Israel-Hamas War: గాల్లో వేలాది ప్రాణాలు!

12 Nov, 2023 04:56 IST|Sakshi

గాజాలో ఆస్పత్రుల ముంగిట మోహరించిన ఇజ్రాయెల్‌ సైన్యం

ప్రధానాసుపత్రి షిఫాలో కరెంటు బంద్‌

ఐసీయూ యూనిట్‌పై బాంబు దాడి

పూర్తిగా నిలిచిపోయిన వైద్య సేవలు

అత్యధిక ఆస్పత్రుల్లో అదే పరిస్థితి

అల్లాడుతున్న రోగులు, పసికందులు

వైద్యమందక 100కు పైగా మృతి!

మృత్యుముఖంలోకి వేలాది మంది రోగులు

దెయిర్‌ అల్‌బలాహ్‌ (గాజా): గాజాలో మానవీయ సంక్షోభం క్రమంగా తీవ్ర రూపు దాలుస్తోంది. ఇజ్రాయెల్‌ ప్రతీకార దాడులు ఆస్పత్రుల ముంగిట్లోకి చేరడంతో పరిస్థితి దారుణంగా దిగజారుతోంది. ఇజ్రాయెల్‌ అష్టదిగ్బంధం దెబ్బకు కనీస సౌకర్యాలన్నీ నిలిచిపోవడంతో గాజాలో 20 ఆస్పత్రులు ఇప్పటికే పూర్తిగా స్తంభించిపోయాయి. మిగిలిన 15 ఆస్పత్రులూ అదే బాటన ఉన్నట్టు వార్తలొస్తున్నాయి.

కరెంటు సరఫరా లేక ప్రధాన ఆస్పత్రి అల్‌ షిఫాలో తశనివారం వైద్య పరికరాలన్నీ మూగవోయాయి. దాంతో వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. అల్‌ ఖుద్స్‌ ఆస్పత్రిలోనూ ఇదే పరిస్థితి. ఆ ఆస్పత్రికి ఏకంగా 20 మీటర్ల సమీపం దాకా సైన్యం చొచ్చుకొచి్చందని తెలుస్తోంది! దాంతో అందులోని 14 వేల మంది రోగులు, శరణార్థుల ప్రాణాల్లో గాల్లో దీపంగా మారాయి. విరామం లేకుండా దూసుకొస్తున్న తూటాలు, బాంబు వర్షం కారణంగా అల్‌ షిఫా ఆస్పత్రిలోని వేలాది మంది కూడా ప్రాణ భయంతో వణికిపోతున్నారు. అందులో 1,500 మందికి పైగా రోగులు, అంతే సంఖ్యలో వైద్య సిబ్బంది, 15 వేలకు పైగా శరణార్థులున్నట్టు చెబుతున్నారు.

వైద్య సేవలతో పాటు కరెంటు, ఆక్సిజన్‌ సరఫరాలు పూర్తిగా నిలిచిపోవడంతో పలు ఆస్పత్రుల్లో ఐసీయూల్లోని రోగులు, ఇంక్యుబేటర్లలోని చిన్నారులు నిస్సహాయంగా మృత్యుముఖానికి చేరువవుతున్నారు. ఇలా ఇప్పటికే 200 మందికి పైగా మరణించారని, మరికొన్ని వందల మంది మృత్యువుతో పోరాడుతున్నారని హమాస్‌ ఆరోగ్య శాఖ వర్గాలు చెబుతుండటం ఆందోళన కలిగిస్తోంది! ఈ పరిణామాలపై అంతర్జాతీయ సమాజం గగ్గోలు పెడుతున్నా ఇజ్రాయెల్‌ మాత్రం దాడులాపేందుకు ససేమిరా అంటోంది. కనీసం వాటికి విరామమిచ్చేందుకు కూడా ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ మరోసారి నిరాకరించారు.

షిఫా.. శిథిల చిత్రం
అల్‌ షిఫా ఆస్పత్రిలో తాగునీటితో పాటు ఆహార పదార్థాలు కూడా పూర్తిగా నిండుకున్నాయి. దాంతో వైద్యంతో సహా ఏ సేవలూ అందక రోగులు నిస్సహాయంగా మృత్యువాత పడుతున్నారు. శనివారమే 100 మందికి దుర్మరణం పాలైనట్టు హమాస్‌ పేర్కొంది. వీటికి తోడు ఐసీయూ విభాగంపై బాంబు దాడి జరిగింది. ఆస్పత్రిని ఇజ్రాయెల్‌ సైన్యం అన్నివైపుల నుంచీ దిగ్బంధించింది. అక్కడ హమాస్‌ ఉగ్రవాదులతో భీకరంగా పోరాడుతున్నట్టు ప్రకటించింది.

ఆస్పత్రి ప్రాంగణంతో పాటు పరిసరాలన్నీ బాంబు మోతలతో దద్దరిల్లుతున్నాయి. బాంబు దాడుల్లో రెండు అంబులెన్సులు తునాతునకలయ్యాయి. కనీసం రోగులు, క్షతగాత్రులను ఆస్పత్రి నుంచి మరో చోటికి తరలించే పరిస్థితి కూడా లేకుండా పోయింది. అడుగు కదిపినా స్నైపర్ల తూటాలు దూసుకొస్తున్నట్టు ఆస్పత్రి సిబ్బంది వాపోతున్నారు. ఈ ఆస్పత్రి కిందే ఉగ్రవాద సంస్థ హమాస్‌ ప్రధాన కార్యాలయముందని ఇజ్రాయెల్‌ మొదటినుంచీ ఆరోపిస్తుండటం తెలిసిందే.

అయితే అంతర్జాతీయ ఖండనల నేపథ్యంలో శనివారం సాయంత్రానికల్లా ఇజ్రాయెల్‌ మాట మార్చింది. అల్‌ షిఫా ఆస్పత్రిపై దాడులు జరపడం లేదని, అక్కణ్నుంచి వెళ్లిపోవాలనుకున్న వారికోసం కారిడార్‌ తెరిచే ఉంచామని చెప్పుకొచ్చింది. దాడుల్లో గాయపడుతున్న రెండు రోజులుగా ప్రధానంగా అల్‌ అహిల్‌ ఆస్పత్రికి తరలిస్తున్నారు. కానీ అక్కడ కూడా మౌలిక సదుపాయాలేవీ లేకపోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. కారిడార్లతో పాటు ఎక్కడ పడితే అక్కడ రోగులను నిస్సహాయంగా వదిలేసిన దృశ్యాలు హృదయాలను కలచివేస్తున్నాయి.  

పడకేసిన వైద్యం
గాజా అంతటా వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టేనని అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న ఐరాస సంస్థలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ‘‘గాజాలోని మొత్తం 35 ఆస్పత్రులూ చేతులెత్తేసినట్టే. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది’’ అని అవి చెబుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉత్తర గాజాలోని అల్‌ నస్ర్, అల్‌ రంటిసి సహా చాలా ఆస్పత్రులు సైనిక దిగ్బంధంలో ఉన్నాయి. దీనికి తోడు గాజావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అత్యధికం ఎప్పుడో మూతబడ్డాయి.

మరిన్ని వార్తలు