భారం కాళేశ్వరమే!

9 May, 2016 01:07 IST|Sakshi
భారం కాళేశ్వరమే!

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ భారంపై స్పష్టత వచ్చింది. కాళేశ్వరం, ప్రాణహిత, ఇందిరమ్మ వరదకాల్వ, దేవాదుల ప్రాజెక్టుల్లో మార్పుల కారణంగా అంచనా వ్యయం ఏకంగా రూ.45,205.97 కోట్లు పెరుగుతోంది. ఇందులో కేవలం ఒక్క కాళేశ్వరం వ్యయ భారమే రూ.39,709 కోట్లు కావడం గమనార్హం. గోదావరి నదీ జలాల్లో హక్కుగా ఉన్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టిన విషయం తెలిసింది. ఇందులో భాగంగా కాళేశ్వరం, ప్రాణహిత, ఇందిరమ్మ వరద కాల్వ, దేవాదుల ప్రాజెక్టుల పరిధిలోని 42 ప్యాకేజీల్లో మార్పులు చేర్పులు చేపట్టారు. ఈ నాలుగు ప్రాజెక్టులు కలిపి తొలి వ్యయ అంచనా రూ.35,355 కోట్లుకాగా... రీ ఇంజనీరింగ్‌తో అంచనాలు ఏకంగా రూ.80,561 కోట్లకు చేరాయి. పెరిగిన అంచనాలను త్వరలోనే కేబినెట్ సబ్ కమిటీ ఆమోదించి, టెండర్లను ఎవరికి అప్పగించాలన్న దానిపై నిర్ణయం తీసుకోనుంది.

 గరిష్ట నీటి వినియోగం కోసం..
 సాగు, ఇతర అవసరాలకు ఎక్కువ రోజులు నీటిని అందుబాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందించడం, ముంపు తక్కువగా ఉండే లా చూడటం వంటి అంశాలకు ప్రాధాన్యమిస్తూ కాళేశ్వరం, ప్రాణహిత, దేవాదుల, ఇందిరమ్మ వరదకాల్వ ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్‌కు నీటి పారుదల శాఖ ప్రణాళికలు రూపొందించింది. ప్రాజెక్టుల్లో నీటి వినియోగాన్ని గరిష్ట స్థాయికి పెంచడం, వివిధ బేసిన్ల మధ్య నీటిని బదిలీ చేయడం ద్వారా అన్ని ప్రాంతాల ఆయకట్టులో సమతుల్యత సాధించడంతో పాటు సాగు విస్తీర్ణాన్ని పెంచే అంశాలకు ప్రాధాన్యమిస్తూ తుది ప్రణాళికను ఖరారు చేసింది. మొత్తంగా నాలుగు ప్రాజెక్టుల పరిధిలో సిద్ధం చేసిన అంచనాల మేరకు ప్రభుత్వం రూ.45,205.97 కోట్ల అదనపు భారం పడుతుందని లెక్కించింది.

 దేవాదులలోనూ మార్పులు...
 దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టును గోదావరి ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న ఇందిరమ్మ వరద కాల్వ (ఎఫ్‌ఎఫ్‌సీ) పరిధిలోకి తెచ్చే తుది ప్రతిపాదనలను నీటి పారుదల శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. దేవాదుల ఆయకట్టులోంచి 1.90 లక్షల ఎకరాలను వరద కాల్వ పరిధిలోకి మార్చనున్నారు. ఇందుకోసం వరద కాల్వ పరిధిలోని 5 పాత ప్యాకేజీల్లో మార్పులు చేయడంతోపాటు కొత్తగా మరో ప్యాకేజీని చేర్చారు. దీంతో ఇక్కడ అంచనా వ్యయం రూ.617.09 కోట్ల నుంచి రూ.1,666.87 కోట్లకు పెరిగింది. దీంతోపాటు దేవాదుల మూడో దశలోని 2, 3 ప్యాకేజీల మార్పుల్లో భాగంగా భీమ్‌ఘనపూర్ నుంచి రామప్ప చెరువును కలుపుతూ టన్నెల్ ద్వారా నీటిని తరలించాలన్న ప్రతిపాదనకు ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేశారు. ఇప్పుడున్న దేవాదుల ఫేజ్-2 పంపుహౌజ్, పైప్‌లైన్ వ్యవస్థకు సమాంతరంగా పైప్‌లైన్ వేసేలా నీటి పారుదల శాఖ ప్రణాళిక వేసింది. దీనిద్వారా రామప్ప దేవాలయానికి ఎలాం టి నష్టం వాటిల్లదు. అయితే ఈ కొత్త పైప్‌లైన్‌తో వ్యయ అంచనా రూ.531 కోట్ల నుంచి రూ.1,149.73కోట్లకు చేరనుందని నీటి పారుదల శాఖ తేల్చింది. ప్యాకేజీ-2లోనూ అదనంగా రూ.283.46కోట్లు ఖర్చవుతాయని లెక్కించారు. మొత్తంగా ఇక్కడ అంచనా వ్యయం రూ.1,941.70 కోట్ల నుంచి రూ.2,848.89 కోట్లకు చేరింది. నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం రీ ఇంజనీరింగ్ చేస్తున్న ప్రాజెక్టుల పరిధిలో పెరిగిన వ్యయాలపై తుది పరిశీలన జరిపి, త్వరలోనే ఆమోదం తెలపనుంది.
 
 కొత్తగా 6 ప్యాకేజీలు..
 ప్రతిష్టాత్మక ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్‌లో భాగంగాా చేపట్టిన ‘కాళేశ్వరం’ ఎత్తిపోతలకు తుదిరూపు వచ్చింది. తమ్మిడిహెట్టి ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో లో 2 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేందుకు పరిమి తం చేసిన ప్రాణహిత ప్రాజెక్టులోని 5 ప్యాకేజీలకు గానూ 3, 5 ప్యాకేజీల్లో మార్పులు చేయాల్సుంది. దీనికి అదనంగా మరో ప్యాకేజీ చేర్చడం ద్వారా అంచనా వ్యయం రూ.2,924 కోట్ల నుంచి రూ.6,464కోట్లకు పెరుగుతుందని తేల్చారు. కాళేశ్వరంలోని 22 ప్యాకేజీల్లో 13 మార్పులకు లోనవుతుం డగా, కొత్తగా 6ప్యాకేజీలను చేర్చారు. దీం తో ప్రాజెక్టు తొలి అంచనా రూ.29,872.33 కోట్లుగా ఉండగా అది రూ.69,581.33 కోట్లకు పెరిగింది. ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోనే ఏకంగా రూ.43,249 కోట్ల అదనపు భారం పడనుంది.

మరిన్ని వార్తలు