సిటీ బస్‌లో ఇద్దరికి చార్జీ రూ.674!

20 Jul, 2017 09:15 IST|Sakshi
సిటీ బస్‌లో ఇద్దరికి చార్జీ రూ.674!

టికెట్‌.. ఇదో పెద్ద ఇష్యూ..
అడ్డగోలుగా  చార్జీల ముద్రణ
టిక్కెట్‌ నంబర్‌ లేకుండానే తెల్లకాగితాల విడుదల
పలువురు కండక్టర్‌లపై సస్పెన్షన్‌ వేటు


సాక్షి, సిటీబ్యూరో: ఎల్వీప్రసాద్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి కొండాపూర్‌కు ఆర్టీసీ చార్జీ  ఇద్దరు ప్రయాణికులకు రూ.674 మాత్రమే. అవాక్కయ్యారా.. మీరే కాదు. చాలామంది ప్రయాణికులు ఆర్టీసీ  చార్జీలను చూసి నివ్వెరపోతున్నారు. నిజానికి ఎల్వీప్రసాద్‌ నుంచి కొండాపూర్‌కు మెట్రో ఎక్స్‌ప్రెస్‌ చార్జీ రూ.14 మాత్రమే. ఇద్దరు ప్రయాణికులకు రూ.28 తీసుకోవాలి. బుధవారం ఈ మార్గంలో ప్రయాణం చేసిన ఇద్దరు దంపతులకు మాత్రం కండక్టర్‌  ఏకంగా రూ.674 టిక్కెట్‌ చేతిలో పెట్టగానే ఆశ్యర్యపోయారు. ఆ తరువాత కండక్టర్‌ పొరపాటును సరిదిద్దినప్పటికీ  తరచూ ఇలాంటి సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి.

సాధారణంగా ఆటోల్లో మాత్రమే కనిపించే   మీటర్‌ ట్యాంపరింగ్‌ తరహాలో ఆర్టీసీ బస్సుల్లో ‘టిమ్స్‌ ట్యాంపరింగ్‌’ కావడం పట్ల  ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని యంత్రాల్లో అసలు టిక్కెట్‌ చార్జీలు ప్రింట్‌ కాకుండానే తెల్లకాగితాలు బయటకు  వచ్చేస్తున్నాయి. దాంతో కండక్టర్లే  వాటిపై టిక్కెట్‌ నెంబర్, చార్జీల వివరాలు రాసి ప్రయాణికులకు అందజేస్తున్నారు. మరోవైపు  ఇలాంటి టిక్కెట్ల కారణంగా  అక్రమాలకు పాల్పడుతున్నారనే నెపంపై కొందరు కండక్టర్లు  సస్పెన్షన్‌కు గురవుతున్నారు. మొత్తంగా ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌లో లోపభూయిష్టమైన  టిమ్స్‌ యంత్రాలు ఇటు ప్రయాణికులను,, అటు కండక్టర్లను బెంబేలెత్తిస్తున్నాయి.

కాలం చెల్లిన యంత్రాలు...
సాంకేతిక సామర్థ్యాన్ని పెంపొందించడంలో భాగంగా ఆర్టీసీ టిమ్స్‌ యంత్రాలకు శ్రీకారం చుట్టింది. దశలవారీగా నగరంలోని 29 డిపోల్లో  ఈ యంత్రాలను ప్రవేశపెట్టారు. దీంతో అప్పటి వరకు ఉన్న మాన్యువల్‌ టిక్కెట్‌ల స్థానంలో  కంఫ్యూటరైజ్డ్‌ టిక్కెట్లు అందుబాటులోకి వచ్చాయి.  నగరంలో  అనలాగ్, క్వాంటమ్‌ సంస్థలకు చెందిన సుమారు 3800 టిమ్స్‌ యంత్రాలను వినియోగిస్తున్నారు. సంస్థ యాజమాన్యం ఒక్కో టిమ్స్‌ యంత్రానికి రూ.6.5 వేల చొప్పున సుమారు రూ.2.47 కోట్లు వెచ్చించి వీటిని కొనుగోలు చేశారు.  

యంత్రాల నిర్వహణలో లోపాలను సరిదిద్దేందుకు  క్వాంటమ్, అనలాగ్‌ సర్వీసింగ్‌ సెంటర్లు ఉన్నా సకాలంలో మరమ్మతులు చేయకపోవడం, కాలం చెల్లిన యంత్రాల స్థానంలో కొత్త వాటిని సమకూర్చకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. మొదట్లో  ఈ యంత్రాలు ఇటు ప్రయాణికులు, అటు ఆర్టీసీకి  ప్రయోజనకరంగా ఉన్నాయి. అయితే గత కొంతకాలంగా  అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిర్వహణలో జాప్యం చోటుచేసుకంటోంది.

