మహిళల భద్రతకు పెద్దపీట

29 Mar, 2016 01:12 IST|Sakshi
మహిళల భద్రతకు పెద్దపీట

సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ఈవ్‌టీజింగ్, చైన్‌స్నాచింగ్ వంటి నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. అన్ని జిల్లాల్లో షీటీమ్‌లను ఏర్పాటు చేసి మహిళలకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. షీ టీమ్‌ల ఏర్పాటుపై సోమవారం అసెంబ్లీలో టీఆర్‌ఎస్ సభ్యురాలు కొండా సురేఖ అడిగిన స్వల్పకాలిక ప్రశ్నకు హోంమంత్రి సమాధానమిచ్చారు. ఇప్పటికే ప్రతి జిల్లాలో రెండు షీ టీమ్‌లను ఏర్పాటు చేశామని, అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లోనూ వీటిని ఏర్పాటు చేస్తామని నాయిని తెలిపారు. పదేపదే తప్పులు చేసే వారిపై నిర్భయ కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో గతంలో పోలిస్తే చైన్‌స్నాచింగ్ కేసులు 14శాతం తగ్గాయని   హోంమంత్రి నాయిని తెలిపారు.   

 రౌడీషీట్‌లు తెరవాలి: కొండా సురేఖ
 ఈవ్‌టీజర్లపై రౌడీషీట్‌ల ను తెరవాలని ఎమ్మెల్యే కొండాసురేఖ విజ్ఞప్తి చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఉమెన్‌డెస్క్‌ను ఏర్పాటు చేయాలన్నారు.  

 షీ టీమ్‌లను పెంచండి
  షీ టీమ్‌ల సంఖ్యను పెంచాలని ఎమ్మెల్యే గీతారెడ్డి సూచించారు. చైన్ స్నాచింగ్‌లు జరుగకుండా భయం కలిగేలా చర్యలుండాలన్నారు.

 తక్షణ సాయానికి ఫైర్ మోటార్ సైకిళ్లు
 అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి వేగంగా చేరుకునేందుకు ఫైర్ మోటార్ సైకిళ్లను ప్రవేశపెట్టామని ఎమ్మెల్యే గాదరి కిశోర్ అడిగిన ప్రశ్నకు హోంమంత్రి బదులిచ్చారు.

మరిన్ని వార్తలు