సెల్‌ వాడడు.. పోలీసులకు దొరకడు!

7 Mar, 2017 22:30 IST|Sakshi

రాంగోపాల్‌పేట్‌(హైదరాబాద్‌): సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ముఠా ప్రధాననిందితుడు తప్పించుకున్నాడు. దీనికి కారణం..అతడు ఫోన్లను, అందులోనూ కొట్టేసిన ఫోన్‌లను వాడకపోవటమేనని పోలీసులు అంటున్నారు. కాగా, పట్టుబడిన వారి నుంచి రూ.3.5లక్షల విలువ చేసే 27 మొబైల్‌ ఫోన్లు, రూ.35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఏసీపీ కే శ్రీనివాసరావు వెల్లడించిన వివరాలవీ.. మహబూబ్‌నగర్‌కు చెందిన బక్కవారి వినోద్, కాటేదాన్‌ రాజీవ్‌ గృహకల్పకు చెందిన ఆటో డ్రైవర్‌ గుండు ప్రభాకర్‌ (35), ఇదే ప్రాంతంలోని రవిఫుడ్స్‌లో పనిచేసే కొండె అరుణ్‌ రావు (22), నేతాజీనగర్‌ బుద్వేల్‌కు చెందిన బేల్దారి పనిచేసే గాలి అంజిరెడ్డి (22) స్నేహితులు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ నలుగురూ కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నారు.

వినోద్‌ కుమార్‌, కొండె అరుణ్‌ రావు దొంగతనం చేసేందుకు రాత్రి పూట అద్దెకు ఆటో మాట్లాడుకుని బయలుదేరుతారు. ఏదో ఒక చోట తెరిచిన కిటికీలున్న ఇంటిని ఎంచుకుని లోపలి బోల్టులను చాకచక్యంగా తెరుస్తారు. బయట అరుణ్‌రావు కాపలా కాస్తుండగా వినోద్‌ లోపలికి వెళ్లి మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, నగదును ఎత్తుకొస్తాడు.అనంతరం అక్కడి నుంచి వెంటనే ఉడాయిస్తారు.

ఇలా, గోపాలపురం, కేపీహెచ్‌బీ, జీడిమెట్ల,  ఎస్‌ఆర్‌నగర్‌, నారాయణగూడ తదితర పోలీస్‌ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడ్డారు.  దొంగిలించిన ఫోన్లను తెలిసిన వారికి విక్రయిస్తూ సంపాదించేవారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు బి.వినోద్‌ పరారీలో ఉండగా మిగతా ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఫోన్‌లు కొట్టేస్తాడు....కానీ వినియోగించడు
ప్రధాన నిందితుడు బక్కవారి వినోద్‌ మొబైల్‌ ఫోన్లు కొట్టేయడంలో నేర్పరి. ఎంత ఖరీదైన ఫోన్లను కొట్టేసినా వినోద్‌ మాత్రం ఫోన్లను వినియోగించడు. మొబైల్‌ ఫోన్‌ వాడటంతో వినోద్‌ 2014 లో జీడిమెట్ల పోలీసులకు పట్టుబడ్డాడు. అందుకే మరోమారు పోలీసులకు పట్టుబడకూడదంటే సెల్‌ వాడకూడదని నిశ్చయించుకున్నాడు.

మరిన్ని వార్తలు