రాష్ట్రంలో యూకే పెట్టుబడులు

5 Aug, 2016 03:54 IST|Sakshi
రాష్ట్రంలో యూకే పెట్టుబడులు

సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలోనే పెట్టుబడులకు అనువైన వాతావరణం ఉందని యునెటైడ్ కింగ్‌డమ్ (యూకే) ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ ప్రతినిధి బృందం కితాబిచ్చింది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో సులభ వాణిజ్యాన్ని (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పరిశీలించడంలో భాగంగా రాష్ట్రానికి విచ్చేసిన ప్రతినిధి బృందం...రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌తో గురువారం సచివాలయంలో సమావేశమైంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అనువైన వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని తమ పెట్టుబడులను తెలంగాణకు వచ్చేలా సహకరిస్తామని హామీ ఇచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌ను ప్రశంసించిన యూకే ప్రతినిధి బృందం.. తమ దేశంలోని పలు పారిశ్రామిక విధానాలను తెలంగాణలోనూ ప్రవేశపెట్టాలని సూచించింది. లాభనష్టాల అంచనా, ఎగ్జిట్ విధానం, సంస్కరణల్లో సున్నితత్వం, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై సలహాలిచ్చింది. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ ఆయా సలహాలను సానుకూలంగా పరిశీలిస్తామని యూకే బృందానికి హామీ ఇచ్చారు. దేశంలో కొత్త రాష్ర్టంగా ఆవిర్భవించిన తెలంగాణ వినూత్న ఆలోచనలు, విధానాలతో ముందుకు సాగుతోందన్నారు. పరిశ్రమ లు, ఐటీ సంస్థల భాగస్వామ్యంతోనే నూతన పారిశ్రామిక, ఐటీ పాలసీలను రూపొందించినట్లు చెప్పారు.

ఫిక్కీ, సీఐఐ వంటి పారిశ్రామిక సంఘాలతో పలుమార్లు సమావేశమై నూతన పాలసీలను తయారు చేశామన్నారు. విధానాల అమలుపైనా ఆయా సంఘాల నుంచి వచ్చే సలహాలు స్వీకరిస్తూ సులభ వాణిజ్యం కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. కేటీఆర్‌ను కలసిన ప్రతినిధి బృందంలో బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ (హైదరాబాద్) ఆండ్రూ మెక్ అలిస్టర్, ఫిల్ ఓవెన్స్, రేచల్ హాలోవే తదితరులు ఉన్నారు. ఈ భేటీలో పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు