గూగుల్ సీఈవో మరో ఘనత

25 Jul, 2017 13:32 IST|Sakshi

శాన్‌ ఫ్రాన్సిస్‌కో: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్(‌45) మరో ఘనతను సాధించారు. చెన్నైకు చెందిన ఐఐటీ పూర్వ విద్యార్థి
 భారత సంతతికి చెందిన టెక్‌ నిపుణుడు తన ఖాతాలో మరో  విశిఫ్టతను చేర్చుకున్నారు. గత  రెండేళ్లుగా  గూగుల్‌ సంస్థను విజయవంతంగా నడిపిస్తున్న సుందర్ పిచాయ్ తాజాగా  గూగుల్‌ పేరెంటల్‌ కంపెనీ, గ్లోబల్‌ టెక్‌ దిగ్గజం అల్పాబెట్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌కు ఎంపికయ్యారు. 

యూ ట్యూబ్‌, గూగుల్‌  యాజమాన్య సంస్థ అయిన ఆల్పాబెట్‌ బోర్డుకు పిచాయ్‌ నియమితులయ్యారు. గూగుల్  సీఈవోగా    సుందర్‌  మంచి  కృషిని కొనసాగిస్తున్నారని, భాగస్వామ్యాలు, అద్భుతమైన నూతన ఆవిష్కరణలతో బలమైన అభివృద్ధిని నమోదు  చేస్తున్నారని ఆల్ఫాబెట్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 26 బిలియన్ డాలర్ల అమ్మకాలపై 3.5 బిలియన్‌ డాలర్ల నికర ఆదాయం  సాధించినట్టు తెలిపింది.  అలాగే యూరోపియన్ యూనియన్ విధించిన  యాంటీ ట్రస్ట్‌ ఫైన్‌ (2.7 బిలియన్ డాలర్లు)లేకపోతే రికార్డ్‌ స్థాయి భారీ లాభాలను సాధించేవారమని పేర్కొంది.  ఆల్ఫాబెట్ ఇంక్. సోమవారం ప్రకటించిన త్రైమాసిక  ఫలితాల్లో ఆదాయంలో  21 శాతం పెరుగుదలను నమోదు చేసింది. గూగుల్ ప్రకటన ఆదాయం 18.4 శాతం పెరిగి 22.67 బిలియన్ డాలర్లకు చేరింది. మరోవైపు ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా సంస్థ  డిజిటల్  యాడ్‌ రెవెన్యూ 73.75 బిలియన్‌ డాలర్లుగా నమోదుకానుందని  అంచనా. ఫేస్‌బుక్‌ 36.29 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని పరిశోధనా సంస్థ ఇమార్కెటర్ తెలిపింది. మొత్తం  మార్కెట్లో ఇరు కంపెనీలు 49 శాతం వాటా ఉంటుందని తెలిపింది.


కాగా  సుందర్‌ పిచాయ్‌ 2004లో గూగుల్‌ చేరారు.   2015 ఆగస్టులో  గూగుల్‌   చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు
 

మరిన్ని వార్తలు