నన్నెందుకు పక్కన పెట్టారో: మోత్కుపల్లి

11 Feb, 2016 20:02 IST|Sakshi
నన్నెందుకు పక్కన పెట్టారో: మోత్కుపల్లి

హైదరాబాద్ : చూడబోతే మరో తెలంగాణ టీడీపీ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు కూడా త్వరలోనే సైకిల్ దిగే పనిలో ఉన్నట్లున్నారు. గురువారం హైదరాబాద్లో మోత్కుపల్లి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం.  నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా అంటూ తెలంగాణపై పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న వైఖరిపై కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడారు. 

'మైనస్ చంద్రబాబు వల్ల తెలంగాణలో ఏమీ జరగదు.మైనస్ చంద్రబాబు వల్ల తెలంగాణలో ఏమీ జరగదు. పార్టీలో ఉపన్యాసాలకు తావులేదు. నాయకత్వం అవసరం. సీఎంగా బాధ్యతల కోసం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ వెళ్లారు. చంద్రబాబు తెలంగాణను వదిలేశారు. తెలంగాణకు చంద్రబాబు రావడం లేదన్న అభిప్రాయం జనంలోకి వెళ్లిపోయింది. వారానికి ఒకరోజు సమయం కేటాయించాలి. తప్పకుండా అన్ని జిల్లాల్లో తిరగాలి. లేకుంటే పార్టీకి పూర్వ వైభవం రాదు. పార్టీపై నన్ను మాట్లాడనీయకుండా నా ఎనర్జీని కాపాడారు ఇన్నాళ్లు. ఇటీవల గ్రేటర్ ఎన్నికల్లో కూడా నన్ను ఎక్కడా ఉపయోగించుకోలేదు. నన్ను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు. ఈ మధ్యకాలంలో మీటింగుల్లో నన్ను ఎక్కడైనా చూశారా? గ్రేటర్ ఎన్నికల్లో నా ప్రమేయం లేదు' అని మోత్కుపల్లి తన ఆవేదన వ్యక్తం చేశారు.

కాగా గతంలో మోత్కుపల్లి నర్సింహులుకు రాజ్యసభ అవకాశం ఇవ్వని చంద్రబాబు.. కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే గవర్నర్ పదవి ఇప్పిస్తానని హామీనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో తనకు గవర్నర్ గిరీ ఖాయం అనుకున్న ఆయనకు... ఆ తర్వాత  పదవి ఊసే లేకపోవడంతో అప్పటి నుంచి మోత్కుపల్లి కినుకగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

మరిన్ని వార్తలు