రేపు రాష్ట్ర బంద్

9 Sep, 2016 03:07 IST|Sakshi
రేపు రాష్ట్ర బంద్

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు
* అరుణ్ జైట్లీ, చంద్రబాబు వైఖరికి నిరసనగానే...
* జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరు?
* ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి
* బాబు సీఎంగా ఉండడానికి వీల్లేదు, వెంటనే రాజీనామా చేయాల్సిందే

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కు అయిన ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా తేల్చి చెప్పినందుకు, ఆయన ప్రకటనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించినందుకు నిరసనగా ఈ నెల 10వ తేదీన రాష్ట్ర బంద్ పాటించాలని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ అరుణ్ జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి చంద్రబాబు ఎవరని నిలదీశారు. ప్రత్యేక హోదా అనే ది చంద్రబాబు ఒక్కరి భవిష్యత్తుకు సంబంధించిన అంశం కాదని, 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు హోదాతో ముడిపడి ఉందని స్పష్టం చేశారు. జైట్లీ ప్రకటనను ఆహ్వానించిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడానికి వీల్లేదని, ఆయన రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పి, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే చరిత్రహీనుడుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
 
హోదా పోరును ఉధృతం చేయాలి

ప్రజలంతా కలిసికట్టుగా బంద్‌ను విజయవంతం చేసి, మన అసంతృప్తిని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయాలని, చంద్రబాబుపై మరింత ఒత్తిడి పెంచాలని వైఎస్ జగన్ కోరారు. గురువారం అసెంబ్లీకి రావడానికి ముందు తాను కమ్యూనిస్టు పార్టీల నేతలతో మాట్లాడానని, హోదా పోరాటంలో వారి సహకారం కోరానని చెప్పారు. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ప్రత్యేక హోదా పోరును ఉధృతం చేయాలని అన్నారు. అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి బంద్‌లో పాల్గొనాలని పేర్కొన్నారు.

ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ ఇస్తామని చెప్పి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజు గురువారం వైఎస్ జగన్‌తో సహా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల చొక్కాలు ధరించి, ప్లకార్డులు చేతబూని అసెంబ్లీ ప్రాంగణంలోకి పాదయాత్రగా వెళ్లారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కూడా పాదయాత్రకు సంఘీభావంగా వెంట నడిచారు. అంతకుముందు అసెంబ్లీ సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహం వద్ద వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. జైట్లీ, బాబు కలిసి రాష్ట్ర ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెట్టారని ధ్వజమెత్తారు. ఏపీకి సంబంధించి రాత్రిపూట అరుణ్ జైట్లీ ప్రకటన చేయడం, చంద్రబాబు అర్ధరా త్రి తరువాత మాట్లాడటాన్ని ఆయన తప్పు పట్టారు. ఈ సందర్భంగా జగన్ ఇంకా ఏం చెప్పారంటే...
 
యువత ఆశలను ఖూనీ చేశారు
‘‘అర్ధరాత్రి దాటిన తరువాత ప్రకటనలు చేసే పరిస్థితి చూస్తుంటే ఈ రాజకీయ నాయకుల్లో నిజాయితీ లేదనే విషయం స్పష్టమవుతోంది. నిజాయితీ ఉంటే, తాము తప్పు చేయడం లేదని భావిస్తే పట్టపగలే ప్రకటనలు చేసే వాళ్లు కానీ ఇలా అర్ధరాత్రి పూట చేయరు. వాస్తవానికి ప్రత్యేక హోదా అనేది ఏపీ హక్కు. విభజన వల్ల నష్టపోతున్న రాష్ట్రానికి ప్రత్యేక హోదాను పార్లమెంట్ సాక్షిగా ప్రకటించారు. బుధవారం అర్ధరాత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనను పరిశీలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమని మరింత సుస్పష్టంగా చెప్పినట్లు అర్థమవుతుంది.

ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ ప్రకటన వస్తుందని బుధవారం ఉదయం నుంచీ చంద్రబాబు మీడియాకు లీకులిస్తూ ఊదరగొట్టారు. అది చూసి ప్రత్యేక హోదాతో కూడిన ప్యాకేజీ వస్తుందని ప్రజలంతా ఆశగా ఎదురుచూశారు. చివరకు ప్రత్యేక హోదాకు మించిన ప్యాకేజీ కాదు కదా... ప్రజల చెవుల్లో క్యాబేజీలు పెడుతూ ప్రకటన చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రులను జైట్లీ పక్కన కూర్చోబెట్టి ప్రజల చెవుల్లో క్యాబేజీ ఎలా పెట్టాలో చెప్పి మరీ ఆ కార్యక్రమం చేయించారు. ప్రత్యేక హోదా అంటే అదేదో డబ్బుల రూపంలో ఇచ్చి పుచ్చుకునేదన్న అభిప్రాయాన్ని చంద్రబాబు కలిగించారు. కానీ, వాస్తవానికి ప్రత్యేక హోదా అనేది డబ్బులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం కాదు.

