2,3 తేదీల్లో వైఎస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటన

1 Sep, 2016 08:32 IST|Sakshi
2,3 తేదీల్లో వైఎస్ఆర్ జిల్లాలో జగన్ పర్యటన

పులివెందుల : ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సెప్టెంబర్‌ 2, 3 తేదీల్లో వైఎస్సార్‌ జిల్లాలో పర్యటిస్తారని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా రెండో తేదీన ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబ సభ్యులతో కలసి జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారని ఆయన వెల్లడించారు. మూడో తేదీన కడప కలెక్టరేట్‌ ఎదుట జరిగే రైతు మహాధర్నాలో ప్రతిపక్ష నేత పాల్గొంటారని తెలిపారు. ఇవిగాక ఇంకా పలు కార్యక్రమాల్లోనూ వైఎస్‌ జగన్‌ పాల్గొననున్నారని పేర్కొన్నారు.

ప్రతిపక్ష నేత పర్యటన షెడ్యూలు ఇలా..
వైఎస్‌ జగన్‌ గురువారం సాయంత్రం బెంగళూరు నుంచి బయల్దేరి రాత్రికి నేరుగా ఇడుపులపాయకు చేరుకుంటారు. 2వ తేదీ శుక్రవారం ఉదయం 7.30కు తన తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద కుటుంబసభ్యులతో కలసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు గెస్ట్‌హౌస్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. మధ్యాహ్నం వేంపల్లెకు చేరుకుని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ్నుంచీ పులివెందులకు చేరుకుని మధ్యాహ్నం 2.30 గంటలకు స్థానిక రిలయన్స్‌ పెట్రోలుబంక్‌ నుంచి బెస్తవారిపల్లె వరకు పర్యావరణ పరిరక్షణకోసం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. 3గంటలకు పులివెందుల మండలం ఎర్రిపల్లె సమీపంలో దెబ్బతిన్న వేరుశనగ పంటను పరిశీలిస్తారు. 3.30కు పులివెందులలోని సీఎస్‌ఐ చర్చి వద్ద నూతనంగా నిర్మించిన ఆర్‌వో ప్లాంటును ప్రారంభిస్తారు. 4.30కు కడప రోడ్డులో గల తన చిన్నాన్న వైఎస్‌ జోసఫ్‌రెడ్డి ఇంటిని సందర్శిస్తారు. 
 
జగన్‌మోహన్‌రెడ్డి 3వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు పులివెందుల నుంచి కడపకు రోడ్డుమార్గాన వెళ్లి 10.30 గంటలకు నూతన కలెక్టర్‌ కార్యాలయం ఎదుట జరిగే రైతు మహాధర్నాలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు లింగాల మండలం ఇంటిఓబాయపల్లెలోని ఎంపీటీసీ రమణ ఇంటికి చేరుకుని ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7గంటలకు పులివెందులలోని టీటీడీ కల్యాణ మండపానికి చేరుకుని పెద్దజూటూరు పార్టీ నాయకుడు రామచంద్రారెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్‌లో పాల్గొంటారు. రాత్రి 9గంటలకు ముద్దనూరుకు చేరుకొని వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌కు బయల్దేరి వెళతారు.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా