ఉంచుతారా.. పంచుతారా?

20 Mar, 2018 02:30 IST|Sakshi

నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

సాగర్‌లో కనీస నీటి మట్టాల నిర్వహణపై చర్చ

దిగువకు వెళ్లొద్దంటున్న తెలంగాణ.. పంచాలంటున్న ఏపీ

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల్లో లభ్యతగా ఉన్న నీటి పంపకాలపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ మంగళవారం భేటీ కానుంది. శ్రీశైలంలో కనీస మట్టాలకు దిగువన ఎంత వరకు వెళ్లి నీటిని వినియోగించుకోవాలి.. అలాగే సాగర్‌లో కనీస నీటి మట్టానికి దిగువకు వెళ్లే అంశంపై చర్చించనుంది. శ్రీశైలంలో 800 అడుగుల వరకు నీటిని వినియోగించాలని గతంలో నిర్ణయించారు.

అయితే 800 అడుగుల మేర దిగువకు వెళ్లిన లభ్యత జలాలు 10 టీఎంసీలకు మించి వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో ఇప్పుడు దృష్టి సాగర్‌పై పడింది. సాగర్‌లో ప్రస్తుతం 522.3 అడుగులకు నీటి మట్టాలు చేరగా, 154 టీఎంసీల మేర లభ్యత ఉంది. ఇందులో వినియోగానికి 22 టీఎంసీల మేర మాత్రమే ఉంది. రాష్ట్ర సాగు, హైదరాబాద్, నల్లగొండ జిల్లాల తాగు అవసరాలను దృష్టిలో పెట్టుకొని మే నెలాఖరు వరకు 510 అడుగుల దిగువకు వెళ్లేది లేదని తెలంగాణ స్పష్టం చేస్తోంది.

అయితే తమ రాష్ట్ర అవసరాల దృష్ట్యా ఈ నెలాఖరు నుంచే 500 అడుగుల వరకు వెళ్లి నీటిని తీసుకునే అవకాశం ఇవ్వాలని ఏపీ కోరుతోంది. ఈ నేపథ్యంలో బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ కీలకంగా మారింది. ఇందులో ఇరు రాష్ట్రాల తాగు, సాగు అవసరాలతో పాటు సాగర్‌లో కనీస నీటి మట్టాలను మెయింటేన్‌ చేయాలా.. లేక దిగువకు వెళ్లేందుకు అనుమతించాలా.. అనేది నిర్ణయించనున్నారు. 

మరిన్ని వార్తలు