పెరిగిన టాప్‌ మార్కులు

14 Apr, 2018 03:03 IST|Sakshi

ఎంపీసీలో గతేడాది టాప్‌ మార్కులు 993 కాగా.. ఈసారి 994 మార్కులు

బైపీసీలోనూ గతేడాది 991 కాగా.. ఈసారి 992 మార్కులు

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ద్వితీయ సంవత్స ర ఫలితాల్లో ఈసారి టాప్‌ మార్కులు పెరిగాయి. గతేడాది ఎంపీసీలో టాప్‌ మార్కులు 993 కాగా.. ఈసారి 994 వచ్చాయి. బైపీసీలో గతేడాది 991 మార్కులు టాప్‌కాగా.. ఈసారి 992 మార్కులు వచ్చాయి. ఈసారి ఎంపీసీ, బైపీసీ రెండు విభాగాల్లోనూ ఇద్దరు చొప్పున విద్యార్థులు టాప్‌ మార్కులు సాధించారు. ఇక ఎంఈసీలో గతేడాది 986 అత్యధిక మార్కులు కాగా.. ఈసారి ఒక విద్యార్థికి 987 మార్కులు వచ్చాయి. సీఈసీలో గతేడాది 976 టాప్‌ మా ర్కులుకాగా.. ఈసారి ముగ్గురు విద్యార్థులు 977 మార్కులు సాధించారు. హెచ్‌ఈసీలో గతే డాది 950 టాప్‌ మార్కులుకాగా.. ఈసారి 958 టాప్‌ మార్కులను ఒక్క విద్యార్థి సాధించారు.

ప్రథమ సంవత్సరంలో..
ఇక ప్రథమ సంవత్సరం ఎంపీసీలో గతేడాది 467 టాప్‌ మార్కులుకాగా.. ఈసారి కూడా 467 మార్కులే టాప్‌. అయితే గతేడాది టాప్‌ మార్కులు 12 మందికే రాగా.. ఈసారి 24 మంది విద్యార్థులకు వచ్చాయి. బైపీసీలో గతేడాది 436 టాప్‌ మార్కులను 11 మంది సాధించగా.. ఈసారి ఏడుగురు 437 టాప్‌ మార్కులు పొందారు.

ఎంఈసీలో గతేడాది ఆరుగురు 493 టాప్‌ మార్కులు సాధించగా.. ఈసారి ఒక విద్యార్థి 495 టాప్‌ మార్కులు పొందారు. సీఈసీలో గతేడాది ఒక విద్యార్థి 492 టాప్‌ మార్కులు పొందగా.. ఈసారి టాప్‌ మార్కులు తగ్గిపోయాయి. ఒక విద్యార్థి మాత్రమే 490 టాప్‌ మార్కులు సాధించారు. గతేడాది హెచ్‌ఈసీలో 470 టాప్‌ మార్కులను ఒక్క విద్యార్థి పొందగా.. ఈసారి ఒక విద్యార్థికి 483 మార్కులు వచ్చాయి.

టాపర్లు వీరే..
సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీలో టాప్‌ మార్కులను (994) వరంగల్‌ జిల్లాకు చెందిన వర్ణం శ్రీజ, ఖమ్మం జిల్లాకు చెందిన అయిలూరి శ్రుతి సాధించారు. ఖమ్మం జిల్లాకు చెందిన సహదేవుడి సాయి రాకేశ్‌ 993 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. ఇక బైపీసీలో 992 మార్కులతో హైదరాబాద్‌కు చెందిన పొదిల గాయత్రి, వి. శ్రీరామ్‌ ఆనంద్‌ టాపర్లుగా నిలిచారు.

తర్వాత 991 మార్కులను ఐదుగురు విద్యార్థులు సాధించారు. ఎంఈసీలో హైదరాబాద్‌కు చెందిన నగరూరు రక్షిత (987 మార్కులు) టాపర్‌గా నిలవగా.. సీఈసీలో అత్యధికంగా కరీంనగర్‌ జిల్లాకు చెందిన ఆర్‌పీ భావన, వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన బంబాక్‌ హర్ష, పత్తి శృతి 977 మార్కులు పొందారు. హెచ్‌ఈసీలో 958 మార్కులతో హైదరాబాద్‌ జిల్లాకు చెందిన సుంకరి శ్రీసాయి తేజ టాపర్‌గా నిలిచారు.

ప్రథమ సంవత్సరంలో..
ఫస్టియర్‌ ఎంపీసీలో 467 టాప్‌ మార్కులను 24 మంది విద్యార్థులు.. బైపీసీలో 437 టాప్‌ మార్కులను ఏడుగురు విద్యార్థులు సాధించా రు. ఎంఈసీలో 495 టాప్‌ మార్కులను హైదరాబాద్‌కు చెందిన గంపా గాయత్రి.. సీఈసీలో 490 టాప్‌ మార్కులను సిద్దిపేట జిల్లాకు చెందిన బోయిని శ్రీ మహాలక్ష్మి.. హెచ్‌ఈసీలో 483 టాప్‌ మార్కులను వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు చెందిన జి.జాన్సన్‌ సాధించారు.


ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసర్‌ అవుతా..
ఇంటర్‌లో ఎలాగైనా స్టేట్‌ టాపర్లలో ఒకరిగా ఉండాలనుకున్నాను. కానీ ఏకంగా నేనే టాపర్‌గా నిలవడం సంతోషంగా ఉంది. ఇన్‌కం ట్యాక్స్‌ ఆఫీసర్‌ కావాలనేది నా ధ్యేయం. అమ్మ, నాన్న కృష్ణారెడ్డి, లీలావతి ఇద్దరూ రైతులే. వారిచ్చిన స్ఫూర్తితోనే ఈ విజయం సాధించాను.. – ఎ.శృతి, ఎంపీసీ స్టేట్‌ టాపర్‌ (994 మార్కులు)

ఐఏఎస్‌ కావడమే లక్ష్యం
నమ్మకంతో చదివిస్తున్న తల్లిదండ్రుల ఆశయం నెరవేర్చేందుకు ఐఏఎస్‌ కావాలనేది నా లక్ష్యం. తల్లిదండ్రులు, అధ్యాపకుల ప్రోత్సాహం, సూచనలతోనే మంచి మార్కులు సాధించగలిగా. మరింత పట్టుదలతో చదివి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటా..    – ఆర్‌.పి.భావన, సీఈసీ స్టేట్‌ టాపర్‌ (977 మార్కులు)

మరిన్ని వార్తలు