నీటి కేటాయింపులు మళ్లీ జరపాలి

8 Apr, 2016 00:57 IST|Sakshi

* కృష్ణా జలాల పంపిణీ నాలుగు రాష్ట్రాల సమస్య
* బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు
* తదుపరి విచారణ మే 9, 10, 11కు వాయిదా  

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం... కృష్ణా జలాల పంపిణీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం కాదని, నది పరీవాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల ప్రాజెక్ట్‌లకు జలాలను మళ్లీ పంచాలని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదిఏకే గంగూలీ వాదించారు. కృష్ణా జలాల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు గురువారం కృష్ణా నది పరీవాహక రాష్ట్రాల వాదనలు కొనసాగాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ  మాత్రమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలో కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లకు కొత్తగా నీటి కేటాయింపులు జరగాలని ఏకే గంగూలీ వాదించారు. కృష్ణా నది 4 రాష్ట్రాల్లో ప్రవహిస్తోందని, అందువల్ల ఇది 4 రాష్ట్రాల సమస్య అని వెల్లడించారు.
 
అసంపూర్తిగా ముగిసిన వాదనలు: గతంలో పంజాబ్ విభజన సమయంలో రావి, బియాస్ నదుల జలాల పంపకానికి ట్రిబ్యునల్ ఏర్పాటును విభజన చట్టంలోనే పొందుపర్చారని గంగూలీ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించే సమయానికి కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ పని చేస్తోందని, అందువల్ల ట్రిబ్యునల్ అంశాన్ని చట్టంలో ప్రస్తావించలేదన్నారు. ట్రిబ్యునల్ ముందు గంగూలీ వాదన గురువారం అసంపూర్తిగా ముగిసింది. తదుపరి విచారణను మే 9, 10, 11 తేదీల్లో చేపడతామని ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్ కుమార్ ప్రకటించారు. అంతకు ముందు మహారాష్ట్ర తరఫు న్యాయవాది అంధ్యార్జున వాదనలు వినిపించారు.

మరిన్ని వార్తలు