ఉద్యోగులపై వేటు...
ఒకవైపు  టిమ్స్‌ పని తీరు ఇలా ఉండగా, తెల్ల కాగితాలపై టిక్కెట్‌ నెంబర్లు, చార్జీలు రాసి ఇవ్వడాన్ని తప్పుపడుతూ ఆర్టీసీ  పలువురు కండక్టర్లపైన సస్పెన్షన్‌ వేటు వేసింది. దీంతో తాము చేయని తప్పునకు రోడ్డున పడాల్సి వస్తోందని  వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రాణిగంజ్‌ –1 డిపోకు చెందిన ఒక కండక్టర్‌ను ఇలాగే సస్పెండ్‌ చేశారు. ‘‘ రూ.8 రూపాయల టిక్కెట్‌ తెల్లకాగితంపై రాసి ఇచ్చాడనే కారణంతో అతడిని సస్పెండ్‌ చేశారు. దీంతో అతను ప్రతి నెలా రూ.45 వేల వేతనాన్ని కోల్పోవలసి వస్తుంది. దీంతో అతని కుటుంబం మనుగడ ప్రశ్నార్ధకంగా మారింది. సిబ్బంది జీతభత్యాలను కొల్లగొట్టేందుకు ఈ తరహా చర్యలకు పాల్పడుతున్నారేమో’’ నని  పలువురు కండక్టర్లు ఆవేదన వ్యక్తం చేశారు.  టిమ్స్‌ యంత్రాలను మార్చకుండా తమపైన చర్యలు తీసుకోవడం అన్యాయమని వారు  పేర్కొన్నారు.

వందల్లో ఫిర్యాదులు...
సాధారణంగా మూడేళ్లకోసారి టిమ్స్‌ యంత్రాలను మార్చాలని నిబంధనలు ఉన్నాయి.  వాటిలో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. వివిధ రూట్‌లలో ఆర్టీసీ  విధించే చార్జీలు కచ్చితంగా ప్రింట్‌ అవుతున్నాయా. లేక ఏవైనా లోపాలు ఉన్నాయా అనే అంశంపై తరచూ తనిఖీలు నిర్వహించాలి. ఇందుకు ప్రతి డిపోలో ప్రత్యేకంగా ఒక ఉద్యోగిని సైతం నియమించారు. అయితే ఇవేమీ అమలుకు నోచుకోవడం లేదు. దీంతో పలు డిపోల్లో  మూడేళ్లు దాటిన టిమ్స్‌ యంత్రాలనే వినియోగిస్తున్నట్లు సిబ్బంది  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యంత్రాల్లో లోపాల కారణంగా కండక్టర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒక్కో డిపోలో వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి.

ఇవీ సమస్యలు...

  • టిక్కెట్‌ ప్రింట్‌ సరిగ్గా రావడం లేదు.
  • అక్షరాలు కలిసిపోతున్నాయి.
  • ట్యాంపరింగ్‌ కారణంగా అధిక చార్జీలు నమోదవుతున్నాయి.
  • టిమ్స్‌ కీ బోర్డులు పని చేయడం లేదు.
  • టిక్కెట్‌ కోసం వినియోగించే కాగితం నాసిరకంగా ఉండటంతో అక్షరాలు సరిగ్గా ప్రింట్‌ కావడం లేదు.

కొన్ని డిపోల్లో మాత్రమే టిమ్స్‌ యంత్రాల్లో లోపాలు ఉన్న మాట నిజమే. కొన్ని డిపోల్లో మాత్రమే ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వాటిని త్వరలోనే సరిదిద్దుతాం. మూడేళ్లు దాటిన యంత్రాలను మార్చి కొత్తవి అందజేస్తాం. టిమ్స్‌లో లోపాలను పరిగణనలోకి తీసుకోకుండా  ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తున్నారనడం అవాస్తవం. ఇటీవల కొందరు కండక్టర్లు ఉద్దేశపూర్వకంగానే తెల్లకాగితాలపైన రాసి ఇచ్చారు. ఆ చార్జీలను తమ జేబుల్లో వేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే సస్పెండ్‌ చేశాం. విచారణలో వాస్తవాలు తెలుస్తాయి.
– పురుషోత్తమ్, ఈడీ

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా