TS Election 2023: ఢిల్లీకి చేరిన ప్యానల్‌ జాబితా..!

13 Oct, 2023 09:40 IST|Sakshi

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో..

జితేందర్‌, శాండిల్య, శ్రీనివాస్‌రెడ్డి పేర్లు!

నేడు నిర్ణయం వెలువడే అవకాశం..

కమిషనర్‌ సీవీ ఆనంద్‌పై ఆకస్మికంగా వేటు!

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌పై ఆకస్మికంగా వేటు పడింది. దీంతో తక్షణ కొత్త కొత్వాల్‌ నియామకం అనివార్యంగా మారింది. ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన ప్యానల్‌ లిస్ట్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఈసీకి పంపారు. ఈ ముగ్గురిలో ఒకరిని హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా ఎంపిక చేస్తుందా? లేక మరికొన్ని పేర్లు పంపాల్సిందిగా కోరుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది. ఏదేమైనా.. నేటి సాయంత్రానికి కొత్త కొత్వాల్‌ పేరు ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రస్తుతం డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీసు (డీజీపీ) హోదాలో ఉన్న సీవీ ఆనంద్‌ 1991 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. సీనియారిటీ ప్రకారం ఆయన తర్వాత స్థానాల్లో జితేందర్‌ (1992 బ్యాచ్‌), సందీప్‌ శాండిల్య (1993 బ్యాచ్‌), విజయ్‌ ప్రభాకర్‌ ఆప్టే (1994 బ్యాచ్‌) ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆప్టే కేంద్ర సర్వీసుల్లో ఉండటంతో అదే బ్యాచ్‌కు చెందిన కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి పేరును ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌ పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జితేందర్‌, సందీప్‌ శాండిల్య, శ్రీనివాస్‌రెడ్డి పేర్లతో రూపొందించిన ప్యానల్‌ లిస్టును కేంద్ర ఎన్నికల సంఘానికి పంపారు.

గతంలోనూ ఐదు సందర్బాల్లో..
హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ పోస్టు అదనపు డీజీ క్యాడర్‌ అధికారికి సంబంధించింది. ఆనంద్‌ 2021 డిసెంబర్‌ 25 నుంచి నగర పోలీసు కమిషనర్‌గా పని చేశారు. ఆయనకు ఈ ఏడాది ఆగస్టు 8న డీజీపీగా పదోన్నతి వచ్చినప్పటికీ ఎక్స్‌ క్యాడర్‌ పోస్టు సృష్టించిన ప్రభుత్వం హైదరాబాద్‌ కొత్వాల్‌గా కొనసాగించింది. గతంలోనూ ఐదు సందర్భాల్లో డీజీపీగా పదోన్నతి పొందిన అధికారులు హైదరాబాద్‌ సీపీగా పని చేశారు. ఈ హోదాలో ఉన్న వారిని నగర కొత్వాల్‌గా నియమించిన దాఖలాలు లేవు. కేవలం ఈ పోస్టులో పని చేస్తూ, పదోన్నతి పొంది, ఎక్స్‌ క్యాడర్‌ పోస్టులో కొనసాగిన వారే ఉన్నారు.

తెరపైకి కొత్త పేర్లు?
ఆనంద్‌తో పాటు పదోన్నతి పొందిన వారిలో జితేందర్‌ కూడా ఉన్నారు. ఈయన గతంలో నగర ట్రాఫిక్‌ చీఫ్‌గా, పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా, అదనపు డీజీపీగా (శాంతిభద్రతలు) పని చేసి ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈయన పేరును కేంద్ర ఎన్నికల సంఘం పరిగణలోకి తీసుకుంటుందా? లేక అదనపు డీజీ హోదాలో ఉన్న మరో అధికారి పేరును పంపాల్సిందిగా కోరుతుందా? అనే సందేహం నెలకొంది.

అలా కోరితే 1994 బ్యాచ్‌కే చెందిన బి.శివధర్‌రెడ్డికి జాబితాలో చోటు దక్కుతుంది. సందీప్‌ శాండిల్యకు దక్షిణ మండల డీసీపీ, సైబరాబాద్‌ సీపీ, రైల్వేస్‌ డీజీగా పని చేసిన అనుభవం ఉంది. ప్రస్తుతం తెలంగాణ పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఏడీజీ ఆపరేషన్స్‌ హోదాలో ఉన్న కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సుదీర్ఘకాలంగా లూప్‌లైన్‌లోనే ఉన్నారు. ఎన్నికల సంఘం సీనియారిటీ, గతంలో చేసిన పోస్టులు, సమర్థత ఆధారంగా హైదరాబాద్‌ సీపీని ఎంపిక చేయాలని భావిస్తే కొత్తగా మరికొన్ని పేర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు