సంక్షోభంలో వ్యవసాయం

31 Jan, 2017 03:08 IST|Sakshi
సంక్షోభంలో వ్యవసాయం

ఈ ఘనత కేసీఆర్‌దే: ఉత్తమ్‌
హుజూర్‌నగర్‌: రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమ ర్శించారు. సోమవారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆయన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుత యాసంగి పంటకు గత అక్టోబర్‌ నుంచి బ్యాంకుల ద్వారా రూ.13వేల కోట్ల రుణాలు రైతులకు అందజేయాల్సి ఉన్నా ఇప్పటి వరకు కేవలం రూ.7,500 కోట్లే ఇచ్చినట్లు తెలిపారు. నోట్ల రద్దు వల్ల ప్రైవేట్‌ వడ్డీ వ్యాపారస్తుల వద్ద నోట్ల కొరత తీవ్రంగా ఉండటంతో రైతులకు అప్పులు కూడా పుట్టడం లేదన్నారు.

తమ స్వార్థం కోసం, ప్రధానమంత్రి మెప్పు కోసం సీఎం కేసీఆర్‌ నోట్ల రద్దుకు మద్దతు పలుకుతున్నారన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తా మని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పట్టించుకోకపోవడం శోచ నీయమన్నారు. వానాకాలంలో రైతులు సాగు చేసిన కంది, సోయా, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర రాక  అప్పు ల పాలై యాసంగి పంటకు పెట్టుబడులు దొరక్క అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శాసనసభలో కాంగ్రెస్‌ డిమాండ్‌ మేరకు సీఎం పలురకాల హామీలిచ్చి నేటికీ అమలుచేయక పోవడం దారుణమన్నారు. రుణమాఫీ మూడో దఫా నిధులను విడుదల చేయాల్సి ఉన్నా నేటి వరకు పూర్తికాలేదన్నారు.

పంట రుణాలపై వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని శాసనసభలో సీఎం హామీ ఇచ్చినప్పటికీ బ్యాంకర్లు రైతుల ముక్కుపిండి వడ్డీలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం 2015కి పంట నష్ట పరిహారం కింద రూ.720 కోట్లు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం ఇతర ప్రయోజనాలకు ఉపయోగించుకుందని అన్నారు. సమావేశంలో కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్‌ పద్మావతి, ఐఎన్ టీయుసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యరగాని నాగన్నగౌడ్, తన్నీరు మల్లికార్జున్ రావు, చిట్యాల అమర్‌నాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు