కాంగ్రెస్‌ పార్టీని బేరం పెట్టారు

12 Nov, 2023 03:44 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీ కి  పాల్వాయి స్రవంతి రాజీనామా 

టికెట్లు అమ్ముకున్న నాయకులు గాంధీభవన్‌ అమ్మేస్తారు 

నేడు ప్రగతిభవన్‌లో బీఆర్‌ఎస్‌లో చేరనున్న స్రవంతి 

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/ పంజగుట్ట (హైదరాబాద్‌): కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి పాల్వాయి గోవర్దన్‌రెడ్డి కూతురు, ఏఐసీసీ సభ్యురాలు పాల్వాయి స్రవంతి కాంగ్రెస్‌ పార్టీని వీడారు. ఈ మేరకు శనివారం ఆమె సోనియాగాంధీ, రాహుల్‌ గాం«దీకి తన రాజీనామా లేఖను పంపించారు. తనపై ఉన్న ఒత్తిడి మేరకు బరువెక్కిన హృదయంతో కాంగ్రెస్‌ పార్టీని వీడాల్సి వచ్చి0దని ఆ లేఖలో పేర్కొన్నారు. అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరులతో మాట్లాడుతూ...పేదలు, బడుగు, బలహీనవర్గాలకు అండగా ఉండే కాంగ్రెస్‌ పార్టీని నిలువెత్తు బేరం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలతో కాకుండా డబ్బుతో నడుస్తుందన్నారు. ఇప్పుడు టికెట్లు అమ్ముకుంటున్న నాయకులు రేపు గాందీభవన్‌ను కూడా అమ్మేస్తారని అందుకే ఇటువంటి పాvలో తాను కొనసాగలేనని చెప్పారు. 2014లో పొత్తులో భాగంగా సీపీఐకి టికెట్‌ ఇచ్చారని, 2018లో రాజ్‌గోపాల్‌రెడ్డికి ఇస్తే పార్టీ ఆదేశాలమేరకు ఆయన గెలుపుకోసం పనిచేశానని ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ చచ్చిపోయింది అని జెండా కిందపడేసిన రాజ్‌గోపాల్‌రెడ్డికి పాvలోకి వచ్చిన 24 గంటల్లో టికెట్‌ కేటాయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పారాచూట్‌లకు స్థానంలేదన్న పార్టీలో 50 మంది పారాచూట్‌ అభ్యర్థులకు టికెట్లు కేటాయించారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ అంటే కోమటిరెడ్డి బ్రదర్స్‌ అన్న రీతిలో వ్యవహరిస్తున్న వారితో ఇమడలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్‌గోపాల్‌రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తానన్నారు. మంత్రులు జగదీశ్వర్‌రెడ్డి, కె.తారకరామారావు తన గౌరవానికి భంగం వాటిల్లకుండా చూస్తామని ఇటీవల ఇచ్చిన హామీ మేరకు బీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాగా, ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ సమక్షంలో ఆమె బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోనున్నారు.

మరిన్ని వార్తలు