోది పద్మ, నీలపల్లి దేవి, గంపల నూకరత్నం; తాళ్లరేవుకు చెందిన మేకల కస్తూరి, మేకల ఆనంద్‌; కారులో ప్రయాణిస్తున్న దొంగ రామచంద్రరావు, సునీత దంపతులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్సులలో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

చేపల విక్రయానికి వెళ్లి వస్తూ..
చొల్లంగిపేట గ్రామానికి చెందిన మహిళలు ప్రతి రోజూ మత్స్య ఉత్పత్తుల విక్రయానికి ఆటోల్లో సామర్లకోట, పెద్దాపురం వెళ్లి వస్తూంటారు. రోజూ మాదిరిగానే ఒకే ఆటోలో వెళ్లిన ఎనిమిది మంది మత్స్యకార మహిళలు తిరిగి స్వగ్రామానికి తిరిగి బయలుదేరారు. మరో పది నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటోల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ ఏడాది మే నెలలో కోరంగి పంచాయతీ సుబ్బారాయుని దిమ్మ వద్ద ఒక ఆటోను ప్రైవేటు బస్సు ఢీకొని ఎనిమిది మంది మృతి చెందిన విషయం తెలిసిందే. తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ఆటోవాలాల తీరు మారకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు తగు చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు