అమ్మవారికి ప్రీతిపాత్రుడు పోతరాజే..

14 Jul, 2014 02:08 IST|Sakshi
లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి ఆలయం వద్ద భక్త జనసందోహం నడుమ నృత్యం చేస్తున్న పోతరాజు
  • జాతరలో చెర్నాకోలుతో విన్యాసాలు
  • గుమ్మడికాయతో బలిదానం
  • లాల్‌దర్వాజా ఆలయంలో ‘పోసాని’ కుటుంబం రికార్డు
  • అమ్మవారి సేవలో తరిస్తున్న మూడు తరాలు
  • వందేళ్లుగా కొనసాగుతోన్న ఆనవాయితీ
  • ఈసారి కొత్తగా గజ్జె కట్టనున్న పోసాని హేమానంద్
  • చాంద్రాయణగుట్ట: జాతర అనగానే ప్రధానంగా గుర్తుకువచ్చేది పోతరాజు విన్యాసాలు. ఒంటి నిండాపసుపు, కుంకుమ రుద్దుకొని... చేతిలో చెర్నాకోలు... కళ్లకు కాటుక... నోట్లో నిమ్మకాయలతో నృత్యం చేస్తూ వేలాది మంది భక్తజన సందోహం నడుమ పోతరాజు చేసే సందడి అంతా ఇంతా కాదు. గజ్జెకట్టి పోతరాజు వేసే ఒక్కో అడుగుకు ఎంతో ప్రాధాన్యముంటుంది. అమ్మవారికి నైవేద్యం సమర్పించే సమయంలో అతను చేసే నృత్యాలు, హావభావాలు, కొరడా ఝుళిపించడం తదితర విన్యాసాలు అందరిని అలరిస్తాయి. లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి దేవాలయ జాతరలో ఇలాంటి ప్రధానమైన తంతును లాల్‌దర్వాజా మేకలబండకు చెందిన ‘పోసాని’ కుటుంబం నిర్వహిస్తోంది. దాదాపు వందేళ్లుగా జాతర సమయంలో అమ్మవారికి సేవలందిస్తున్నారు.
     
    పోసాని కుటుంబానికి వందేళ్ల చరిత్ర..
    లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి అమ్మవారి ఆలయం తరఫున నిజాం కాలం నుంచి పోతరాజు వేషధారణలో పోసాని కుటుంబం వందేళ్ల చరిత్రను సొంతం చేసుకుంది. 1908వ సంవత్సరంలో ఆలయంలో బోనాలు ప్రారంభమయ్యాయి. ఆ తరువాత కాలంలో ఈ కుటుంబ సభ్యులు పోతరాజు వేషధారణలో సేవలందించడం ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే వంశానికి చెందిన మూడో తరానికి చెందిన వారు ఆ ఆనవాయితీని కొనసాగించడం విశేషం. పోసాని బాబయ్య ఎలియాస్ సింగారం బాబయ్యతో పోతరాజు వేషధారణ ప్రారంభమైంది. బాబయ్య తమ్ముడు ఎట్టయ్య, బాబయ్య కుమారుడు లింగమయ్య, లింగమయ్య తమ్ముడు సత్తయ్య, లింగమయ్య కుమారుడు బాబూరావు, బాబూరావు సోదరుడు సుధాకర్ ఇలా ఇప్పటివరకు ఆరుగురు ఒకే వంశం నుంచి సేవలందించారు. ఈ సారి బోనాల ఉత్సవాల సందర్భంగా బాబూరావు తమ్ముడు పోసాని హేమానంద్ తొలిసారిగా పోతరాజు సేవలందించేందుకు ముందుకు వస్తున్నారు.
     
    దున్నపోతు నుంచి గుమ్మడికాయ వరకు..
    అప్పట్లో మేకల బండనుంచి దున్నపోతుపై ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి వచ్చేవారు. ఆ దున్నపోతును పన్నుతో అదిమి పట్టి అమ్మవారికి బలిచ్చేవారు. తరువాత రోజుల్లో మేకను బలిచ్చారు. జంతు బలిని నిషేధించడంతో గుమ్మడికాయతో పోతరాజు శాంతిస్తున్నాడు.
     
    పోతరాజంటే..
    పోతరాజంటే ఏడుగురు అక్కల ముద్దుల తమ్ముడు. అమ్మవారిని పొలిమెర నుంచి గ్రామంలోని దేవాలయానికి తీసుకొచ్చేటప్పుడు, అనంతరం సాగనంపేటప్పుడు రక్షణగా ముందు నడుస్తూ ఉంటారు. డప్పుచప్పుళ్లకనుగుణంగా ఆనందంతో నృత్యం చేస్తూ స్వాగతిస్తుంటారు. ఏడుగురు అక్కాచెల్లెల్లైన అమ్మవార్లకు ఈ పోతరాజంటే అమితానందం. ఆయన సూచించిన రహదారిలో నడుస్తూ దేవాలయానికి తరలి వస్తారు. ఆయన గావుతో శాంతించి పొలిమెర దాటుతారు.
     
    దీక్షతో...
    పోతరాజు వేషధారణ అంటే నియమంతో కూ డుకున్నది. ఘటాలను దేవాలయంలో ప్రతిష్ఠిం చిన నాటి నుంచి దీక్షతో ఉంటూ అమ్మవారిని పూజిస్తారు. పోతరాజుగా నృత్యం చేసేవారు  ముందురోజు నుంచే ఉపవాస దీక్షలో ఉం టారు. శాంతి అయ్యే వరకు మత్తు పదార్థాలను, ఆహారాన్ని తీసుకునేందుకు వీలు లేదు. కేవలం అమ్మవారి ధ్యానంలోనే గడుపుతారు.

    కొరడా దెబ్బల కోసం...
     పోతరాజు కొరడా దెబ్బల కోసం భక్తులు పోటీపడతారు. కొరడా దెబ్బలను తింటే దుష్ట శక్తులు ఆవహించవని ప్రతీతి. దీంతో భక్తులు కొరడా దెబ్బలు తినేందుకు పోటీ పడుతుంటారు.
     
    అమ్మ ఆశీర్వాదంతోనే 30 ఏళ్లపాటు..
    లాల్‌దర్వాజా సింహవాహిణి మహంకాళి అమ్మవారి ఆశీర్వాదంతోనే నేను 30 ఏళ్లపాటు పోతరాజుగా అలరించాను. ఘట స్థాపన నుంచి ఊరేగింపు వరకు ఎంతో నిష్టతో ఉండేవాడిని. ముఖ్యంగా వేషధారణ చేసే సోమవారం రోజున ఉపవాస దీక్ష పాటిస్తాం. అమ్మ దయతోనే ఇప్పటివరకు నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నా. దశాబ్దాలుగా పోతరాజుగా వ్యవహరించడంతో నా ఇంటిపేరు పోతరాజుగా మారింది.           - పోతరాజు (పోసాని) బాబూరావు
     

    అదృష్టంగా భావిస్తున్నా..
    నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో వారిని పోతరాజు వేషధారణలో చూస్తున్నా. ఈ సారి నేను తొలిసారిగా పోతరాజుగా వేషం కట్టనున్నాను. మొదటిసారి అయినప్పటికీ నాకెలాంటి భయం లేదు. ఘట స్థాపన రోజు నుంచి నియమ నిష్టలతో ఉంటూ అమ్మవారి ధ్యానంలో నిమగ్నమయ్యా. అమ్మవారి కరుణతోనే ఈ సారి పోతరాజు విన్యాసాలు చేసే అవకాశం రానుంది.
    - పోసాని హేమానంద్

మరిన్ని వార్తలు