హోదా వల్ల రాష్ట్రానికి ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. వేల సంఖ్యలో పరిశ్రమలు వస్తాయి. మన పిల్లలకు లక్షల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కేంద్రం చేసిన ప్రకటన ఆంధ్రప్రదేశ్‌ను, ఇక్కడి యువత ఆశలను ఖూనీ చేసే విధంగా ఉంది. ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు. అరుణ్ జైట్లీ, చంద్రబాబు వైఖరికి నిరసనగా ఈ నెల 10న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నాం.
 
మనం స్పందిస్తేనే ప్రభుత్వంపై ఒత్తిడి
చంద్రబాబును ప్రశ్నిస్తున్నా... అసలు జైట్లీ ప్రకటనను ఆహ్వానించడానికి ఆయనెవరు? ఇదేమైనా చంద్రబాబు ఒక్కరి భవిష్యత్తా? ఐదు కోట్ల మంది ప్రజల భవిష్యత్తు ప్రత్యేక హోదాతో ముడిపడి ఉంది. జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించడానికి అందరమూ ఒక్కటవుదాం. రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేద్దాం. సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలి. ఇలాంటప్పుడు మనం వెంటనే స్పందిస్తేనే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. కేంద్రంలో ఉన్న టీడీపీ మంత్రులను ఉపసంహరించుకుంటున్నాను, మీకు మద్దతు కొనసాగించను అని ఏరోజైతే చంద్రబాబు చెబుతారో ఆరోజే మనకు ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు మెరుగవుతాయి.

చంద్రబాబుపై ఒత్తిడి పెరగాలన్నా... ఆయన మనసు మారాలన్నా... రాష్ట్ర ప్రజలంతా కలిసి ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే ఒప్పుకోబోమని బంద్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి. రాష్ట్రానికి హోదా కోసం అసెంబ్లీలో కూడా మేము గట్టిగా పట్టుపడతాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వబోమంటూ కేంద్రం చేసిన ప్రకటనకు నిరసనగా ఇవాళ పాదయాత్ర చేస్తున్నాం’’ అని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.
 
బాబు ఆమోదం తర్వాతే కేంద్రం ప్రకటన
‘‘చంద్రబాబులో నిజాయితీ, విశ్వసనీయత, విలువలు లేవు. ఆయన తన స్వార్థం కోసం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను నడిరోడ్డున పడేశారు. ఒక పద్ధతి ప్రకారం ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని ఒకసారి చెప్పారు. ప్రజలు తిరగబడేసరికి ప్రత్యేక హోదా జీవన్మరణ సమస్య అన్నారు. గతంలో జైట్లీ చేసిన ప్రకటనతో తన రక్తం మరిగిపోయిందని చంద్రబాబు చెప్పారు. మరి ఇప్పుడు ఆ రక్తం మురిగిపోయిందా? కుళ్లిపోయిందా? చంద్రబాబు స్వయంగా రూపొందించిన డ్రాఫ్ట్‌ను కేంద్రంలోని తన మంత్రులకు పంపించి జైట్లీ చేత చదివించారు. దాన్ని ఆహ్వానిస్తున్నామని చెప్పారు. చంద్రబాబు డ్రాఫ్టుకు ఆమోదం తెలిపిన తరువాతే కేంద్రం ప్రకటన చేసిందని నేను మీడియాలో విన్నాను. ఓటుకు కోట్లు కేసులో ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు అందులో నుంచి బయటపడేందుకే జైట్లీ ప్రకటనను ఆహ్వానించారు’’ అని వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు.
 
5 కోట్ల మందిని అమ్మేశారు
ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు కోట్లు కేసుతో రాజీపడి, తన స్వార్థం కోసం ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలను అమ్మేశారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడిన అనంతరం ఆయన తన చాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. తొలి నుంచీ ప్రత్యేక హోదా అంశాన్ని నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారని జగన్ దుయ్యబట్టారు. నిన్న టీవీలు చూసిన వారంతా చంద్రబాబు సీఎంగా ఉండటం ఖర్మగా భావించారని చెప్పారు.
 
విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టు
‘‘నిజంగా బుధవారం చంద్రబాబు డ్రామాను బాగా రక్తి కట్టించారు. ప్రత్యేక హోదాను డబ్బుతో ముడిపెట్టడం తగదు. విభజన చట్టంలోని అంశాలనే ప్యాకేజీ అంటూ కేంద్రంతో చెప్పించారు. ప్రత్యేక హోదాకు కత్తెర వేశారు. రాష్ట్రాన్ని మోసం చేసినందుకు ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి. కేంద్రంలోని తన మంత్రులను ఉపసంహరించుకోవాలి. విభజన చట్టంలోనే పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. మిగిలిన కారిడార్‌లు కూడా విభజన చట్టంలోనే ఉన్నాయి. చట్టంలోని అంశాల విలువలన్నీ కలిపేసి అదే కొత్తగా ప్యాకేజీ అంటున్నారు. హక్కుగా రావాల్సిన వాటికి, ప్రత్యేక హోదాకు కేంద్రం కత్తెర వేస్తుంటే చంద్రబాబు ఆనందించడానికి ఓటుకు కోట్లు కేసే కారణం. చంద్రబాబు ఇప్పటికైనా ప్రజలకు క్షమాపణ చెప్పి, ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించాలి’’ అని జగన్ డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు