ఫార్మాసిటీకి ‘నిమ్జ్‌’ హోదా!

20 Apr, 2018 00:20 IST|Sakshi

జహీరాబాద్‌ తర్వాత రాష్ట్రానికి మంజూరు కానున్న రెండో నిమ్జ్‌ ప్రాజెక్టు

కేంద్ర ఔషధ, జాతీయ రహదారులు, రైల్వే శాఖల సానుకూల స్పందన

త్వరలో నిమ్జ్‌ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్న కేంద్రం

ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 4 వేల కోట్ల సహాయం  

సాక్షి, హైదరాబాద్‌: ఫార్మాసిటీ ప్రాజెక్టుకు త్వరలో నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ జోన్‌ (నిమ్జ్‌) హోదా లభించనుంది. దేశంలో ఉత్పాదక రంగ పరిశ్రమల క్లస్టర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు కేంద్రం 2013లో నేషనల్‌ మాన్యుఫాక్చరింగ్‌ పాలసీని తీసుకొచ్చింది. దీని కింద నిమ్జ్‌లు ఏర్పాటు చేసే రాష్ట్రాలకు ఆర్థిక సహకారం అందిస్తోంది.

రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు, కడ్తాల్‌ మండలా ల్లోని 19,333.20 ఎకరాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఔషధ రంగ పారిశ్రామికవాడగా రూపుదిద్దుకోనున్న ఫార్మాసిటీకి త్వరలో నిమ్జ్‌హోదా జారీ విషయంలో కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించనుంది.  

సానుకూలంగా నివేదికలు..
నేషనల్‌ మాన్యుఫాక్చరింగ్‌ పాలసీ ప్రకారం కనీసం 12,500 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఉత్పాదక రంగ పరిశ్రమల క్లస్టర్లు.. రోడ్డు, రైల్వే రవాణా సదు పాయం కలిగి ఉంటే కేంద్రం నిమ్జ్‌ హోదా జారీ చేస్తుంది. నిమ్జ్‌ హోదా కల్పించేందుకు ఫార్మాసిటీ అన్ని అర్హతలు కలిగి ఉందని కేంద్ర ఔషధ, జాతీయ రహదారులు, రైల్వే మంత్రిత్వ శాఖలు సానుకూ లంగా నివేదికలు అందించాయి.

దీంతో ఈ ప్రాజెక్టుకు నిమ్జ్‌ హోదా జారీ చేస్తూ కేంద్ర వాణిజ్య శాఖ నేతృత్వంలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ (డీఐపీపీ) ఉత్తర్వులు జారీ చేయడమే మిగిలిందని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్‌ఐఐసీ) అధికార వర్గాలు తెలిపాయి. ఎలక్ట్రిక్‌ పరికరాలు, మెటల్స్, ఫుడ్‌ అండ్‌ ఆగ్రో ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్, ట్రాన్స్‌పోర్ట్‌ ఎక్విప్‌మెంట్స్‌ తదితర ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటు కోసం రాష్ట్రానికి కేంద్రం జహీరాబాద్‌ నిమ్జ్‌ ప్రాజెక్టును ఇప్పటికే మంజూరు చేసింది.

ఫార్మాసిటీ ప్రాజెక్టుకు నిమ్జ్‌ హోదా కల్పిస్తే దేశంలో రెండు నిమ్జ్‌ ప్రాజెక్టులు కలిగిన తొలిరాష్ట్రంగా తెలంగాణ అవత రించనుంది. ఫార్మాసిటీ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 5.56 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటోంది. ప్రాజెక్టు కోసం 19,333 ఎకరాలను సేకరించాల్సి ఉం డగా 8 వేల ఎకరాలను సేకరించింది. పర్యావరణ అనుమతుల జారీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.

కేంద్ర నిధులు, రుణ సహాయం
బల్క్‌ డ్రగ్స్, వ్యాక్సిన్ల పరిశ్రమల స్థాపన కోసం రూ.16,784 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి నిమ్జ్‌ హోదా లభిస్తే కేంద్రం నుంచి భారీ మొత్తం లో నిధులు, ఇతర రాయితీ, ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో రూ.4 వేల కోట్ల ఆర్థిక సహాయాన్ని కేంద్రం అందించనుంది. రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడులవాటా పోగా మిగిలిన పెట్టుబడి వ్యయాన్ని రుణాల రూపంలో సమీకరించేందుకు కేంద్ర వాణిజ్య శాఖ సహకారం అందించనుంది. 

మరిన్ని వార్తలు