గిన్నిస్ రికార్డుల్లో 'బతుకమ్మ'

8 Oct, 2016 19:57 IST|Sakshi
గిన్నిస్ రికార్డుల్లో 'బతుకమ్మ'
హైదరాబాద్ : తెలంగాణ సాంస్కృతిక వేడుక బతుకమ్మ పండుగ గిన్నిస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డు సాధించింది.  ఎన్నో రోజులుగా అధికార యంత్రాంగం చేసిన ప్రయత్నం ఫలించింది. వరుణుడు కొద్ది సేపు బయపెట్టి తెలంగాణ ఆడబిడ్డల చేతిలో రికార్డ్‌ను అందించాడు. వర్షం కారణంగా తీవ్ర ఒత్తిడి గురైన పర్యాటక, సాంస్కృతిక, జీహెచ్‌ఎంసీ అధికారులు వర్షం తగ్గుముఖం పట్టే సరికి ఊపిరి పీల్చుకున్నారు. చివరికి పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం దిగ్విజయం గిన్నిస్ రికార్డ్ సాధించామని ప్రకటించారు. తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ సానియా మీర్జా, ఒలింపిక్స్ రజక పతక విజేత, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఈ వేడుకల్లో చీరకట్టుతో విచ్చేసిన విదేశీ వనితలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 
 
సాయంత్రం 5.12 గంటలకు గిన్నిస్ రికార్డ్స్ పరిశీలనకు జయసింహ(హైదరాబాద్), కుమరన్(బెంగుళూరు), బెల్ది శ్రీధర్, బెల్ది కార్తీక్ గిన్నిస్ బుక్ రికార్డ్స్‌కు విజిల్ ప్రకటించారు. బతుకమ్మ చుట్టూ ఉన్న మహిళలు ఒక్కసారిగా నృత్యం ప్రారంభించారు. తిరిగి సాయంత్రం 5.25 గంటలకు గిన్నిస్ రికార్డ్స్ పరిశీలకు జయసింహ రికార్డ్ పూర్తి అయిందంటూ విజిల్ మోగించారు. మొత్తం ఎల్‌బీ స్టేడియంలో 10,029 మంది మహిళలు ఉండగా బతుకమ్మ చుట్టూ 9,292 మంది మహిళలు చేరి మహా బతుకమ్మ నృత్యంలో పాల్గొన్నారు. కేరళలో ఓనం పండుగకు 5,211 మంది మహిళలు ఒకేసారి నృత్య ప్రదర్శన చేసి గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. దాన్ని ఇప్పుడు తెలంగాణ ఆడ బిడ్డలు అధిగమించారు.  ఎల్బీ స్టేడియంలో రంగురంగుల పూలతో 20 అడుగుల ఎత్తైన మహా బతుకమ్మను అలంకరించారు. 35 వరుసల్లో మహిళలు బతుకమ్మ చుట్టూ ఆడుతూ సందడి వాతావరణం నెలకొల్పారు. బతుకమ్మ పండుగ శోభతో ఎల్బీ స్టేడియం ప్రాంగణం కళకళలాడింది.

మరిన్ని వార్తలు